
- దుర్గం చెరువులో మురుగు కలవకుండా యాక్షన్
- మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి ఐ అండ్‌డీ వరకు పైపులైన్
- వర్షాకాలంలో వరద కలవకుండా వాటర్ డ్రెయిన్ నిర్మాణం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దుర్గం చెరువులో మురుగు నీరు చేరి కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ఇందులో భాగంగా చెరువు పరిసరాలను వాటర్‌బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, బల్దియా, హెచ్ఎండీఏ, లేక్స్, రెవెన్యూ, పీసీబీ, ఇతర విభాగాల అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మురుగు చెరువులో కలవకుండా మాదాపూర్ పెట్రోల్ బంక్ నుంచి మాదాపూర్ ఐఅండ్‌డీ వరకు 1000 ఎంఎం డయా పైపులైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టెండర్లు ఖరారయ్యాక 3 నెలల్లో పనుల్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. వర్షాకాలంలో వచ్చే వరద చెరువులో కలవకుండా వాటర్ డ్రైయిన్ నిర్మించనున్నారు. జీహెచ్ఎంసీ ఈ పనులను 3 నెలల్లోనే పూర్తి చేయనుంది.
చెరువు చుట్టుపక్కల ఉండే ఇండ్ల నుంచి వచ్చే సిల్ట్ డైవర్షన్ మెయిన్‌లో కలకుండా.. ఛాంబర్లు నిర్మించునేలా నోటీసులివ్వాలని నిర్ణయించారు. లేక్ చుట్టుపక్కల ఉన్న డైవర్షన్ మెయిన్ మ్యాన్ హోళ్లను పరిశీలించాలని రహేజా గ్రూప్ ను ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు. మాదాపూర్, సైలెంట్ వ్యాలీ ప్రాంతాలు, క్యాచ్ మెంట్ ఏరియాలో ఉత్పన్నమవుతున్న మురుగును ఇప్పటికే చెరువులో నిర్మించిన రెండు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నారు.
రహేజా మైండ్ స్పేస్ ప్రాంతాల్లో భవన నిర్మాణ, గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ అవసరాల కోసం ఈ శుద్ధి చేసిన నీటినే వాడుకోవాలని వాటర్ బోర్డు ఎండీ ఆదేశించారు. దీని కోసం వారంలో చెరువు ఎస్టీపీ నుంచి ప్రత్యేక పైపు లైన్ నిర్మించాలన్నారు. వాటర్‌బోర్డు ప్రాజెక్టు సీజీఎం పద్మజ, ఓఎస్డీ సత్యలింగం, జీహెచ్ంఎసీ జడ్సీ ఉపేందర్ రెడ్డి, డీసీ ముకుంద్ రెడ్డి, ఈఈ దుర్గా ప్రసాద్, ఈఈ లేక్స్ నారాయణ, ఎలక్ట్రికల్, ఫిషరీస్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.