తెలంగాణకు మళ్లీ నీళ్ల గాయం

మళ్లీ కృష్ణా నీళ్లను మళ్లీ పంచాలంటూ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌‌ విత్‌‌ డ్రాకు అంగీకరించటంతో  పరోక్షంగా రాయలసీమ లిఫ్ట్ (సంగమేశ్వరం) ఆపాలని వేసిన ఇంప్లీడ్‌‌ పిటిషన్‌‌ కూడా వెనక్కు తీసుకోక తప్పని పరిస్థితి. కేస్​ విత్​ డ్రా చేసుకుంటే తెలంగాణకు ఉన్న ఒక్కగానొక్క లీగల్​ ఆప్షన్​ కూడా చేజేతులా కోల్పోతుంది.   రెండు నదుల్లో నీటిని మళ్లీ పంచడమంటే అది తెలంగాణ, ఏపీకే పరిమితమయ్యే విషయం కాదు.  ఎగువన ఉన్న కర్నాటక, మహారాష్ట్ర కూడా తమ వాటాలకు పట్టుబడుతాయి. అప్పుడు కృష్ణా నీళ్ల లొల్లి పెరిగి పెద్దగవటం తప్ప ఒరిగే లాభమేమీ లేదు.

(బొల్గం శ్రీనివాస్​, వెలుగు స్టేట్​బ్యూరో చీఫ్​)

అరవై ఏండ్ల అరిగోసకు.. ఆరేండ్ల కిందటే పీడ విరుగడైంది. ఇప్పటికీ నీళ్ల మంటలు చల్లారలేదు. ఈ ఆరేండ్లలో స్వరాష్ట్ర పాలకులు మన నీళ్లను మనవైపు మలుపుకోవాలనే సోయి మరిచిపోయారు. ఉమ్మడి పాలనను నిందించటం తప్ప.. ఉన్న నీళ్లను వాడుకోవాల్సిన బాధ్యత తమపైన ఉందనే చిన్న లాజిక్ మిస్సయ్యారు. చిన్నా పెద్దా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సింది పోయి, కాళేశ్వరం మెగా ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టులన్నీ రీ డిజైన్ చేసి కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తామన్న సీఎం కేసీఆర్ ఏకంగా లక్ష కోట్ల బడ్జెట్​ను ఈ ఒక్క ప్రాజెక్టులోనే కుమ్మరించారు. అవసరమైతే మన గోదావరి నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని.. బేసిన్లు, బేషజాలు లేకుండా రెండు రాష్ట్రాలు నీళ్లు పంచుకుంటామని ఏపీతో చేతులు కలిపారు. మేం కలిసుంటే మీకేమన్నా కళ్లు మండుతున్నాయా.. అంటూ అడిగిన వాళ్లందరినీ కడిగి పారేశారు.

కృష్ణా జలాల్లో మనకున్న వాటా నీటిని కాపాడుకోకపోతే, భవిష్యత్తులో ముప్పు తప్పదని..  దక్షిణ తెలంగాణ ప్రయోజనాలకు గండి పడుతుందనే అంశాన్ని మన ప్రభుత్వం  పట్టించుకోలేదు. సమైక్య పాలనలో మన నీళ్లకు గండి కొట్టిన పోతిరెడ్డిపాడును రెండింతలు వెడల్పు చేసి.. కృష్ణా నీటిని మళ్లించుకునేందుకు ఏపీ కొత్త ప్రాజెక్టులు కడుతుంటే సన్నాయి నొక్కులు నొక్కింది. టెండర్లు పిలిచేంత వరకు చేద్దాం.. చూద్దాం అన్నట్లుగా నటించింది.  శ్రీశైలం కుండకు చిల్లు పెడుతున్నారని, పోతిరెడ్డిపాడు డబుల్​ గండికి తోడు సంగమేశ్వరం నుంచి ఏపీ నీళ్ల దోపిడీకి ప్లాన్​ చేసిందని ‘వెలుగు’ స్టోరీలు రాసేంత  వరకు సైలెన్స్ నటించింది. ఆ తర్వాతే మెలకువ వచ్చినట్లుగా.. పోతిరెడ్డిపాడు ఆపాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. అప్పటికప్పుడు బోర్డులకు ఫిర్యాదు చేసింది. ఆరేండ్లుగా సర్కారు నిర్లక్ష్యమే.. ఇప్పుడు దక్షిణ తెలంగాణ రైతుల మెడకు బిగుసుకుంటోంది.

ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవటంతో అసలు కథ బయటపడింది. ఆరేండ్లుగా కొత్త ప్రాజెక్టులపై మన సర్కారు అనుసరించిన ధోరణి బయటపడింది. రీ డిజైన్​ పేరుతో కృష్ణా నీళ్లను పట్టించుకోకుండా గోదావరిలో ఎదురీదటం.. అవసరమైతే గోదావరిని కృష్ణాకు లింక్​ చేసి ఏపీని ఆదుకుంటామంటూ మన పాలకులు గొప్పలకు పోవటం తెలంగాణకు చేటు తెచ్చింది. అపెక్స్​ భేటీలో చర్చకు వచ్చిన అంశాలన్నింటా ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్​ లేవనెత్తిన పలు అంశాలు అసంబద్ధంగా ఉండటం.. అటు ఏపీకి మేలు చేయటంతోపాటు తెలంగాణ సెల్ఫ్ గోల్​ చేసుకున్నట్లయింది. మీటింగ్​ ముగిసినంక.. పోతిరెడ్డిపాడు ఆపకపోతే అలంపూర్ నుంచే కృష్ణా నీళ్లను మళ్లించుకుంటామని కేసీఆర్ చేసిన హెచ్చరిక తాటాకు చప్పుళ్లను తలపించింది. అక్కడి నుంచి  నీళ్లను మళ్లించుకునేందుకు ఇంతకాలం ఎవరైనా అడ్డుపడ్డారా? దానిని ఎవరు అడ్డగించారు? అనే ధర్మ సందేహాలను లేవనెత్తింది. మన పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణకు మళ్లీ గాయమైంది.

దాచి దాచి.. కొత్తవని చాటుకున్నారా..!

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న  ప్రాజెక్టుల వివరాలు ఇప్పటి దాకా దాచిపెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఇచ్చేందుకు అంగీకరించటం కూడా తెలంగాణకు మైనస్​.  పరోక్షంగా అవన్నీ కొత్త ప్రాజెక్టులేనని అంగీకరించినట్లయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ పై కేసీఆర్ చేసిన వాదనలు కాళేశ్వరం థర్డ్ టీఎంసీ, సీతారామ లిఫ్ట్ పనులను ఇరుకున పెట్టాయి. ఈ ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కట్టిందనే నెగిటివ్​ ఇండికేషన్​కు స్కోప్​ ఇచ్చినట్లయింది. ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్‌‌ చేసిన ప్రాజెక్టులను తెలంగాణలోని ఎక్కువ భూభాగానికి ప్రయోజనం చేకూర్చేలా రీ డిజైన్‌‌ చేసుకుని నిర్మిస్తున్నామని పలు వేదికలపై చెప్పిన కేసీఆర్‌‌ సడెన్ గా  చేతులెత్తేశారు. స్కోప్‌‌ మార్చిన, నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులన్నీ కొత్తవేనని అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ తేల్చేయడంతో రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కొత్త వాటి కిందికే వచ్చాయి. ఉమ్మడి ఏపీలోనే సీడబ్ల్యూసీ అప్రూవల్‌‌ ఉన్న ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా, దుమ్ముగూడెంను సీతారామ లిఫ్ట్‌‌ స్కీంగా రీ డిజైన్‌‌ అయ్యాయి. ఇప్పుడు వీటికి కొత్త పర్మిషన్లతో పాటు నీటి కేటాయింపులు పొందాల్సిందే. రాష్ట్రంలో నిర్మిస్తోన్న అన్ని ప్రాజెక్టుల డీటైల్డ్‌‌ రిపోర్టులు ఇచ్చేందుకు అంగీకరించటంతో కాళేశ్వరం థర్డ్ టీఎంసీ పనుల వివరాలు వెల్లడించక తప్పదు. నీటి కేటాయింపులు లేకుండానే ఈ ప్రాజెక్టులు చేపడుతుండటంతో సీడబ్ల్యూసీ, హైడ్రాలజీ పర్మిషన్‌‌లకు మళ్లీ వెయిటింగే. దీంతో కోట్లు పోసిన కాళేశ్వరం నుంచి కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చుడు డౌటే.

ఫస్ట్ మీటింగ్​ మరిచిపోయారు

తెలంగాణలోని పాలమూరు– రంగారెడ్డి, డిండి లిఫ్ట్ స్కీమ్​, ఏపీలో ఉన్న  ముచ్చుముర్రి ప్రాజెక్టు పాతవేనని ఫస్ట్ అపెక్స్​ మీటింగ్​లోనే రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. 2016 సెప్టెంబర్​లో జరిగిన ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను మరిచిపోవటంతో మళ్లీ అప్పటి వివాదమే రిపీట్​ అయింది. ఈ రెండు ప్రాజెక్టులు సైతం  కొత్త జాబితాలో చేరాయి. ఇప్పటికే నిధుల కొరతతో పాలమూరు ముందుకు సాగడం లేదు. డిండి లిఫ్ట్‌‌ పనులు మొదలు పెట్టలేదు.  అన్ని పర్మిషన్లు వస్తే తప్ప బ్యాంకులు, ఫైనాన్స్‌‌ సంస్థల నుంచి లోన్‌‌లు వచ్చే పరిస్థితి లేదు. అదే సాకుతో పనులు ఆపేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అపెక్స్​ సాకుతో వీటిని పూర్తిగా వదిలేస్తే.. దక్షిణ తెలంగాణను మళ్లీ ఎడారి ఛాయలు అలుముకునే ప్రమాదం లేకపోలేదు.

ఏపీకి వరంగా మారింది

తెలంగాణకు నష్టం చేసిన పదకొండో షెడ్యూలు ఇప్పుడు ఏపీ నెత్తిన  పాలు పోసింది. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్​( సంగమేశ్వరం) ద్వారా కృష్ణా నీళ్లను తరలించుకునేందుకు లైన్​ క్లియర్​ చేసినట్లయింది. ఏపీలోని తెలుగు గంగ, గాలేరు నగరి ప్రాజెక్టులు పదకొండో షెడ్యూల్‌‌లో ఉన్నాయి.  ఈ రెండింటికీ  67 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఆ నీటినే తాము తీసుకుంటున్నట్లు ఏపీ వాదించింది. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులను పాత ప్రాజెక్టుల్లోనే ఉన్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి 150 టీఎంసీల కృష్ణా నీళ్లు దక్కేందుకు సెకండ్​ అపెక్స్ భేటీ గ్రౌండ్​ ప్రిపేర్​ చేసింది.

రివర్సయిన పదకొండో షెడ్యూల్‌‌

విభజన చట్టంలోని 11వ షెడ్యూల్​ ఇప్పుడు తెలంగాణకు షాక్​ ఇచ్చింది.  బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌లో నీటి కేటాయింపులున్నవి, ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌లోని పదకొండో షెడ్యూల్‌‌లో ఉన్న ప్రాజెక్టులనే పాతవిగా పరిగణిస్తామని అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ తేల్చింది. పదకొండో షెడ్యూల్‌‌లో ఏపీకి చెందినవి నాలుగు ప్రాజెక్టులుంటే.. తెలంగాణకు చెందినవి రెండే ఉన్నాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులే ఈ జాబితాలో ఉన్నాయి.  ఉమ్మడి ఏపీలో నిర్మించిన ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌ ప్రాజెక్టు కూడా ఇందులో లేదు. అప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగిందని మొత్తుకున్న పాలకులు తర్వాత చేసిందేమీ లేదు.  అప్పటికే సర్వే పూర్తయిన పాలమూరు – రంగారెడ్డి, డిండి కూడా అందులో లేవు. గడిచిన ఆరేండ్లలో పట్టుపట్టి కేంద్రం నుంచి ఈ రెండింటికీ అనుమతులు సాధించాల్సిన తెలంగాణ సర్కారు.. అటువంటి ప్రయత్నమేమీ చేయలేదు.

గోదావరి పుట్టి ముంచారు..!

తెలంగాణలో గలగల పారే గోదావరి నీళ్లకు కేసీఆర్​ తన వాదనలతో కొత్త కిరికిరి పెట్టారు. గోదావరిలో తెలంగాణకు 967.94 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో అప్పటి సీఎం కిరణ్​కుమార్ రెడ్డి  ఒప్పుకున్నారు. ప్రాజెక్టుల వారీగా నీళ్లను పంపిణీ చేసేందుకు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకు ఒక్కరోజులోనే లెటర్​ పంపిస్తామని కేసీఆర్ కోరటం పరోక్షంగా ఏపీకి, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ఎక్కువ నికర జలాలు దక్కేలా చేసినట్లయింది. 2014 జూన్ 2 నాటికి పూర్తయినవి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ లెక్కగడితే తెలంగాణలో 650 టీఎంసీలు, ఏపీలో 776 టీఎంసీల గోదావరి నీటి వినియోగం ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర, చత్తీస్​గఢ్​, ఒరిస్సా, ఏపీ రాష్ట్రాలున్నాయి. ట్రిబ్యునల్ ఏర్పాటై  ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయిస్తే ఇతర రాష్ట్రాలు సైతం నికర జలాలకు పట్టుబట్టవనే గ్యారంటీ లేదు. ఇవన్నీ తమ వాటాలు కోరితే… గోదావరి నీళ్లను పంచిపెట్టాల్సి వస్తుంది. అంత మేరకు తెలంగాణ లాసవుతుంది. అదే జరిగితే మన పుట్టి మనం ముంచుకున్నట్లే. ఇప్పుడు గోదావరిపై స్వేచ్ఛగా ఉన్న ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి.. కాళేశ్వరం, దేవాదుల  ప్రాజెక్టుల సమాచారాన్ని ఇతర రాష్ట్రాలు హక్కు భుక్తంగా అడిగి తెలుసుకునే ఛాన్స్​ ఇచ్చినట్లే.

కృష్ణాను కొల్లగొట్టారు..

అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956  సెక్షన్​ 3 ప్రకారం కృష్ణా జలాల కేటాయింపులపై విచారణ చేపట్టాలని పట్టుబట్టిన కేసీఆర్.. సుప్రీం కోర్టులో కేసును విత్ డ్రా చేసుకుంటామని అంగీకరించటం మరో బూమరాంగ్. 2015లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. అది ఒక్క ఏడాదికేనని,  ఏడేండ్లయినా అదే కొనసాగిస్తున్నారని కేసీఆర్​ వాదించారు. ఇప్పుడున్న అడ్​హక్​ కేటాయింపులతో కృష్ణా పరిధిలో ఉన్న ప్రాజెక్టుల్లో ఎక్కడైనా నీటిని వాడుకునే ఛాన్స్​ దొరికింది. కృష్ణా నీళ్లలో క్యాచ్​మెంట్​ ఆధారంగా తెలంగాణకు 575 టీఎంసీలు దక్కుతాయంటూ కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న కేసీఆర్ అపెక్స్ భేటీలో ఆ అంశాన్ని గట్టిగా పట్టుబట్టడం మరిచిపోయినట్లున్నారు.  అందుకు బదులు కృష్ణా, గోదావరి నదుల్లోని నీటిని ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి వారించినా పట్టుబట్టడం బెడిసికొట్టింది. కృష్ణా నీళ్లు పునః పంపిణీ చేయాలని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌‌ విత్‌‌ డ్రాకు అంగీకరించటంతో  పరోక్షంగా రాయలసీమ లిఫ్ట్ (సంగమేశ్వరం) ఆపాలని వేసిన ఇంప్లీడ్‌‌ పిటిషన్‌‌ కూడా వెనక్కు తీసుకోక తప్పని పరిస్థితి. కేస్​ విత్​ డ్రా చేసుకుంటే తెలంగాణకు ఉన్న ఒక్కగానొక్క లీగల్​ ఆప్షన్​ కూడా చేజేతులా కోల్పోతుంది.   రెండు నదుల్లో నీటి పునః పంపిణీ చేయాలంటే అది తెలంగాణ, ఏపీకే పరిమితమయ్యే విషయం కాదు.  ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర కూడా తమ వాటాలకు పట్టుబడుతాయి.  అప్పుడు కృష్ణా  నీళ్ల జగడం పెరిగి పెద్దగవటం తప్ప ఒరిగే లాభమేమీ లేదు.

కొత్త స్లోగన్​ అలంపూర్‌‌ బ్యారేజీ?

అపెక్స్​ భేటీ అనంతరం.. కేసీఆర్​ కొత్తగా అలంపూర్​ బ్యారేజీ  స్లోగన్ ఎత్తుకున్నారు.  ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు,  సంగమేశ్వరం లిఫ్ట్‌‌ ప్రాజెక్టులను ఆపకుంటే మహారాష్ట్ర బాబ్లీ కట్టినట్టుగా అలంపూర్‌‌కు సమీపంలోని పెద్దమరూర్‌‌ వద్ద కృష్ణా నదిపై ఈ బ్యారేజీ కడతామంటున్నారు. శ్రీశైలంకు వచ్చే నీళ్లను రాకుండా అక్కడి నుంచి  మళ్లించుకుంటామనే వార్నింగ్​ ఇచ్చారు. తెలంగాణ వచ్చి ఆరేండ్లు అవుతున్నా ​ ఒక్కనాడైనా ఈ   బ్యారేజీ ఊసెత్తని  కేసీఆర్​..  సడెన్​గా ఈ పేరు ఎత్తడం.. అపెక్స్​ భేటీలో జరిగిన భంగపాటుకు రియాక్షన్​ తప్ప రియాలిటీగా మారుతుందా.. అనేది ప్రశ్నార్థకమే. అంత నిబద్ధత ఉంటే.. పోతిరెడ్డిపాడు గండి డబుల్​ చేస్తే ఎందుకు  ప్రేక్షక పాత్ర పోషించారు..?   రోజుకు 3 టీఎంసీల నీళ్లను కృష్ణా నుంచి ఎత్తిపోయాలనుకుంటే.. 2 టీఎంసీల పాలమూరు రంగారెడ్డిని ఒక్క టీఎంసీకి ఎందుకు కుదించారు? ప్రాజెక్టులో మొదటి రిజర్వాయర్‌‌ నార్లాపూర్‌‌ కెపాసిటీని సగానికి ఎందుకు తగ్గించారు? డిండి ప్రాజెక్టును ప్రహసనంగా ఎందుకు మార్చారు?  డిండిని ప్రత్యేక ప్రాజెక్టుగా ఒకసారి, పాలమూరు రంగారెడ్డిలో భాగంగా మరోసారి.. సర్వేల మీద సర్వేల పేరుతో అసలు ప్రాజెక్టు ఉందో లేదో తెలియని దుస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? ఎస్​ఎల్​బీసీ పనులకు వేల కోట్ల బిల్లులెందుకు ఆపేశారు? ఇవన్నీ  కృష్ణా జలాలను.. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను మన పాలకులు పట్టించుకోలేదని రూడీ చేసే ప్రశ్నలే.

For More News..

అటు కరోనా.. ఇటు రెసిషన్.. పేదరికంలోకి 15 కోట్ల మంది

బిల్డింగుల కిరాయిలు కట్టలేక ఫర్నీచర్‌‌‌‌ అమ్ముతున్నస్కూల్ యాజమాన్యాలు

ఆస్తుల మ్యుటేషన్ బంద్.. అయోమయంలో కొనుగోలుదారులు