- స్టేట్ బడ్జెట్లో కేటాయించాలని రిక్వెస్ట్
- 2023–24లో రూ.5,937 కోట్లు అడగగా.. ఇచ్చింది రూ.3,455 కోట్లే
హైదరాబాద్, వెలుగు : బడ్జెట్లో వాటర్‌బోర్డుకు రూ.5,600 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో వాటర్‌బోర్డుకు రూ.578 కోట్లు కేటాయించి సరిపెట్టింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో వాటర్‌బోర్డు చేపడుతున్న ప్రాజెక్టులు, పనులకు సరిపడా బడ్జెట్కేటాయించాలని కోరుతూ అధికారులు ప్రతిపాదనలు పంపారు. గతేడాది(2023–24) రూ.5,937 కోట్లు కావాలని అడగగా, అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం కేవలం రూ.3,455 కోట్లు ఇచ్చి సరిపెట్టింది. ఇందులో రాష్ట్ర ఖజానా నుంచి రూ.1,325 కోట్లు, కేంద్రం అందజేసిన సీ అండ్ ఏ నిధుల నుంచి రూ.2,130 కోట్లు కేటాయించిందని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు.
ఏ పనులకు ఎంత అంటే..
రూ.1,100 కోట్లు హడ్కో రుణాలను చెల్లించడానికి, రూ.2,250 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్టీపీల నిర్మాణం, జోన్–3 సీవేజ్ పనులు, ఓఆర్ఆర్వాటర్ ప్రాజెక్టులకు అధికంగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి పూర్తికానున్న సుంకిశాల ప్రాజెక్టుకు మరో రూ.1,300 కోట్లు అవసరమవుతాని చెప్పారు. ఫ్రీ వాటర్‌స్కీం(20 వేల లీటర్లు) అమలుకు రూ.500 కోట్లు కావాలని కోరారు. విద్యుత్కన్సెషన్ కోసం రూ.400 కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్చేశారు. ఈసారి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయిస్తారన్న ధీమాలో అధికారులు ఉన్నారు.