డెడ్​ స్టోరేజీ దగ్గరలో ‘సాగర్’

నాగార్జున సాగర్ ప్రాజెక్టులో  నీటిమట్టం అడుగంటిపోతున్నది. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా,  ప్రస్తుతం 519.60 అడుగులు ఉన్నది. ఎగువన వర్షాలు పడి వరద వస్తేనే ఎడమ కాల్వకు  నీళ్లు వదిలే అవకాశం ఉంది.  శ్రీశైలంలోనూ 807.34  అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది.

  •     గట్టివానలు లేక కనీస మట్టాలకు చేరిన ఎగువన ప్రాజెక్టులు
  •     అక్కడ్నుంచి వరద వస్తేనే సాగర్​లోకి నీళ్లు
  •     అప్పటి దాక ఎడమకాల్వకు  నీటి విడుదల లేనట్టే
  •     దుక్కులు పొతం చేసుకుని రైతుల ఎదురుచూపు 

హాలియా, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో  నీటిమట్టం అడుగంటిపోతోంది.  ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులు(133 టీఎంసీలు) కాగా,  ప్రస్తుతం 519.60 అడుగులు(148. 5482  టీఎంసీలు)గా ఉన్నది.  ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు( 312.0450  టీఎంసీలు).  వానలు ఇంకా ఊపందుకోకపోవడం.. వరద రాకపోవడంతో కృష్ణానది పరివాహకంలో సాగర్ ప్రాజెక్టుతో పాటు ఎగువనున్న నారాయణపూర్,  ఆల్మట్టి,  జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల్లో  సైతం నీరు కనిష్ఠ మట్టాలకు  పడిపోయింది.  శ్రీశైలం ప్రాజెక్టులో  807.34 (32.459 టీఎంసీలు ) నీటి మట్టం మాత్రమే ఉంది.  సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ ఉమ్మడి నల్గొండ జిల్లాతో  పాటు జంట నగరాల తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోనున్నారు. ఇందుకు కేవలం ప్రస్తుతం కనీస మట్టానికి  పైన పది టీఎంసీల  నీరు మాత్రమే అందుబాటులో ఉంది.  

ఈపాటికే నీరు వచ్చేది..

జూన్​, జులై నెలల్లో కురిసే భారీ వర్షాలకు సాగర్​లోకి   ఈపాటికే నీరు వచ్చి చేరేది.  కాని ఈ ఏడాది జులై  ప్రారంభమైన చినుకు జాడ లేకపోవడంతో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి.  మున్ముందు గట్టి వానలు పడి  కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వస్తేనే స్టోరేజీ పెరిగే చాన్స్​ ఉంది.  అప్పటిదాకా సాగర్ ఆయకట్టు కాల్వలకు నీరు విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో వానాకాలం సాగు ఆలస్యమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంటల సాగు ముందుకు జరపాలని చెప్పినా.. అది ప్రస్తుతం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. నిజానికి సాగర్ ఆయకట్టుకు ఏటా జూన్ 15 నుంచి వానా కాలం పంటలకు నీరు ఇవ్వాలని కృష్ణా రివర్​ బోర్డు గెజిట్ లో  పేర్కొన్నది.  వానల ఆలస్యంతో ఆగస్టు, సెప్టెంబర్ లోనే  నీటి విడుదల సాగుతుంది. కృష్ణా నదికి సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ లో వరదలు వస్తున్నందున సాగర్ ప్రాజెక్టులో  536 అడుగుల నీటిమట్టం పాటించాలని గతంలో కృష్ణా బోర్డు ఉత్తర్వులిచ్చింది. వరదలు వచ్చేవరకు ఈ నీటిని వాడుకోవడం, తర్వాత వరదను  సాగుకు విడుదల చేయడం బోర్డు ఉద్దేశమైనప్పటికీ ఆచరణలో ఆ రూల్​కు రెండు రాష్ట్రాలు గండి కొడుతూ అధిక నీటిని వాడుకుంటున్నాయి.  దీంతో వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి వచ్చింది.

ఎడమకాల్వకు నీటి విడుదల కష్టమే..

గడిచిన రెండు,  మూడు ఏండ్లుగా ఆగస్టు మొదటి వారంలోనే సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు ప్రభుత్వం సాగునీటిని విడుదల చేస్తోంది. కానీ ఈ ఏడాది వానలు లేని కారణంగా సాగర్ ఆయకట్టు ప్రాంతంలో  వరి సాగుపై రైతుల్లో ఆందోళన మొదలైంది.  ఎగువన కృష్ణా బేసిన్ లో మంచి వానలు కురిసి భారీ వరదలు వస్తే తప్ప  సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం పెరుగదు.  అప్పటిదాక సాగు నీటి విడుదలకు చాన్స్​ లేదు.  శ్రీశైలం, జూరాల, తుంగభద్ర, నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంలు పూర్తి స్థాయిలో నిండితే తప్ప నాగార్జునసాగర్ డ్యాం కు  వరదవచ్చే అవకాశం లేదు. ఇదిలా ఉంటే జులై మొదటి వారంలో ఏటా వరినార్లు పెంచుకొని ఆగస్టులో వరి నాట్లు వేసేవారు. కానీ ఈసారి పరిస్థితి మాత్రం గతం కంటే భిన్నంగా ఉంది. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో  నీటి వనరులు లేవు. ఇక్కడ వరి సాగు తప్ప మెట్ట పంటలు కూడా పండవు.   రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని చెల్కలను చదును చేసి పెట్టుకుని వానల కోసం ఎదురుచూస్తున్నారు.