- వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్‌బోర్డు ఐటీ వింగ్ అధికారులతో ఎండీ అశోక్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వాటర్‌ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌పై చర్చించారు. గతేడాది అత్యధిక ట్యాంకర్లు బుక్ అయ్యాయని.. అదే సమయంలో నలభై మందికి పైగా డ్రైవర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించామని ఎండీ తెలిపారు. తప్పుడు పద్ధతిలో ట్యాంకర్లు బుక్ చేసి రెట్టింపు రేట్లకు అమ్ముకోవడానికి తెరలేపారని చెప్పారు. ట్యాంకర్ బుక్ చేసుకోలేని వారి క్యాన్ నంబర్లను గుర్తించి, వారి క్యాన్ నంబర్‌కు డ్రైవర్ల నెంబర్లు అనుసంధానం చేసి, డొమెస్టిక్ అవసరాల కోసం బుక్ చేసి బ్లాక్‌లో అమ్మినట్లు గుర్తించామన్నారు.
అత్యధికంగా ఒక్కో క్యాన్‌పై వంద ట్రిప్పులకు పైగా బుక్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఈసారి ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది అక్రమ పద్ధతిలో ట్యాంకర్లు బుక్ చేసిన మొబైల్ నెంబర్లు, క్యాన్ నంబర్లను బ్లాక్ చేయనున్నట్లు ఎండీ వెల్లడించారు. ఈడీ మయాంక్ మిట్టల్, ఐటీ వింగ్ అధికారులు పాల్గొన్నారు.