అపార్ట్​మెంట్లు, హాస్టల్స్, హోటల్స్​లో సిల్ట్​ చాంబర్లు మస్ట్... వాటర్​బోర్డు నోటీసులు

  • బిల్డింగ్స్ ఓనర్లు, నిర్వాహకులకు వాటర్​బోర్డు నోటీసులు
  • డిసెంబర్​ నెలాఖరు వరకు గడువు
  • ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం 

హైదరాబాద్​సిటీ, వెలుగు: అపార్ట్​మెంట్లు, హాస్టల్స్, హోటల్స్ ఇతర బహుళ అంతస్తుల భవన యజమానులు తప్పనిసరిగా సీవరేజీ పైప్​లైన్​కు, మ్యాన్​హోల్ కు మధ్య సిల్ట్ చాంబర్లు నిర్మించుకోవాలని వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి చెప్పారు. నిర్మించుకోని వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. సిల్ట్​చాంబర్లు లేకపోవడంతో వ్యర్థాలు అడ్డం పడి మ్యాన్​హోళ్లు పొంగుతున్నాయన్నారు.

ఇక నుంచి అపార్ట్​మెంట్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, హాస్టళ్లు, హాస్పిటల్స్, బేకరీల నిర్వాహకులు తప్పని సరిగా తమ భవనం నుంచి వెళ్లే సీవరేజీ లైన్​కు మ్యాన్​హోల్​కు మధ్య సిల్ట్​చాంబర్ నిర్మించుకునేలా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వేలాది మంది మ్యాన్​హోల్స్ పొంగడానికి, సీవరేజీ లైన్లకు లీకేజీలు ఏర్పడానికి వ్యర్థాలు పూడుకుపోవడం, అడ్డం పడడమేనని కారణమని అధికారులు గుర్తించారు. 90 రోజుల స్పెషల్​ డ్రైవ్​లో భాగంగా 50 వేలకు పైగా మ్యాన్​హోల్స్ లో పూడిక తీశామని ఎండీ అశోక్​రెడ్డి చెప్పారు. 

సిల్ట్​ చాంబర్​ ఉంటే.. 

అపార్ట్​మెంట్స్, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, మాల్స్, బేకరీల నుంచి వచ్చే మురుగు నీరంతా ముందుగా సిల్ట్ చాంబర్​లోకి చేరుతుంది. అందులో ఏవైనా ఘనపదార్థాలుంటే అక్కడ వడబోత జరుగుతుంది. కేవలం మురుగు నీరు మాత్రమే డ్రైనేజీ పైప్​లైన్​లో కలుస్తుంది. సిల్ట్​చాంబర్లు ఉంటే డ్రైనేజీ కాల్వలు, పైప్​లైన్లలో ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదు.

నీటిలో కరగని వ్యర్థాలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. సిల్ట్​చాంబర్ల నిర్మాణానికి డిసెంబర్ ఆఖరు వరకు గడువు ఇవ్వాలని వాటర్​బోర్డు అధికారులు భావిస్తున్నారు. అప్పటికీ నిర్మించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.