ఖరీఫ్​లో 32 లక్షల ఎకరాలకు నీళ్లు

ఖరీఫ్​లో 32 లక్షల ఎకరాలకు నీళ్లు
  • సాగుకు 313 టీఎంసీల నీటి విడుదలకు సర్కార్ నిర్ణయం
  • కృష్ణా బేసిన్​లో 14.05 లక్షలు.. గోదావరి కింద 17.95 లక్షల ఎకరాలకు నీళ్లు

హైదరాబాద్, వెలుగు:  ప్రస్తుత ఖరీఫ్ సీజన్​లో వివిధ ప్రాజెక్టుల నుంచి 32 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మొత్తం 313 టీఎంసీల నీటిని సాగు అవసరాల కోసం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులన్నీ నిండడంతో ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని భావిస్తున్నది. 

శనివారం రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ(స్కైవమ్) చైర్మన్ ఈఎన్ సీ అనిల్ కుమార్ నేతృత్వంలో మీటింగ్ నిర్వహించారు. వరి, ఆరుతడి పంటలకు నీళ్లు అందించాలని నిర్ణయించారు. కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టుల కింద 14.05 లక్షల ఎకరాలకు 125 టీఎంసీలు, గోదావరి బేసిన్​లో 17.95 లక్షల ఎకరాలకు 188 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం గోదావరి బేసిన్​లో సరైన వరదలు లేకపోవడం.. ప్రధాన ప్రాజెక్టుల్లో నిల్వ లేకపోవడంతో 15 రోజుల తర్వాత మరోసారి సమావేశం నిర్వహించనున్నారు.