
- బోర్ల కింద లక్షా 80వేల ఎకరాల్లో వరి సాగు
- వెనుకకు వేసిన పంట దక్కేలా లేదని ట్యాంకర్లతో తడులు
- జిల్లాలో తాగునీటికి కటకటే..
- రెండు, మూడు రోజులకు ఒకసారి నల్లా నీటి సరఫరా
- ట్యాంకర్లు తెచ్చే నీరే దిక్కు..
కామారెడ్డి, వెలుగు : ఎండలు మండుతున్నయ్.. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నయ్.. సాగు, తాగునీటి కోసం కామారెడ్డి జిల్లావాసులు బోరుమంటున్నారు. జిల్లాలో 2.60 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కాగా, లక్షా 80వేల ఎకరాలు బోర్ల కిందే సాగయ్యాయి. ముందు పంట వేసుకున్న కొందరు రైతులు గట్టెక్కగా, ఆలస్యంగా నాట్లు వేసిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయమిది. వరుస తడులు పెట్టి పంటను దక్కించుకుందామనుకున్నా.. నీళ్లు అందక పంట ఎండడంతో పశువులను మేపుతున్నారు.
జిల్లాలో సగటు నీటి మట్టం ఫిబ్రవరిలో 12.97 మీటర్లు ఉండగా, మార్చి నెలలో 15.02 మీటర్లకు పడిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే భూగర్భ జలాల నీటి మట్టంలో 2.05 మీటర్ల వ్యత్యాసం చోటుచేసుకుంది. ఎండలు ముదురుతున్న దృష్ట్యా పంటలకు నీటి వినియోగం అధికంగా ఉంటుంది. భిక్కనూరు, కామారెడ్డి, బీబీపేట, దోమకొండ, లింగంపేట, నాగిరెడ్డిపేట, రామారెడ్డి, సదాశివనగర్, నిజాంసాగర్, రాజంపేట, తాడ్వాయి, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో 20.02 మీటర్ల నుంచి 35 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు వెళ్లాయి. దీంతో బోర్లు వట్టిపోయి పంటలు ఎండాయి. కొందరు రైతులు 800 నుంచి వెయ్యి ఫీట్ల లోతుకి బోర్లు వేయించినా ఫలితం అంతగా దక్కలేదు. పంటను దక్కించుకోవాలన్న ఆరటంతో కొందరు రైతులు ట్యాంకర్లతో నీటిని పారించుకుంటున్నారు.
ట్యాంకర్ల నీరే గతి..
బోర్లు వట్టిపోయాయి. రెండు, మూడు రోజులకోసారి నల్లా నీరు వస్తుండడంతో నీటి కోసం జిల్లావాసులు అల్లాడిపోతున్నారు. జిల్లాకేంద్రంలోని అశోక్నగర్కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, కాకతీయనగర్, విద్యానగర్, జయశంకర్ కాలనీ, స్నేహపురి కాలనీ, శ్రీరాంనగర్, వివేకానంద కాలనీ, దేవునిపల్లి, కొత్త సాయిబాబాగుడి, గాయత్రి నగర్ తదితర ఏరియాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. మున్సిపాలిటీ ద్వారా ఆయా ఏరియాలకు ప్రస్తుతం 5 ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లయ్ చేస్తున్నారు. రోజుకు డ్రమ్ము నీటిని మాత్రమే ట్యాంకర్ల ద్వారా సప్లయ్ చేస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటికి రెడీ అవుతున్న ఆయా పార్టీలకు చెందిన కొందరు ట్యాంకర్ల ద్వారా కాలనీలకు నీటిని సప్లయ్ చేస్తున్నారు. అయినా నీళ్లు సరిపోక కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి సరిపడా నీటిని సరఫరా చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.