గ్రేటర్ సిటీలో సెస్ వసూలుకు త్వరలో అమలు

గ్రేటర్ సిటీలో సెస్ వసూలుకు త్వరలో అమలు
  • వాటర్ బోర్డు..  సీవరేజ్ పాలసీ
  • నల్లా కనెక్షన్​ లేకున్నా..  సీవరేజ్ వాడుతుంటే వసూలు 
  • హోటళ్లు, ఫంక్షన్​ హాళ్లు,  ఆస్పత్రుల నుంచి సెస్ ఫీజు
  • బోర్డు ఆదాయం  పెంచుకునేందుకు అధికారుల కసరత్తు

హైదరాబాద్,వెలుగు:  గ్రేటర్​సిటీ పరిధిలో ప్రత్యేక ‘సీవరేజ్ పాలసీ’ అమలుకు మెట్రోవాటర్ ​బోర్డు సన్నాహాలు చేస్తోంది. నీటి సరఫరా, సీవరేజ్ వ్యవస్థను నిర్వహిస్తుండగా.. నెలకు బోర్డుకు వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన ఉండడం లేదు. దీంతో రెవెన్యూ పెంచుకునేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం నీటి బిల్లులతో పాటే సీవరేజ్ సెస్​ను  కూడా వసూలు చేస్తున్నారు. బల్దియా కూడా సిటీ శివారులో ఆస్తి పన్ను వసూళ్లలో సీవరేజ్ సెస్ ​కలిపి వసూలు చేస్తుంది. అయితే.. వాటర్​బోర్డుకు వాటా ఇవ్వాల్సి ఇవ్వడంలేదు. 

మరోవైపు నీటి కనెక్షన్లకు, ఆస్తి పన్ను చెల్లించేవారి సంఖ్యకు కూడా పొంతన లేదు. నల్లా కనెక్షన్లు లేని వారంతా వాటర్​బోర్డు సీవరేజ్ కనెక్షన్లను మాత్రం వినియోగిస్తున్నారు. వీరి నుంచి ఎలాంటి పన్ను వసూలు చేయడంలేదు. సిటీలో దాదాపు 1500 చ. కి.మీ. విస్తీర్ణంలో  సీవరేజ్ వ్యవస్థ ఉంది. దీని పరిధిలోకి వచ్చే వారి నుంచి ఇక నుంచి మస్ట్ గా సెస్  వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వాటర్​బోర్డు పరిధిలోకి రానివారి నుంచి కూడా సీవరేజ్ సెస్ వసూలు చేయనున్నారు. కొత్తగా తేనున్న పాలసీలో బోర్డు సేవలను పొందుతున్న ప్రతి ఒక్కరి నుంచి సీవరేజ్ సెస్​ వసూలు చేయాలనేదే పాలసీ ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. 

నల్లా కనెక్షన్​ లేకున్నా..

వాటర్ బోర్డు పరిధిలో నల్లా కనెక్షన్లు 13.80 లక్షల వరకు ఉన్నాయి. సీవరేజ్  వినియోగించేవారు దాదాపు 2 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. నీటి కనెక్షన్లు ఉన్నవారి నుంచి ప్రతి నెలా నీటి బిల్లుతో పాటు 35 శాతం సీవరేజ్  సెస్​ వసూలు చేస్తున్నారు. దీని ద్వారా వాటర్​బోర్డుకు నెలకు రూ. 85 – 90 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో 35 శాతం సీవరేజ్  సెస్​ కలిపి ఉంటుంది. బోర్డుకు వస్తున్న ఆదాయం కంటే సీవరేజ్  వినియోగించే వారికి అంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్​చేయడం, కొత్తవి నిర్మించడం, ఉన్నలైన్లకు రిపేర్లు చేయడం, సీవర్ లైన్ల క్లీనింగ్​కు వాడే ఎయిర్​టెక్​ మెషీన్ల నిర్వహణ వంటివాటికి భారీగా ఖర్చే అవుతుంది. 

నల్లా కనెక్షన్​లేని హోటళ్లు, ఫంక్షన్ ​హాళ్లు, నర్సింగ్​ హోమ్​లు, ఇన్​స్టిట్యూషన్ల నుంచి పైసా సీవరేజ్  సెస్​ వసూలు కావడం లేదు. కానీ, వారంతా బోర్డుకు చెందిన సీవరేజ్ వ్యవస్థను మాత్రం వినియోగించుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి బోర్డు పరిధిలోకి తీసుకురావాలని అధికారులు ప్లాన్ రూపొందిస్తున్నారు. 

 క్లీనింగ్​కు తడిసి మోపెడు!

సిటీలో ప్రతి రోజూ ఉత్పత్తయ్యే మురుగునీటిని క్లీనిం గ్ చేసేందుకు కూడా వాటర్ బోర్డుకు ఖర్చు తడిసి మోపెడవుతుందని అధికారులు చెబుతున్నారు. సిటీలో ప్రస్తుతం ఉన్న 25 ట్రీట్​మెంట్​ ప్లాంట్ల​ (ఎస్టీపీలు) నిర్వహణకు నెలకు రూ. 15 – 20 కోట్ల వరకు విద్యుత్​ బిల్లుల చెల్లింపులకు ఖర్చవుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1,950 మిలియన్​ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతుంది. 

ఇందులో బల్దియాలో 1,650 ఎంఎల్​డీ,  అవతల ఓఆర్ఆర్​ పరిధిలో మరో 300 ఎంఎల్​డీల మురుగునీరు వస్తుంది. మొత్తంగా మురుగునీటిలో ప్రస్తుతం 46 శాతం మేరకు వాటర్​బోర్డు శుద్ధి చేస్తుంది.  మూసీ ప్రక్షాళనలో భాగంగా సిటీలో మరో 31 కొత్త ఎస్టీపీలు నిర్మిస్తున్నారు. అవి అందుబాటులోకి వస్తే 100శాతం మురుగునీటి శుద్ధి జరిగే చాన్స్ ఉంది. అప్పుడు వాటర్​బోర్డుపై విద్యుత్​ బిల్లులకే  నెలకు 55 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సీవరేజ్ లైన్లను వాడే వారి  నుంచి మస్ట్ గా సెస్​ వసూలు చేయాలని కూడా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వసూ లు చేస్తున్న సీవరేజ్ సెస్​, వచ్చే కాలంలో ఎంత వసూలు చేయాలనే దానిపై అధికారులు త్వరలో సీవరేజ్ పాలసీ తేచ్చేందుకు సిద్ధం అయ్యారు.