హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. భారీ వరద నీటికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బియాస్ నది అయితే ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో బియాస్ నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది.
దీంతో మండీ, కులు మధ్య రహదారిపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కులూ జిల్లాలోని చారుడు గ్రామంలో ఓ ఇంటిని బియాస్ నది వరద చుట్టుముట్టింది. బియాస్ నది ఒడ్డునగల భవనం అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలి వరదనీటిలో కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే బియాస్ నది ప్రవాహానికి మండి జిల్లాలోని అవ్ట్ లో 50ఏళ్ల నాటి ఐరన్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది.
హిమాచల్ లో భారీ వర్షాల కారణంగా సిమ్లా జిల్లాలోని కోట్‌గఢ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వర్షాకాలం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు ఇప్పటికే రూ.362 కోట్ల నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 2023 జూలై 08శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది.