సాంకేతిక సమస్యతో మొరాయిస్తోన్న శ్రీరాంసాగర్ డ్యాం గేట్లు

నిజామాబాద్, వెలుగు : ఉత్తర తెలంగాణలో భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ డ్యాం గేట్లు సాంకేతిక సమస్యతో  మొరాయించడంతో ప్రాజెక్టులోని నీళ్లన్నీ వృథాగా విడిచిపెట్టాల్సి వస్తున్నది. మొత్తం 42 గేట్లలో ఆరు గేట్లు రిపేర్లకు రావడంతో  90 టీంఎసీలకు బదులు 75 టీఎంసీల నీళ్లనే మెయింటెయిన్​ చేస్తున్నారు. గత ఏడాది జూన్​లో ఎస్సారెస్పీని పరిశీలించిన డ్యామ్​సెఫ్టీ ప్యానెల్.. గేట్లలో టెక్నికల్​ఇష్యూస్​ఉన్నాయని, వాటిని రిపేర్​ చేయాలని, అవసరమైతే రీప్లేస్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖకు రిపోర్ట్​ ఇచ్చింది. అయితే ఆలస్యంగా నెల కిందటే మరమ్మతులు మొదలుపెట్టారు. ఇంతలోపే కురిసిన  భారీ వర్షాలతో వరద ఉధృతి పెరగడంతో గేట్లు కొట్టుకుపోతాయని పనులను ఆపెయ్యాల్సి వచ్చింది.  

54 ఏండ్లలో గేట్లు ఎత్తింది పదిసార్లే 

ఎస్సారెస్పీ నిర్మించి 54 ఏండ్లు దాటుతుండడం, చాలా తక్కువ సార్లు గేట్లు ఎత్తడంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టులో మొత్తం 42 గేట్లు ఉండగా వచ్చే ఇన్​ఫ్లో ఆధారంగా వరదను కిందికి విడుదల చేస్తారు. అయితే ప్రాజెక్టు సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, సిల్ట్​, పూడిక కారణాలతో కెపాసిటీ 90 టీఎంసీలకు పడిపోయింది. ఇప్పటివరకు ఎస్సారెస్పీ నుంచి కేవలం పదిసార్లు మాత్రమే పూర్తి గేట్లను తెరిచి వరదను కిందికి వదిలారు. 1983, 1987 ,1991  సంవత్సరాల్లో మహారాష్ట్రలో భారీ వర్షాలతో గేట్లను ఎత్తారు.  1994 తర్వాత మహారాష్ట్ర సర్కారు గోదావరినదిపై ఆనకట్టలు కట్టడంతో ఎస్సారెస్సీకి వరద తగ్గుతూ వచ్చింది. దీంతో గేట్లు తెరిచే అవకాశాలు తగ్గిపోయాయి.  2005, 2013 , 2018, 2019, 2020, 2021 సంవత్సరాల్లో భారీగా వరద రావడంతో గేట్లు ఓపెన్​ చేశారు. మళ్లీ ఈ ఏడాది ఈ నెలలోనే రెండు సార్లు గేట్లు తెరిచారు.   

ప్రమాదంలో గేట్లు 

ప్రతి ఏడాది డ్యామ్​కు జనరల్ ​సర్వీసింగ్​ చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం మేనెలలో డ్యామ్​సేఫ్టీ ప్యానెల్ ప్రాజెక్టును సందర్శించి సమస్యలేమైనా ఉన్నాయేమోనని చూస్తుంది. గత ఏడాది జూన్ లో కూడా ఈ బృందం ఎస్సారెస్సీని విజిట్​ చేసింది. ప్రాజెక్ట్ గేట్లు, రివిట్మెంట్ సిల్ట్ పై అధ్యయనం చేయగా, గేట్ల పనితీరు బాగాలేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని తేలింది. దీంతో ఆరు గేట్లను అవసరమైతే రీప్లేస్ చేయడంతో పాటు రిపేర్లు చేయాల్సి ఉంటుందని నివేదికలు పంపించింది. ఈ క్రమంలోనే గత ఏడాది జులైలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరగా గేట్లు ఎత్తారు. ఈ సందర్భంగా ఐరన్​రోప్​ తెగిపోడంతో మొత్తం 42 గేట్లలో 6  గేట్లు మొరాయించాయి. 37 నుంచి 42 వరకు గేట్లు తెరుచుకోక సతాయించడంతో 36 గేట్ల ద్వారా నీటిని కిందికి వదిలారు. మొత్తం 90 టీఎంసీల స్టోరేజీకి చేరిన తర్వాత వరద నీటిని వదిలేయాల్సి ఉండగా 75 టీంఎసీలకు చేరగానే రిలీజ్​ చేస్తున్నారు. దీంతో నీళ్లన్నీ  వృథాగా పోతున్నాయి. గేట్ల రిపేర్ల కోసం సర్కారు రూ.17.40 కోట్లు మంజూరు చేయగా ఈ ఏడాది జూన్​19న రిపేర్లను మొదలుపెట్టారు. ఈ నెల10 నుంచి భారీ వర్షాల వల్ల వరద ఉధృతి అధికంగా ఉండడంతో మరమ్మతులను ఆపేశారు. వరద ఫ్లో టైంలో రిపేర్లు చేస్తే గేట్లు కొట్టుకుపోతాయని తాత్కాలికంగా నిలిపివేశారు.  

అప్రమత్తంగానే ఉన్నాం 

ఎస్సారెస్పీ గేట్లకు చాలా ఏండ్ల తర్వాత పూర్తిస్థాయి రిపేర్లు చేపట్టాం. దీనికోసం రూ. 17.40 కోట్లు వెచ్చిస్తున్నాం. గత ఏడాది 6  గేట్లకు సంబంధించిన ఐరన్​రోప్​ తెగిపోవడంతో తెరుచుకోలేదు.  ప్రాజెక్ట్ గేట్లను ప్రతి ఏడాది సర్వీసింగ్​చేయడంతో పాటు రిపేర్లు కూడా చేయిస్తాం. గేట్లలో సాంకేతిక లోపాలు ఉంటే  నీటి విడుదలలో సమస్య తలెత్తుతుంది. ప్రాజెక్ట్ గేట్ల వర్కింగ్​కండిషన్​పై  మేము అప్రమత్తంగానే ఉన్నాం. ఈ నెలలో ఎస్సీరెస్పీలోకి పూర్తి స్థాయి నీటిమట్టం చేరింది. దీంతో 75 టీఎంసీలకు చేరగానే నీటిని విడుదల చేశాం. వరద ఫ్లో ఉన్నందున గేట్ల రిపేర్లను తాత్కాలికంగా నిలిపివేశాం.

–  శ్రీనివాస్, ఎస్ఈ, ఎస్సారెస్పీ