
హైదరాబాద్ వాసులకు వాటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా నల్లాకు మోటార్ బిగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అలా చేస్తే మోటార్ సీజ్, కనెక్షన్ కట్ తో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. . నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల వాటర్ సప్లయ్ సమయంలో ప్రెజర్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.
ఎండాకాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నల్లా నీటి సరఫరాలో ప్రెజర్ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 15 నుంచి వాటర్ బోర్డు స్పెషల్ డ్రైవ్ చేపడుతుందని తెలిపారు. హైదరాబాద్ ప్రజలు నీటిని వృథా చేయకుండా తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలన్న ఎండీ అశోక్ రెడ్డి కోరారు.