ఇస్తున్న నీటికి... వస్తున్న ఆదాయానికి సంబంధం లేదు: హైదరాబాద్​ వాటర్​ బోర్డ్​

ఇస్తున్న నీటికి... వస్తున్న ఆదాయానికి సంబంధం లేదు: హైదరాబాద్​ వాటర్​ బోర్డ్​
  • కోటికి పైగా జనాభాలో  కమర్షియల్​ కనెక్షన్లు 54 వేలేనా?

  • అధికారులతో ఇటీవల జరిగిన మీటింగ్​లో వాటర్​ బోర్డు ఎండీ విస్మయం

  •   సర్వే చేసి గుర్తించాలని ఆదేశాలు 

  •  బల్దియా ఆస్తి పన్ను డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్న ఆఫీసర్లు 

  •  కింది స్థాయి అధికారుల చేతివాటమే కారణమని ఆరోపణలు 

  • వారిపై చర్యలకు సిద్ధం

హైదరాబాద్ సిటీ, వెలుగు: కోటి జనాభా దాటిన గ్రేటర్​లో తాము సరఫరా చేస్తున్న నీటికి, వస్తున్న ఆదాయానికి పొంతన లేదని మెట్రోవాటర్​బోర్డు అధికారులు గుర్తించారు. బోర్డు నిర్వహణకు ప్రధాన వనరు అయిన కమర్షియల్​కనెక్షన్ల విషయంలో లెక్కా పత్రం ఉండడం లేదని తెలుసుకున్నారు. దాదాపు కోటి 35 లక్షల జనాభా ఉన్న సిటీలో కనీసం లక్షన్నర కమర్షియల్​కనెక్షన్స్ ఉండాల్సి ఉండగా.. రికార్డుల్లో మాత్రం 54 వేల కనెక్షన్లే ఉన్నట్టు చూపిస్తున్నాయి. 

కొందరు కిందిస్థాయి అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి కమర్షియల్​కనెక్షన్లను కూడా డొమెస్టిక్​ కేటగిరీలో మార్చడం వల్లే ఇదంతా జరిగిందని ఓ నిర్ణయానికి వచ్చారు. రోజుకు 500 ఎంజీడీలకు పైగా నీటిని సరఫరా చేస్తున్న వాటర్​బోర్డుకు నెలకు కనీసం రూ.230  కోట్ల ఆదాయం రావాల్సి ఉన్నా.. రూ.90 నుంచి 100 కోట్లకు మించడం లేదు. ఇందులో కరెంట్​బిల్లులకే రూ.130 కోట్లు, సిబ్బంది జీతాలకు రూ.70 కోట్లు, ఉచిత నీటి సరఫరా కోసం రూ. 20 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఇలా ఇప్పటివరకు బోర్డు రూ. 5,100 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. నెలకు రూ.130  కోట్లు అప్పు పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. దీన్ని నివారించేందుకు సంస్థ ఎండీ అశోక్​రెడ్డి కమర్షియల్​కనెక్షన్ల అవకతవకల వ్యవహారంపై దృష్టి పెట్టారు. 

డొమెస్టిక్​ముసుగులో కమర్షియల్ 

గ్రేటర్​పరిధిలో భారీఎత్తున  కమర్షియల్ యాక్టివిటీలు, పరిశ్రమలు, పెద్దపెద్ద ఇన్​స్టిట్యూషన్లు, మల్టీ స్టోర్డ్​బిల్డింగులు, విల్లాలు, హోటళ్లు, క్లబ్బుల వంటివి కమర్షియల్​ కేటగిరీ కిందకు వస్తాయి. కానీ, ఈ మధ్య నిర్వహించిన ఓ సమావేశంలో చాలామటుకు డొమెస్టిక్​క్యాటగిరీ కింద ఉన్నాయని తెలుసుకుని సంస్థ ఎండీ అశోక్​ రెడ్డి ఆశ్చర్యపోయారు. అధికారులు సర్వే చేసి డొమెస్టిక్​ముసుగులో ఉన్న కమర్షియల్ యాక్టివిటీస్​కనెక్షన్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఓ యాప్​ను రూపొందించి కమర్షియల్​కనెక్షన్లను అప్​డేట్​చేయాలని ఆదేశించారు. అవసరమైతే జీహెచ్ఎంసీ యాప్​నుంచి ఆస్తి పన్ను డేటాను తీసుకుని దాని ప్రకారం సర్వే నిర్వహించాలని సూచించారు. అలాగే కమర్షియల్​కనెక్షన్​ఇవ్వాల్సి ఉన్నా డొమెస్టిక్​ కనెక్షన్​ఇచ్చిన అధికారులు, సిబ్బందిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.  

ఆదాయం పెంచుకోవడం పై నజర్

గ్రేటర్​పరిధిలో కమర్షియల్​ కనెక్షన్​లే కాకుండా డొమెస్టిక్, అపార్ట్​మెంట్​కనెక్షన్లలో చాలావరకు ఇల్లీగల్​వే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రికార్డుల ప్రకారం మొత్తం 13.80 లక్షల కనెక్షన్లు ఉండగా, ఇందులో 10 లక్షలు డొమెస్టిక్​కనెక్షన్లు (1/2 అంగుళాల పైప్​లైన్​) ఉన్నాయి. అలాగే ఎంఎస్ బీ కేటగిరీలో అపార్ట్​మెంట్లకు ఇచ్చిన (3/4 అంగుళాల పైప్​లైన్​) కనెక్షన్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు 54 వేల వరకు కమర్షియల్​ కనెక్షన్లు (అంగుళం ఆ పైన సైజు) ఉన్నాయి. ఇందులో లక్ష వరకు కనెక్షన్లు డొమెస్టిక్ ముసుగులో ఉన్నట్టు గుర్తించారు. వీటి నుంచి  కమర్షియల్ చార్జీలను వసూలు చేసే పనిలో పడ్డారు. 

తాగునీటికి సంబంధించి డొమెస్టిక్​కనెక్షన్లకు ఎంఎస్బీ, కమర్షియల్​సరఫరాకు చార్జీల్లో భారీ తేడా ఉంటుంది. బోర్డు పరిధిలో 23 ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్​డివిజన్లు, ఒక్కో డివిజన్​పరిధిలో నాలుగు నుంచి ఆరు సెక్షన్లున్నాయి. ఆయా ప్రాంతాల్లో కనెక్షన్ల కోసం వచ్చే వారి నుంచి కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకుని అక్రమ కనెక్షన్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

బోర్డు పరిధిలో13.80 లక్షల కనెక్షన్లున్నట్టు రికార్డులు చెబుతున్నా ఇందులో మరో ఐదు లక్షల వరకు అక్రమ కనెక్షన్లే ఉన్నట్టు సమాచారం. ఆయా సెక్షన్ల పరిధిలో అవినీతికి పాల్పడుతున్న వారిని కట్టడి చేసేందుకే ప్రస్తుతం డివిజన్ల వారీగా కనెక్షన్ల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు సర్వే ప్రారంభించారు. సర్వేలో డొమెస్టిక్​ ముసుగులో ఉన్న కమర్షియల్​కనెక్షన్​లు, అసలే రికార్డుల్లో లేని అక్రమ కనెక్షన్​లు పెద్ద సంఖ్యలో బయట పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.