హైదరాబాద్‌లో ట్యాంకర్ల బుకింగ్స్ తగ్గినయ్!

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో నీటి వాడకం గణనీయంగా తగ్గింది. వాటర్​ట్యాంకర్ల బుకింగ్స్​సగానికి పడిపోయాయి. దీంతో వాటర్​బోర్డు అధికారులు ఎల్లం పల్లి నుంచి ఎమెర్జెన్సీ నీటి పంపింగ్​ పనులను నిలిపివేశారు. నాగార్జున సాగర్​నుంచి రెండో దశ నీటి పంపింగ్​అవసరం లేదని చెప్పారు. దీంతో మొన్నటి దాకా డైలీ వాటర్​బోర్డు పరిధిలో 8 వేల నుంచి 8,500 ట్యాంకర్లు బుక్​అవగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4,500కు తగ్గిందని అధికారులు తెలిపారు. ఏప్రిల్​నెలతో పోలిస్తే నీటి వినియోగం 50 శాతం తగ్గిందంటున్నారు. ప్రస్తుతం వాటర్​ట్యాంకర్ల డెలివరీకి ఎక్కువ పట్టడం లేదని, 24 గంటల్లోపే నీటిని అందిస్తున్నామని వెల్లడించారు. గడిచిన రెండున్నర నెలల్లో సిటీతోపాటు శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి పెరిగింది. బోర్లు ఎండిపోవడంతోపాటు, ఎండల కారణంగా నీటి వినియోగం డబుల్​అయింది. ఈ నేపథ్యంలో వాటర్​బోర్డుపై తీవ్ర ఒత్తిడి పడింది. ట్యాంకర్​బుక్​ చేసిన నాలుగైదు రోజులకు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడింది. సిటీలో నీటి సమస్య లేకుండా చూడాలని సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో వాటర్​బోర్డు అధికారులు రాత్రింబవళ్లు ట్యాంకర్లు అందించారు.

ఇక నీటి కష్టాలు లేనట్టే..

ముందస్తు చర్యల్లో భాగంగా వాటర్​బోర్డు అధికారులు నాగార్జునసాగర్​తోపాటు ఎల్లంపల్లి రిజర్వాయర్​ నుంచి సిటీకి గోదావరి జలాలను తీసుకురావాలని గతంలో నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి నీటిని పంపింగ్​ చేయాలని అనుకున్నారు. అయితే గడిచిన 10 రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు వాతావరణం చల్లబడింది. నీటి వినియోగం సగానికి తగ్గింది. దీంతో ఎల్లంపల్లి నుంచి ఎమెర్జెన్సీ పంపింగ్​ పనులను అధికారులు నిలిపివేశారు. వారం రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జంటనగరాల తాగునీటి కష్టాలు తీరినట్టేనని చెబుతున్నారు.

బోర్లు ఎండిపోవడంతో..

గతేడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫిబ్రవరి నెల నుంచే నీటికి డిమాండ్ ఏర్పడింది. బోర్లు ఎండిపోవడంతో అంతా వాటర్​బోర్డుపై ఆధారపడ్డారు. ట్యాంకర్లను భారీగా బుక్ చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో 30 వేలకు ట్యాంకర్లను బుక్​చేసుకున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై 24 గంటలూ ట్యాంకర్లను సరఫరా చేశారు. 600 ట్యాంకర్లకు అదనంగా మరో 200 సమకూర్చుకుని సరఫరా చేశారు. అలాగే వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లను పెంచారు. జీహెచ్ఎంసీ నుంచి కొంత మంది డ్రైవర్లను తీసుకున్నారు. అధికారులు, ట్యాంకర్ల సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. 

ప్రత్యేకంగా ట్యాంకర్ మేనేజ్ మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో తాగునీరు సరఫరా చేసేందుకు ఏప్రిల్ 20న నాగార్జున సాగర్ లో 10 పంపులతో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించారు. అవసరాన్ని బట్టి రెండో విడత పంపింగ్​ పనులు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం నీటికి డిమాండ్​ తగ్గడంతో రెండో దశ పంపింగ్​ పనులకు స్వస్తి పలికినట్లు వెల్లడించారు. గతేడాది వేసవిలో వాటర్​బోర్డు 580 ఎంజీడీల నీటి సరఫరా చేయగా, ఈసారి 20 ఎంజీడీలు అదనంగా అందించినట్టు అధికారులు తెలిపారు.