- పెండింగ్ స్కీములతో పాటు కొత్త స్కీములపై రేవంత్ సర్కారు దృష్టి
- పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో లిఫ్ట్ స్కీమ్‌లకు రూపకల్పన
- రిజర్వాయర్లకు ఫండ్స్ కేటాయింపు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : గోదావరి తలాపున ఉన్న జిల్లాల్లో పడావు భూములకు నీళ్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కారు రెడీ అయ్యింది. కాళేశ్వరం ద్వారా నీళ్లు రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా తెరపైకి పాత, కొత్త స్కీమ్‌లు తీసుకువస్తున్నారు. దీంతో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలు లిఫ్ట్ స్కీమ్‌లకు రూపకల్పన చేస్తున్నారు. పాత స్కీమ్‌లలో భాగంగా కాల్వల తవ్వకాలకు, రిజర్వాయర్ల నిర్మాణానికి ఫండ్స్ కేటాయిస్తున్నారు. కొత్త స్కీమ్ లకోసం ప్రపోజల్స్ రెడీ చేశారు.
కాళేశ్వరం ద్వారా రాని నీళ్లు
పక్కనే గోదావరి నది పారుతున్నా చాలామంది రైతుల పంటలకు సాగునీరు కరువైంది. గోదావరి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఈ నది ప్రవాహం దేశవ్యాప్తంగా1,465 కి.మీ ఉండగా మన రాష్ట్రంలో 275 కిలోమీటర్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. కేసీఆర్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి భూపాలపల్లి జిల్లా నుంచి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి సిద్దిపేట, గజ్వేల్ జిల్లాలకు తరలించింది. కానీ, ఇక్కడి రైతాంగాన్ని మాత్రం విస్మరించింది. లింక్‒1లో పనులు పూర్తి చేసి భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో 20 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని 2016లోనే గత బీఆర్ఎస్ప్రభుత్వం ప్రకటించింది.
2019, జూలై నెలలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పనులు 2023 అక్టోబర్ 21 వరకు కొనసాగినా స్థానికంగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ, కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌హౌస్, అన్నారం(సరస్వతి) బ్యారేజీ, పెద్దపల్లి జిల్లాలో అన్నారం (సరస్వతి) పంప్‌హౌస్, సుందిళ్ల(పార్వతి) బ్యారేజీ, సుందిళ్ల (పార్వతి) పంప్‌హౌజ్ నిర్మాణాల కోసం స్థానిక రైతులు 5 వేల ఎకరాలకు పైగా భూములు కోల్పోయారు.
తెరపైకి పాత, కొత్త స్కీమ్‌లు
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే గోదావరి వెంట ఉన్న జిల్లాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వేలాది ఎకరాల పంట భూములు కోల్పోయిన స్థానిక రైతులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో గోదావరి తీర ప్రాంత ఆయకట్టుకు సాగునీరందించేందుకు ప్లాన్చేస్తున్నారు. ఏడాదికి 220 టీఎంసీ గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసేందుకు చూస్తున్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న టైంలోనే జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పూర్ మండలం బీరసాగర్ దగ్గర చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు.
ఆ సర్కారు హయాంలోనే రూ.325 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయితే తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్ పదేండ్ల పాటు అధికారంలో ఉన్నా ఈ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదు. ఇది పూర్తయితే భూపాలపల్లి జిల్లాలోని ఐదు మండలాల్లో 45 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయినా సాగునీటికి నోచుకొని 63 గ్రామాల రైతులకు ప్రయోజనం కలిగే విధంగా రేవంత్ సర్కారు చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి పూనుకుంది. మొన్నటి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించి పనులు స్పీడప్ చేసింది.
మూడు జిల్లాల్లో లిఫ్ట్ స్కీమ్‌లు
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 80 వేల ఎకరాల ఎస్పారెస్పీ, గ్యాప్ ఆయకట్టుకు సాగునీరందించడానికి ఇరిగేషన్ ఇంజినీర్లు రూ.800 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా మూడో ఫేజ్‌లో నిర్మించిన పైప్‌లైన్ల ద్వారా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం నుంచి గోదావరి నీళ్లు రామప్ప చెరువుకు చేరుకుంటున్నాయి. ప్రతి ఏటా 20 టీఎంసీలకు పైగా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఎస్సారెస్పీ సెకండ్ ఫేజ్‌లో నిర్మించిన డీబీఎం38 కాలువ టెయిలెండ్ వరకు నీళ్లు అందట్లేదు. దీంతో భూపాలపల్లి
ములుగు జిల్లాలో 44 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. దీంతో రామప్ప నుంచి 3 టీఎంసీలను లిఫ్ట్ చేసి ఎస్సారెస్పీ కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రూ.231 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేసి సర్కారుకు పంపించారు. అలాగే భూపాలపల్లి, ములుగు, మంథని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లోని 34 వేల ఎకరాల గ్యాప్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రామప్ప నుంచి 3 టీఎంసీలను లిఫ్ట్ చేయడానికి వీలుగా రూ.571 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేసి ప్రభుత్వానికి పంపించినట్లుగా ఇరిగేషన్ ఇంజినీర్లు ప్రకటించారు.
పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
కాళేశ్వరం ద్వారా మొదటి ప్రయోజనం పెద్దపల్లి జిల్లాకే అని నాటి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఉత్తవే అయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లిన కాళేశ్వరం నీళ్లు పెద్దపల్లి జిల్లాలోని ఆయకట్టును తడపలేదు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పత్తిపాక రిజర్వాయర్‌ను నిర్మించి పెద్దపల్లి జిల్లా చివరి ఆయకట్టు వరకు నీళ్లందించడానికి ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే పత్తిపాకపై కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. 7 టీఎంసీల కెపాసిటీతో ధర్మారం మండలం పత్తిపాక వద్ద రిజర్వాయర్ నిర్మించనున్నారు.
ఎల్లంపల్లి ద్వారా నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్నింపి జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు నీరందించనున్నారు. రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాతో పాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని మండలాల రైతులకు మేలు జరిగే ఛాన్స్ ఉంది. 70 వేల ఎకరాల వరకు సాగునీరందుతుంది. అలాగే రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి లిప్టు మీద కూడా రేవంత్ సర్కార్ దృష్టి సారించింది.