తిరువనంతపురం: దేశంలోనే అత్యధిక అక్ష్యరాస్యత కలిగిన కేరళ రాష్ట్రంలో నీటి సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఈ ఈ సమస్య మరీ అధికంగా ఉంది. నీటి కొరతతో గత నాలుగు రోజులుగా రాజధాని వాసులు ముప్పుతిప్పులు పడుతున్నారు. తాగు నీరు, ఇంట్లో కనీస అవసరాలకు కూడా నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నీటి కొరత ప్రభావం పెళ్లిలు, ఇతర ఫంక్షన్లు, ఇతర కార్యాలపైన పడింది. ఇటీవల కోటలోని పాంచజన్యం ఆడిటోరియంలో అంబళాతరకు చెందిన కాలడి బాలచంద్రన్ కుమార్తె భావన, నాలంచిరకు చెందిన విశాఖల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి అధికార సీపీఎం పార్టీ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్, యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్, కాంగ్రెస్ నేత వీఎస్ శివకుమార్, ఇతర ప్రముఖులు సహా 700 మంది అతిథులు హాజరయ్యారు. అయితే, వీఐపీలు హాజరైన ఈ వేడుకలో కూడా నీటి కొరత సమస్య కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫంక్షన్ హాల్లో చేతులు కడుక్కునేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ విందు మధ్యలోనే అయిపోయింది. నీటి కొరత సమస్యతో చేసేదేమి లేక ఫంక్షన్ హాల్ నిర్వాహకులు చేతులేత్తేశారు. దీంతో వధువు బంధువులు చేతులు కడుక్కోవడానికి 200లకు పైగా వాటర్ బాటిళ్లను కొనుగొలు చేశారు. ఎమ్మెల్యే, ఇతర ప్రముఖులు హాజరైన వేడుకలోనూ కనీసం చేతులు వాష్ చేసుకోవడానికి నీరు లేకపోవడం, వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read :- నేతన్నల రూ. 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తాం
అయితే, తిరువనంతపురం సిటీ కార్పొరేషన్ పరిధిలోని సగానికి పైగా వార్డులు నీటి కొరతను ఎదుర్కొంటుండగా.. మంత్రులు, ఎమ్మెల్యేల బంగ్లాలలో ఉన్న వార్డుల్లో నీటి సమస్య లేకపోవడం గమనార్హం. ఒకవేళ ఇక్కడ నీటి కొరత వచ్చిన అధికారులు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. అధికారుల తీరుపట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు ఒకలా సామాన్యుల పట్ల మరోలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నీటి కొరత సమస్యతో కొందరు స్థానికులు కుళాయిలకు తాళాలు వేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కుళ్లాలకు తాళాలు, పెళ్లిళ్లలో వాటర్ బాటిళ్ల ఏర్పాటు చేయడంతో స్థానికులను ఆశ్చర్యానికి గురి అవ్వడంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.