- కాకతీయ కెనాల్‌కు నీటి విడుదలపై ఆఫీసర్ల తలోమాట
- కరీంనగర్ జిల్లా వరకే నీళ్లిస్తామన్న ఈఎన్సీ
- తమకు సమాచారం లేదంటున్న ఓరుగల్లు ఆఫీసర్లు
- ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 3.57 లక్షల ఎకరాల ఆయకట్టు
- నార్లు పోసుకొని నీళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు
- జిల్లా మంత్రులు చొరవ తీసుకోవాలని వేడుకోలు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఈ యాసంగి సీజన్లో ఎలాగైనా ఎస్సారెస్పీ నీళ్లు వస్తా యన్న ఆశతో నార్లు పోసుకున్న వరంగల్‌ఉమ్మడి జిల్లా రైతులు ఇరిగేషన్ ఆఫీసర్ల తీరుతో అయోమయంలో పడ్డారు. ఎస్సారెస్పీ, లోయర్, మిడ్ మానేర్ డ్యామ్‌లలో 100 టీఎంసీలకు పైగా నీళ్లున్నప్పటికీ ఎల్ఎండీ దిగువన కేవలం కరీంనగర్జిల్లా వరకే సాగునీరందిస్తామని కరీంనగర్‌లో శనివారం ఈఎన్సీ శంకర్ ప్రకటించారు.
దీనిపై వరంగల్ ఇరిగేషన్ ఆఫీసర్లను అడిగితే సమాచారం లేదంటున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కింద వరి, ఆరుతడి పంటలకు సిద్ధమైన రైతుల్లో టెన్షన్ మొదలైంది. కాకతీయ కాల్వ ద్వారా ఎప్పట్లాగే వారబందీ పద్ధతిలోనైనా సరే, ఉమ్మడి వరంగల్జిల్లా అంతటికీ నీళ్లివ్వాలని,ఈ విషయంలో జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కాళేశ్వరం నీళ్లతో ఏమిటి సంబంధం?
వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఎస్పారెస్పీ నీళ్లే పెద్ద దిక్కు. ఈ జిల్లాలో ఎస్సారెస్పీ ఫేజ్‒1 కింద 3.57 లక్షలు, ఫేజ్ –2 కింద 1.13 లక్షల ఆయకట్టు ఉంది. ఫేజ్‒2 పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఫేజ్–1 కు 50 ఏండ్లుగా కాకతీయ కెనాల్ ద్వారా శ్రీరాంసాగర్ నీళ్లు ఇస్తున్నారు. వర్షాలు పడి శ్రీ రాంసాగర్ నిండితే మొదటి పంటకు (వానాకాలం) పూర్తిస్థాయిలో, రెండో పంటకు (యాసంగి) వారబందీ పద్దతిలో నీళ్లివ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఎస్సారెస్పీలో యాసంగి సమయానికి 75 టీఎంసీలకు పైగా నీళ్లుంటే వరం గల్ ఉమ్మడి జిల్లా దాటి సూర్యాపేట వరకు నీళ్లు పంపిస్తుంటారు.
ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతున్నదే. కానీ, ఈ సారి ఎస్సారెస్పీతో పాటు లోయర్, మిడ్ మానేర్‌లో కలిపి 103 టీఎంసీల నీళ్లున్నప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లాకు నీళ్లిచ్చేందుకు ఆఫీసర్లు తటపటాయిస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు ఆగిపోవడం వల్లే ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది 2019 జూలై నెలలో..కానీ, 50 ఏండ్లుగా ఎస్సారెస్పీ ద్వారానే నీళ్లు వస్తున్న సంగతిని రైతులు గుర్తు చేస్తున్నారు. అసలు తమకు ఇప్పటివరకు కాళేశ్వరం నీళ్లే రాలేదని తేల్చి చెప్తున్నారు.
సాగునీటి కోసం రైతన్నల ఎదురుచూపు
వరంగల్ ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టు అధికంగా ఉంది. డీబీఎం 48 కాలువ కింద 1,43 లక్షలు ఎకరాలు, డీబీఎం 38 కింద 78,614, డీబీఎం 30,31 కింద 51,118, డీబీఎం 23 నుంచి 27 కాలువల కింద 20,365 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు సాగునీరందించడానికి గత ప్రభుత్వాలు వేల కిలోమీటర్ల పొడవున కాల్వలు తవ్వారు.
ప్రతియేటా వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరందిస్తున్నారు. వేలాది చెరువులను నింపుతున్నారు. ఈసారి ఎస్సారెస్పీలో ఫుల్లుగా నీళ్లు ఉండడంతో రైతులు వానాకాలంలో సాగుచేసిన పత్తి పంటను తీసేసి సుమారు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అలాగే, ఎస్సారెస్పీ కింద ఉన్న చెరువులు, బావుల కింద కూడా సుమారు లక్ష ఎకరాల్లో వరినాట్లు వేసుకోవడానికి నార్లు పోసుకున్నారు. ఎస్సారెస్పీ కాలువల్లో పారే నీళ్ల కోసం రైతులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు యాసంగి పంటల సాగుకు ఎస్పారెస్పీ నీళ్లివ్వకపోతే ఆరుతడి పంటలు ఎండిపోతాయని, చెరువులు నింపకపోతే వరినాట్లు పడవంటున్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వారం తప్పించి వారం నీళ్లు విడుదల చేస్తే చాలంటున్నారు.
ఎస్సారెస్పీ నీళ్ల కోసం చూస్తున్నం
వానాకాలం వేసిన రెండెకరాల పత్తి తీసేసి ఇటీవల మక్కజొన్న వేసిన. నాలాగే మా ఊళ్లో 200 ఎకరాల్లో మక్కజొన్న వేశారు. రైతులంతా కూడా ఎస్పారెస్పీ నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆరుతడి పంట కావడంతో వారం తప్పించి వారం నీళ్లిస్తే చాలు.
దుంపల మహేందర్ రెడ్డి, ఆరెపల్లి, శాయంపేట
మాకేం సమచారం లేదు!
ఎస్పారెస్పీ కాలువల ద్వారా ఈ సారి వరంగల్ ఉమ్మడి జిల్లాకు నీళ్లిచ్చే సంగతి గురించి మాకు తెలియదు. ఉన్నతాధికారుల నుంచి మాకెలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికైతే కాకతీయ కెనాల్‌లో నీళ్లు రావట్లేదు. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సుధాకర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ, వరంగల్