- ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న ప్లాంట్లు
- మినరల్ వాటర్ అంటూ రేట్లు పెంచి అమ్మకం
హనుమకొండ, ఖమ్మం, వెలుగు: వరంగల్, ఖమ్మం నగరాల్లో వాటర్ బిజినెస్జోరుగా నడుస్తోంది. ఎండాకాలం స్టార్ట్ కావడం.. జనాలు మిషన్ భగీరథ నీళ్లపై ఆసక్తి చూపకపోవడంతో ప్యూరిఫైడ్వాటర్ ప్లాంట్ల దందా ఎక్కువైంది. లాభాలు మస్తుగా ఉంటుండటంతో ఎలాంటి పర్మిషన్ లేకుండానే గల్లీకో ప్లాంట్ఏర్పాటు చేస్తున్నారు. ఏవేవో కెమికల్స్ కలిపి మినరల్ వాటర్ అంటూ అమ్మేస్తున్నారు. ఇష్టమొచ్చినట్టుగా శుద్ధి చేస్తూ నీళ్ల దందా సాగిస్తున్నారు. ఎండాకాలం కావడంతో రేట్లు పెంచి అమ్ముతున్నారు.
అక్రమంగా వెలుస్తున్నయ్..
గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 500లకు పైగా వాటర్ ప్లాంట్లు ఉండగా.. అన్నిరకాల పర్మిషన్లు కేవలం 18 ప్లాంట్లకు మాత్రమే ఉన్నాయి. గల్లీకో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు.. అసలు రూల్స్ ఏమీ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భూగర్భ జలశాఖ, పీసీబీ, మున్సిపల్ హెల్త్ డిపార్ట్ మెంట్ పర్మిషన్తో పాటు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ప్లాంట్ లో మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ టెస్టులు చేసిన తరువాతే నీళ్లను సరఫరా చేయాలి. కానీ నగరంలో ఎక్కడా ఈ రూల్స్ కనిపించడం లేదు. అంతేగాకుండా ప్రతి ప్లాంట్ లో వారానికోసారి నీటిని టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. అందులో ఇన్ ఫెక్టివ్ బ్యాక్టీరియా, కెమికల్స్ స్థాయిల గురించి పరీక్షించాలి. కానీ ఇక్కడ ఆ రూల్స్ పట్టించుకున్న నాథులే కనిపించడం లేదు. ఇక ఖమ్మం జిల్లాలో పర్మిషన్ఉన్న వాటర్ ప్లాంట్లు 8 8 మాత్రమే ఉండగా.. అనుమతులు లేని ప్లాంట్లు 400లకు పైగా ఉన్నాయి. పూర్తి పర్మిషన్లు ఉన్న ప్లాంట్లు మాత్రం 8 మాత్రమే.
ఇష్టమొచ్చిన రేట్లు..
చాలా మంది ప్యూరిఫైడ్ నీళ్లకే అలవాటు పడగా.. అరకొరగా శుద్ధి చేసిన నీటికీ కొంతమంది అడ్డగోలు రేట్లు వసూలు చేస్తున్నారు. రూల్స్ ప్రకారం 16 లీటర్ల క్యాన్ కు రూ.5 మాత్రమే తీసుకోవాలి. హౌజ్ సర్వీస్ చేస్తున్నందుకు కొంతమంది రూ.10 నుంచి రూ.20, కూల్ వాటర్ క్యాన్కు రూ.25 నుంచి రూ.30 వరకు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎండలతో పాటు కరెంట్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడంతో మరింత రేట్లు పెంచి అమ్ముతున్నారు. గతంలో రూ.10 ఉన్న క్యాన్కు రూ.15, కూల్ వాటర్ కు రూ.40 నుంచి రూ.50 గుంజుతున్నారు. దీంతో కేవలం వరంగల్ నగరంలోనే ప్రతి నెలా ఐదారు కోట్ల దందా నడుస్తోంది. ఇలాంటి వాటిపై లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అడ్డగోలు రేట్ల పెంపుపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ శాఖ నుంచి యాక్షన్ తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఇంటి బోరుతోనే వ్యాపారం..
ఎవరైనా ఇంటి అవసరాల కోసం వేసుకున్న బోరును వాణిజ్య అవసరాలకు ఉపయోగించడానికి వీళ్లేదు. విచ్చలవిడిగా వ్యాపారపరంగా నీటిని బోర్లతో తోడడం వల్ల భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉండడంతో వాల్టా చట్టం ప్రకారం ఈ రూల్ ను ఏర్పాటు చేశారు. కానీ, చాలా చోట్ల ఇండ్లలోనే బోరు వాటర్ ను ఫిల్టర్ చేసి, వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తున్నారు. అన్ని అనుమతులు తీసుకొని, ఐఎస్ఐ నిబంధనల ప్రకారం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. దీంతో ప్యూరిఫైడ్ ప్లాంట్ పేరుతో రూ.5 లక్షల లోపల ఖర్చుతో సొంతంగా ఫిల్టర్ చేసిన వాటర్ ను అమ్ముతున్నారు. ఈ అనుమతులపై తనిఖీ చేయాల్సిన రెవెన్యూ, పబ్లిక్ హెల్త్, శానిటరీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.