మూసీ గరిష్ట వరదపై మళ్లీ స్టడీ

మూసీ గరిష్ట వరదపై మళ్లీ స్టడీ
  • జలమండలి అధికారులకు ఇరిగేషన్ శాఖ స్పష్టీకరణ
  • 2019 స్టడీలో లెక్కలోకి తీసుకోని రీ జనరేటివ్ వాటర్
  • 1909లో వచ్చిన వరద ఆధారంగా అధ్యయనం

హైదరాబాద్, వెలుగు: మూసీ నది మ్యాగ్జిమమ్ ఫ్లడ్ డిశ్చార్జి (గరిష్ట వరద)కి సంబంధించి మరోసారి స్టడీ చేయించాలని ఇరిగేషన్ శాఖ యోచిస్తున్నది. అందుకు అనుగుణంగా మారిన పారామీటర్లనూ పరిగణనలోకి తీసుకుని సమగ్ర వివరాలతో స్టడీ చేయిస్తే బాగుంటుందని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జలసౌధలో ఈఎన్​సీతో జలమండలి అధికారులు సమావేశమయ్యారు. అయితే, 2019లో మూసీపై ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా లక్షన్నర క్యూసెక్కులకు మూసీ రివర్​ మ్యాగ్జిమమ్ ఫ్లడ్​ను ఫైనలైజ్ చేయాల్సిందిగా జలమండలి అధికారులు ఇరిగేషన్ ఈఎన్​సీ (జనరల్) అనిల్ కుమార్​ను కోరినట్టు తెలిసింది. ‘‘ఆ రిపోర్ట్​కు అనుగుణంగా ప్రభుత్వం నుంచి జీవో ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.

అయితే, అప్పట్లో చేసిన స్టడీ సరిపోదని ఈఎన్​సీ స్పష్టం చేసింది. రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పింది. ప్రస్తుతం మూసీ క్యాచ్​మెంట్ ఏరియాలు మారాయి. చాలా చోట్ల నది వెడల్పు తగ్గిపోయింది. నాడు కేవలం క్యాచ్​మెంట్ ఏరియాల నుంచి వచ్చే ఫ్లడ్​నే పరిగణనలోకి తీసుకున్నారు. సిటీలో రీ జనరేట్ అయ్యి మూసీలో కలిసే మురికి వరద నీటిని లెక్కలోకి తీసుకోలేదు’’అని చెప్పినట్టు తెలిసింది. నాలాల నుంచి వచ్చి మూసీలో చేరే వరదనూ లెక్కించలేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సిటీలో రీ జనరేట్ అయ్యే మురికినీరు, నాలాల నుంచి వచ్చే వరద నీరు, క్యాచ్​మెంట్ ఏరియాల నుంచి వచ్చే వరద సహా అన్ని పారామీటర్లను పరిగణనలోకి తీసుకుని రీ సర్వే చేయించాల్సిన అవసరం ఉందని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది.

ప్రైవేటు సంస్థతో స్టడీ చేయించాలన్న జలమండలి

మూసీ డిశ్చార్జిపై మరోసారి స్టడీ చేయించాల్సి వస్తే ప్రైవేట్ ఏజెన్సీతో చేయించాలని జలమండలి అధికారులు ప్రతిపాదించినట్టు తెలిసింది. ‘‘ఓ ప్రైవేటు సంస్థ చేసిన స్టడీ వివరాలను ఈఎన్​సీ ముందు పెట్టింది. అయితే, సదరు సంస్థ కేవలం 25 ఏండ్ల ఫ్లడ్​ను ప్రామాణికంగా తీసుకుని స్టడీ చేసింది. ఆ ఫ్లడ్ ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్​ చేసి ఎక్కువ వరద డిశ్చార్జ్​ను చూపించింది.

అయితే, ఆ స్టడీ సరిపోదని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పారు. 50 నుంచి వందేండ్ల వరదను ప్రామాణికంగా తీసుకుని స్టడీ చేస్తేనే కచ్చితమైన రిజల్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. మామూలుగా అన్ని ప్రాజెక్టులకు చేసినట్టే సమగ్రమైన స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మూసీ విషయంలో 1909లో వచ్చిన వరద విపత్తును దృష్టిలో పెట్టుకుని.. అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన వరదల లెక్కలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటది. అందుకు అనుగుణంగా ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లోని హైడ్రాలజీ విభాగంతోనే స్టడీ చేయించాలి’’అని అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం.