శాంపిల్స్​ టెస్ట్​ చేశాకే నీటిని వదలాలి వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హఫీజ్​పేటలోని సాయినగర్, యూత్ కాలనీ, మజీద్ బండ, ఇజ్జత్ నగర్ ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అశోక్​రెడ్డి మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు ముందు మూడంచెల క్లోరినేషన్ ప్రాసెస్​చేస్తున్నామని చెప్పారు. మొదటి విడతగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(డబ్లూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల(ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. సరఫరా చేస్తున్న నీటిలో 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ఐఎస్ఓ 10500 : 2012 ప్రకారం శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను జలమండలి తీసుకుంటోందన్నారు. బుధవారం నుంచి రెట్టింపు సంఖ్యలో శాంపిళ్లు పరీక్షించిన తర్వాతే నీటి సరఫరా చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో క్లోరిన్ ట్యాబ్లెట్స్, బ్లీచింగ్​పౌడర్​పంపిణీ చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటివరకు 8.80 లక్షల క్లోరిన్ ట్యాబ్లెట్స్ పంపిణీ చేశామని చెప్పారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో కాకుండా చూడాలని, మంచినీటి పైపు నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా జీఎంలు జాగ్రత్త వహించాలన్నారు. 

అలాగే సిటీతోపాటు ఓఆర్ఆర్ పరిధిలోని వాటర్ లాగింగ్ పాయింట్లు, ఓవర్ ఫ్లో, కలుషిత నీరు అంశాలను పర్యవేక్షించడానికి ఎండీ ఉన్నతస్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సర్కిల్ 4, రెవెన్యూ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్ కుమార్, సర్కిల్–1, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, సర్కిల్–5 ఆపరేషన్ డైరెక్టర్–2 స్వామి, సర్కిల్–4 ఆపరేషన్ డైరెక్టర్-–1 విజయరావు, సర్కిల్ 3, 6(ఓఆర్ఆర్ పరిధి) పర్సనల్ డైరెక్టర్ సుదర్శన్ ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షిస్తారు. అలాగే జీహెచ్ఎంసీ, హెచ్ హెచ్ఎండీఏ, విద్యుత్, శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారు.