మోటార్ ఫ్రీ ట్యాప్’ డ్రైవ్ షురూ.. 64 మోటార్లు స్వాధీనం.. 84మందికి పెనాల్టీ

మోటార్ ఫ్రీ ట్యాప్’ డ్రైవ్ షురూ..  64 మోటార్లు స్వాధీనం.. 84మందికి పెనాల్టీ
  • ఫీల్డ్ విజిట్​లో నీటి వృథాను చూసి విస్తుపోయినవాటర్​బోర్డు ఎండీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించే వారిని గుర్తించేందుకు వాటర్​బోర్డు మంగళవారం నుంచి ‘మోటార్​ఫ్రీ ట్యాప్’​ డ్రైవ్ ను ప్రారంభించింది. ఎండీ అశోక్​రెడ్డి, సిబ్బందితో కలిసి మాదాపూర్ కాకతీయ హిల్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిని వృథా చేస్తున్న తీరును చూసి విస్తుపోయారు. ఓ వ్యక్తి ఒక క్యాన్​నెంబర్​కు మరో అక్రమ కనెక్షన్​ పెట్టుకోవడమే కాకుండా దానికి మోటార్​పెట్టి మరీ నీటిని తోడుతూ చిక్కాడు. 

అతనిపై కేసు నమోదు చేశారు. కొన్ని అపార్ట్​మెంట్ల సంపుల్లోని నీరు ఓవర్​ఫ్లో అయి బయటకు పోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేసు ఫైల్​చేశారు. రెండు చోట్ల నల్లాకు మోటర్లు​పెట్టి బిల్డింగ్​నిర్మాణం కోసం వినియోగిస్తుండడం గుర్తించారు. నీటిని వృథా చేయొద్దని వాటర్​బోర్డు ఎండీ పలువురు అపార్ట్​మెంట్​వాసులకు అవగాహన కల్పించారు. 

మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ లో భాగంగా మొదటి రోజు అన్ని డివిజన్లలో కలిపి 64 మోటార్లను సీజ్ చేయగా 84 మందికి మోటార్లు ఉపయోగించినందుకు.. నీటి వృథా చేసినందుకు పెనాల్టీ విధించారు. అత్యధికంగా ఎస్ఆర్ నగర్ పరిధిలో 25 మోటార్లు సీజ్ చేసి పెనాల్టీ వేశారు. నీటి సరఫరాలో సమస్యలు వచ్చినా, నల్లాలకు మోటర్లు పెట్టి తోడుతున్నా  కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌ నంబర్‌‌‌‌ 155313కి ఫోన్‌‌‌‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.