జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి పంప్‌హౌజ్ లో కొన్ని మోటర్ల రిపేర్లు ఇటీవల పూర్తయినప్పటికీ లక్ష్యంమేర నీళ్లు ఎత్తిపోసే చాన్స్ లేకుండా పోయింది. జులై 14న గోదావరి వరదలకు పంప్‌హౌజ్ నీటమునిగిన విషయం తెలిసిందే. పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటర్లను పక్కనపెట్టి, మిగిలినవాటిలో 4 మోటర్లకు ఇంజినీర్లు రిపేర్లు పూర్తిచేశారు. ఇటీవలే ట్రయల్‌రన్ కూడా చేసినప్పటికీ ఈలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. ఈ ఐదు నెలల్లో 4వేల టీఎంసీల నీళ్లు బయటకు వెళ్లిపోగా, ప్రస్తుతం మేడిగడ్డ నుంచి ఎత్తిపోసేందుకు 11 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీంతో కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్ల కింద యాసంగి పంటలకు వారబందీ కిందే నీళ్లు ఇస్తామని ఆఫీసర్లు ప్రకటించారు.
ఐదు నెలలుగా గేట్లు ఖుల్లా..
లక్ష కోట్ల ఖర్చుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏడాది కూడా నీటిని ఎత్తిపోసుకోలేని పరిస్థితి వచ్చింది. భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా జూలై 14న కాళేశ్వరంలో భాగమైన అన్నారం, కన్నెపల్లి పంప్‌హౌజ్‌లు నీట మునిగాయి. ముఖ్యంగా సేఫ్టీవాల్ కూలి కన్నెపల్లిలో ఆరు మోటర్లు తుక్కుకింద మారాయి. మొత్తంగా వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కన్నెపల్లిలో డీవాటరింగ్కే నెలకు పైగా పట్టింది. గడిచిన నాలుగు నెలలుగా సేఫ్టీవాల్ నిర్మాణం, మోటర్ల రిపేర్లు, ఎలక్ట్రిసిటీ పనులు చేస్తున్నారు. ఇటీవలే నాలుగు మోటార్లను రెడీ చేసిన ఇంజినీర్లు ట్రయల్ రన్ చేస్తున్నారు. కానీ ఈలోపే మేడిగడ్డ వద్ద ప్రాణహితలో వరద ప్రవాహం తగ్గిపోయింది. నవంబర్ నెలలో రోజుకు 30 వేల క్యుసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండగా.. ప్రస్తుతం రోజుకు 2,850 వేల క్యుసెక్కుల వరద మాత్రమే వస్తోందని ఇంజినీర్లు ప్రకటించారు. పంప్‌హౌజ్‌ల రిపేర్లు ఉండడంతో మేడిగడ్డలో 11 టీఎంసీలు, అన్నారం లో 8 టీఎంసీలు కొనసాగిస్తూ ఐదు నెలలుగా నీటిని దిగువకు వదులుతూనే ఉన్నారు. దీంతో ఇప్పటికే 4వేల టీఎంసీల నీళ్లు దిగువకు పోయినట్లు ఇంజినీర్లు చెప్తున్నారు.
యాసంగి పంటలకు వారబందీ
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరుసగా110 రోజులపాటు 2 టీఎంసీల చొప్పున 220 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది సర్కారు లక్ష్యం. కానీ ఈసారి పంప్‌హౌజ్‌లు మునిగిపోవడంతో చుక్క నీటిని కూడా ఎత్తిపోయలేదు. కానీ భారీ వానల వల్ల కాళేశ్వరం పరిధిలోకి వచ్చే మిడ్‌మానేర్, ఎల్ఎండీ సహా ఇతర రిజర్వాయర్లు ఫుల్లుగా నిండాయి. అటు ఎస్సారెస్సీ కూడా నిండుకుండలా మారింది. కానీ ఖరీఫ్ పంటలకు నీటి విడుదల వల్ల రిజర్వాయర్లు కొంతవరకు ఖాళీ కాగా, వాటిని కాళేశ్వరం ద్వారా నింపుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో కాళేశ్వరం, ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. రైతులంతా దాదాపు వరి వేసేందుకే మొగ్గుచూపుతుండడంతో వేసవిలో పంట కోతకు వచ్చే దశలో కష్టాలు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.