సుంకిశాల మొదలు కాలె.. కొండపోచమ్మ లింక్‌‌ కాలె

సుంకిశాల మొదలు కాలె.. కొండపోచమ్మ లింక్‌‌ కాలె
  • పత్తాలేని కేశవపూర్‌‌, రాచకొండ రిజర్వాయర్లు
  • ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులతోనే హైదరాబాద్‌‌కు తాగునీళ్లు
  • హిమాయత్‌‌ సాగర్‌‌, ఉస్మాన్‌‌ సాగర్‌‌ నీళ్లే అక్కర్లేదన్న సీఎం
  • జంట జలాశయాలు లేకుంటే గ్రేటర్‌‌కు తాగునీటి కటకట

హైదరాబాద్​ తాగునీటి అవసరాలు తీర్చడానికి కేశవపూర్‌‌, రాచకొండ రిజర్వాయర్లు నిర్మిస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. సుంకిశాల డ్రింకింగ్‌‌ వాటర్‌‌ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచినా ఇంకా పనులు మొదలు పెట్టలేదు. ఇప్పటికిప్పుడు కొండపోచమ్మ సాగర్​ నుంచి నీళ్లు తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు.  ఇప్పటికీ గ్రేటర్‌‌ తాగునీటి అవసరాలు తీరుస్తున్నది ఉమ్మడి ఏపీలో చేపట్టిన కృష్ణా(నాగార్జున సాగర్‌‌), గోదావరి (ఎల్లంపల్లి) ప్రాజెక్టులే.  

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘ఉస్మాన్‌‌ సాగర్‌‌, హిమాయత్‌‌ సాగర్‌‌ ట్యాంకుల నీళ్లు హైదరాబాద్‌‌ కు అక్కర్లేదు.. సింగూరు నుంచే నీళ్లు తెస్తా ఉన్నం.. గోదావరి, కృష్ణా వాటర్‌‌ సఫిషియెంట్‌‌గా తెస్తా ఉన్నం..  సుంకిశాల  పనులు స్టార్ట్‌‌ అయినయి.. గోదావరి జలాలు మల్లన్నసాగర్‌‌కు, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారానే హైదరాబాద్‌‌కు వచ్చే అవకాశముంది. భవిష్యత్‌‌లో ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్‌‌కు డ్రింకింగ్‌‌ వాటర్‌‌ సమస్య రాదు’’ అంటూ ఇటీవల అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌‌  చెప్పారు. కానీ, ఆయన చెప్పిన ప్రాజెక్టుల్లో ఒక్క దాని పనులు కూడా ఇప్పటికీ మొదలు కాలేదు. ఆ పనులు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు పూర్తవుతాయో కూడా తేలడం లేదు. అలాంటప్పుడు గ్రేటర్‌‌ తాగునీటి అవసరాల కోసం జంట జలాశయాలపై ఆధార పడాల్సిన అవసరమే లేదని చెప్పడం ఏమిటని రిటైర్డ్​ ఇంజనీర్లు అంటున్నారు. ఆ జంటజలాశయాలు లేకుంటే హైదరాబాద్​కు తాగునీటి కటకట తప్పదని చెప్తున్నారు.  

రెండు డెడికేటెడ్​ రిజర్వాయర్లు నిర్మిస్తామని చెప్పి..!

ఉమ్మడి ఏపీలో చేపట్టిన కృష్ణా, గోదావరి డ్రింకింగ్‌‌ వాటర్‌‌ ప్రాజెక్టులు గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ అవసరాలు తీర్చలేవని, ఇంత పెద్ద నగరం తాగునీటి అవసరాల కోసం రెండు డెడికేటెడ్‌‌ రిజర్వాయర్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌‌ పలు సందర్భాల్లో చెప్పారు. మేడ్చల్‌‌ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవపూర్‌‌లో 20 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్‌‌ ప్రతిపాదించారు. దీనికి వ్యాప్కోస్‌‌ డీపీఆర్‌‌ సిద్ధం చేసి మూడేండ్ల కిందట్నే  హైదరాబాద్‌‌ మెట్రో వాటర్‌‌ బోర్డుకు అందజేసింది. 2,166.18 ఎకరాల విస్తీర్ణంలో రూ. 4,750 కోట్లతో రిజర్వాయర్‌‌ నిర్మించాల్సి ఉంటుందని డీపీఆర్‌‌లో పేర్కొన్నారు. అంత భారీ మొత్తం కేటాయించడం సాధ్యం కాదని సర్కారు తేల్చిచెప్పడంతో దాన్ని 5 టీఎంసీలకు కుదించారు. దీనికి రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. మొత్తం 1,530 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా అందులో అటవీ భూమి 1,234.12 ఎకరాలు. 90 శాతం అటవీ భూములు సేకరించాల్సి ఉండటం.. ఇక్కడ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ క్యాంపులు నిర్వహిస్తుండటంతో ఆ భూముల బదలాయింపుపై మొదట్లోనే సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ నుంచి కేశవపూర్‌ రిజర్వాయర్‌ కేవలం 15 కిలో మీటర్లే కావడంతో గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. దీనిపై అప్పట్లో హడావుడి చేసిన సర్కారు తర్వాత అటకెక్కించింది. నాగార్జునసాగర్‌ నుంచి తరలించే నీళ్లు నిల్వ చేయడానికి రాచకొండ గుట్టల దిగువన 10 టీఎంసీల కెపాసిటీతో మరో రిజర్వాయర్‌ నిర్మిస్తామని అప్పట్లో రాష్ట్ర సర్కార్​ ప్రకటించింది. ఈ రిజర్వాయర్‌ కోసం ప్రిలిమినరీ సర్వే మినహా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. సిటీ దగ్గరగా ఉండటంతో భూసేకరణ భారమవుతుందని, ఇక్కడా అటవీ భూములే ఎక్కువగా ఉన్నాయని ఆ రిజర్వాయర్‌ ప్రతిపాదనను పక్కన పెట్టింది. 

ముందుకు సాగని సుంకిశాల

ప్రస్తుతం నాగార్జునసాగర్‌‌ నుంచి హైదరాబాద్‌‌ తాగునీటి కోసం 500 అడుగుల నుంచి నీటిని పంప్‌‌ చేస్తున్నారు. భవిష్యత్​లో కృష్ణాలో వరదలు తగ్గితే సాగర్‌‌లో 462 అడుగుల నుంచి నీటిని తరలించేలా సుంకిశాల ప్రాజెక్టును ప్రతిపాదించారు. రూ.1,450 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు పనులను మేఘా ఇంజనీరింగ్‌‌ సంస్థ దక్కించుకుంది. టెండర్‌‌ ప్రక్రియ పూర్తయి దాదాపు ఏడాది అవుతున్నా నిధులు కేటాయించకపోవడంతో  పనులు మొదలు కాలేదు. 2022 - 23 బడ్జెట్‌‌లో ఈ ప్రాజెక్టుకు రూ.750 కోట్లు కేటాయించారు. ఆ నిధులు సకాలంలో విడుదల చేసి, వచ్చే బడ్జెట్‌‌లోనూ నిధులిస్తే 2024 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

కొండపోచమ్మ లింక్​ ఇప్పట్లో అయ్యేనా?

హైదరాబాద్‌కు డెడికేటెడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ రిజర్వాయర్‌కు బదులు మల్లన్నసాగర్‌లోనే 10 టీఎంసీలు నిల్వ చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అక్కడి నుంచి రెండు స్టేజీల్లో కొండపోచమ్మకు నీటిని తరలిస్తారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కెనాల్‌ ద్వారా రావల్కోల్‌ చెరువుకు.. అక్కడి నుంచి శామీర్‌పేట చెరువుకు తరలించాలని నిర్ణయించారు. రావల్కోల్‌ చెరువు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్క నుంచి ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు నీటిని తరలించాలని రిటైర్డ్‌ ఇంజనీర్లు ప్రతిపాదించారు. కానీ దీనిపై సర్కారు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రిటైర్డ్‌ ఇంజనీర్లు ప్రతిపాదన మినహా ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయలేదు. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ నుంచి గోదావరి నీళ్లు తేవడం సాధ్యం కాదు. పాత గోదావరి, కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టులు మాత్రమే నగర దాహార్తిని తీర్చాల్సి ఉంది. సర్కారు చెప్పిన ప్రాజెక్టులు మొదలే కాకున్న, రెండు రిజర్వాయర్ల ప్రతిపాదన పక్కన పెట్టినా ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నీళ్లే హైదరాబాద్‌కు అక్కర్లేదని సీఎం ప్రకటించడంపై రిటైర్డ్‌ ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ జంట జలాశయాలు లేకుంటే హైదరాబాద్​ తాగునీటికి కటకట తప్పదని అంటున్నారు.