- కేసీఆర్ దత్తత తీసుకున్న నల్గొండ అభివృద్ధి పనుల్లో నాణ్యత డొల్ల
- వివిధ పనులకు ఖర్చు చేసిన రూ.244 కోట్ల ప్రజాధనం వృథా
- హడావుడిగా ప్రారంభించగా నిరుపయోగంగా నిర్మాణాలు
నల్గొండ, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నల్లగొండ అభివృద్ధి పనుల్లో నాణ్యత కరువైంది. దీంతో రూ.244 కోట్ల నిధులు వృథా అయ్యాయి. వానకు ఐటీ టవర్స్‌లో నీళ్లు కారుతోండగా.. అర్బన్ పార్కు నీట మునిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని హడావుడిగా పనులను చేపట్టారు. అస్తవ్యస్తంగా చేసి ప్రారంభించకుండానే మధ్యలో వదిలేశారు. ఇటీవల కురిసిన చిన్నవానకే రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్స్ లీకవుతోంది.
దీంతో బిల్డింగ్‌లో అన్ని బ్లాక్‌లను మూసివేశారు. సుమారు 2 వేల ఐటీ కంపెనీలు వస్తాయని, స్థానికంగానే నిరుద్యోగులకు ఉపాధి దొరకుతుందని గత పాలకులు హడావుడిగా నిర్మించారు. నల్గొండలో ఐటీ టవర్స్‌తో పెద్దగా ఉపయోగం లేదని, నిరుద్యోగులు హైదరాబాద్‌కు, లేదంటే బెంగళూరుకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతారని ఐటీ నిపుణులు చెప్పినా వినలేదు. 2021లో ఐటీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారు.
ఆనవాళ్లు కోల్పోయిన అర్బన్‌పార్కు
చర్లపల్లి సమీపంలో రూ.కోటితో అర్బన్ పార్కు నిర్మించగా.. ప్రస్తుతం ఆనవాళ్లు కూడా లేవు. చెరువును ఆనుకుని పార్కును నిర్మించగా.. వానాకాలమొస్తే మునిగిపోతోంది. ఇక పరిసర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ మురుగు పార్కులోంచే పారుతుంది. ప్రస్తుతం పార్క్‌లో పశువులు మేస్తున్నాయి. సుందరీకరణకు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన చెట్లు కూలిపోగా, బొమ్మలు విరిగి పోయాయి.
రోడ్లు, మార్కెట్లు ఆగమాగం
టౌన్లో డబుల్‌సైడ్ రోడ్లకు రూ.120 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.90 కోట్లతో పనులు పూర్తి చేశారు. కాంట్రాక్టర్‌కు రూ.25 కోట్లు, ఇంకో రూ.25 కోట్ల పని పెండింగ్‌లో ఉంది. కాగా.. రూ.90 కోట్లతో కంప్లీట్ చేసిన పనులకు ఫైనాన్స్క్లియరెన్స్లేదు. పేపర్‌మీద తప్ప బడ్జెట్కేటాయింపులు చేయలేదు. దీంతో ఎన్నికలకు ముందే కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. టౌన్ లోపల ప్రొఫైల్రోడ్డు వేయగా డ్రైనేజీ వ్యవస్థ పాడైంది. పాత రోడ్డుకు మించి రోడ్డు పెంపుతో వాననీరంతా గల్లీల్లో పారుతోంది. కల్వర్టులు కట్టకపోగా డ్రైనేజీ మురుగు రోడ్లపైకి చేరుతోంది. మర్రిగూడ బైపాస్‌వద్ద భూసేకరణ చేయకుండానే హైవే మీద ఫ్లై ఓవర్‌పనులు చేపట్టారు.
మాజీ మున్సిపల్చైర్మన్మందడి సైదిరెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్భూ సేకరణలో పోతుందనే ఉద్దేశంతో వన్సైడ్రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో వాహనాల రాకపోకలు ఒకవైపే కొనసాగి స్తుండగా.. తరచూ ప్రమాదాలు జరుగుతుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల తో రెండో వైపు భూసేకరణ చేపట్టారు. మాజీ చైర్మన్ షాపింగ్కాంప్లెక్స్కూల్చివేస్తున్నారు. దేవరకొండ రోడ్డులో నిర్మించిన రైతుబజార్ఇరుకుగా ఉండడంతో వ్యాపారులు రోడ్ల మీదనే అమ్ముకుంటున్నారు. వెజ్,నాన్వెజ్మార్కెట్నిర్మించేటప్పుడే అభ్యంతరాలు వచ్చాయి. అవేమీ పట్టించుకోకుండా నిర్మించడంతో మార్కెట్‌ను సైతం మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పని పేరు ఖర్చు పెట్టిన నిధులు (కోట్లలో)
అర్బన్‌పార్కు రూ. 1 కోటి
రైతు బజార్ రూ.1.11 కోట్లు
వెజ్, నాన్వెజ్మార్కెట్ రూ.8.05 కోట్లు
డబుల్ ఇండ్లు రూ.48.75 కోట్లు
టౌన్ లో డబుల్ ఇండ్లు రూ.90 కోట్లు
ఐటీ హబ్ రూ.90 కోట్లు
డబుల్ ఇండ్లలో హై‘డ్రామా’
నల్గొండ టౌన్ లో 560 ఇండ్లకు 552 పూర్తి చేయగా.. ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షల చొప్పున ఖర్చు చేశారు. ఇంట్రా పనులు చేయకముందే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డ్రా తీసి.. 400 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలిన152 ఇండ్లకు డ్రా తీయకుండా నేతల అనుచరుల కోసం పక్కన పెట్టారు. ఆ తర్వాత ఇంట్రా పనులు కాలేదనే హై‘డ్రామా’ క్రియేట్ చేసి, ఎవరికీ ఇండ్లు ఇవ్వకుండానే ఫైల్క్లోజ్చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా చిట్టడవిలా మారింది. రూరల్‌లో 840 ఇండ్లకు150 కంప్లీట్చేయగా, ఇందులో 240 వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకో 450 ఇండ్లను కట్టనేలేదు. 2020లో కంప్లీటైన ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు. నిర్మాణాలకు ఖర్చుపెట్టి రూ.48 కోట్లను దుబారా చేశారు.