
- హనుమకొండ జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు
- నెర్రెలు బారుతున్న పంట పొలాలు
- ఐనవోలులో 21.3, నడికూడలో 12.28 మీటర్లకు డౌన్
- భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు దేవాదుల నీళ్లందక ఇబ్బందులు
- ఆందోళన చెందుతున్న అన్నదాతలు
హనుమకొండ/ ఎల్కతుర్తి, వెలుగు: జిల్లాలో భూగర్భజలాలు పడిపోతున్నాయి. ఓ వైపు ఎండలు మండుతుండటం, అదే తీరుగా నీటి వినియోగం ఎక్కువవుతుండటంతో గ్రౌండ్వాటర్లెవెల్స్వేగంగా తగ్గుతున్నాయి. ఫలితంగా చెరువులు, బావులన్నీ ఇంకిపోయి ఆ ప్రభావం కాస్త పంటలపై పడుతోంది. ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటుతుండటం, మరోవైపు ఎస్సారెస్పీ, దేవాదుల నీళ్లు చేరకపోవడంతో చాలావరకు పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు పంటలను కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నీళ్లు లేని కారణంగా వరి పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు.
లోలోతుకు భూగర్భజలాలు..
హనుమకొండ జిల్లాలో గ్రౌండ్ వాటర్ లెవల్స్స్పీడ్గా అడుగంటుతున్నాయి. ఐనవోలు మండలంలో ఎక్కువగా భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 మండలాల్లో దాదాపు 25 పీజోమీటర్ల ద్వారా భూగర్భజలాలను లెక్కగడుతుండగా, ఐనవోలులోని గ్రౌండ్‌వాటర్ లెవల్స్ అసాధారణ స్థాయిలో పడిపోతుండటం గమనార్హం. ఇక్కడ భూగర్భ జలాలు గత అక్టోబర్‌లో 9.10 మీటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ నీటి మట్టం 21.76 మీటర్ల లోతుకు పడిపోవడం కలవరానికి గురి చేస్తోంది. నడికూడ మండలంలో 12.42 మీటర్లు, భీమదేవరపల్లి మండలం జగన్నాథపూర్‌లో 9.54, ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల 8.43, ఎల్కతుర్తిలో 7.51, వేలేరు మండలం పీచరలో 9.42 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం గమనార్హం. మార్చిలోనే ఈ పరిస్థితి నెలకొనగా, ఏప్రిల్, మే నెలల్లో వాటర్ లెవల్స్ మరింత తగ్గే అవకాశం ఉంది.
దేవాదుల నీళ్లందక ఎండిపోతున్న పంటలు..
ఓ వైపు భూగర్భజలాలు పడిపోతుండటంతో బావులు ఇంకిపోతుండగా, ఎస్సారెస్పీ, దేవాదుల నీళ్లు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ముఖ్యంగా దేవాదుల నార్త్ కెనాల్కింద ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో దాదాపు 20 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా, కాల్వ నీళ్లు అందక పంటలు మాడిపోతున్నాయి. ప్రధాన కాల్వలో చెత్త, సిల్ట్, ముళ్లపొదలు, గ్రానైట్ కంపెనీలు ఇష్టారీతిన కాల్వల డిజైన్లు మార్చడంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఫలితంగా రైతులకు సక్రమంగా సాగు నీరందని పరిస్థితి నెలకొంది.
కనీసం బావి నీటితోనైనా పంటలు పండించుకుందామంటే గ్రానైట్కంపెనీల పుణ్యమాని ఆ అవకాశం కూడా లేకుండా పోతోంది. ముఖ్యంగా ఎల్కతుర్తి శివారులో ఉన్న గ్రానైట్కంపెనీలు నిరంతరాయంగా బోర్లు వేసి నడిపిస్తుండటంతో ఆ చుట్టుపక్కల బావులన్నింటిలో భూగర్భ నీటిమట్టం అట్టడుగుకు చేరుతోంది. దీంతో ఇక్కడి రైతులకు అటు దేవాదుల నీళ్లు అందక, ఇటు బావుల్లో నీళ్లు లేక వరి, మొక్కజొన్న పంటలను పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
బావుల్లో నీళ్లు అయిపోయినయ్..
ఈ యాసంగి ఆరెకరాల్లో వరి నాటిన. పది రోజుల కింది వరకు పొలం మంచిగనే పారింది. ఇప్పుడేమో బావుల్లో నీళ్లు అయిపోయినయ్. ఇప్పటికే ఐదెకరాలు వరుస తడులు పెడుతున్న. మడిమడికీ పైపులతో నీళ్లు పారిస్తున్న. మీది మడి పారేలోపు కిందిమడి ఎండుతాంది. ఇంకా నెల రోజులకుపైగా నీళ్లు అందాలి. ఇప్పుడే ఇట్లుంటే.. ఎవుసం ఎట్ల గట్టెక్కుతదో అర్థమైతలేదు.- బొజ్జ స్వామి, ఎల్కతుర్తి, రైతు
పశువుల పాలైతున్నది..
మాకున్న మూడెకరాలకు తోడు నాలుగెకరాలు కౌలుకు తీసుకున్న. దేవాదుల కాల్వ మా పొలాల నుంచే వెళ్తున్నది. నాట్లు వేసే సమయంలో నీళ్లు వచ్చినయ్. ఇగ నీళ్లకు డోకా ఉండదని ఎకరానికి రూ.35 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. నెల పదిహేను రోజుల క్రితం కెనాల్ బంద్ అయింది. ఇప్పటివరకు నీళ్లు వస్తలేవు. చేసేదేమీ లేక పొలాన్ని పశువులకు విడిచిపెట్టిన. - గుజ్జ రమాదేవి, మహిళా రైతు గోపాలపూర్