మహబూబ్​నగర్​ జిల్లాలో అడుగంటుతున్న గ్రౌండ్​ వాటర్​

మహబూబ్​నగర్​ జిల్లాలో అడుగంటుతున్న గ్రౌండ్​ వాటర్​
  • ఫిబ్రవరి నుంచే పెరిగిన ఎండలు 
  • మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లో పడిపోతున్న  నీటి మట్టం
  • నిరుడుకంటే గ్రౌండ్​ వాటర్​ పెరిగినా అధిక వినియోగంతో కష్టాలు
  • జూరాలకు ఒక టీఎంసీ నీటినే విడుదల చేసిన కర్నాటక ప్రభుత్వం

మహబూబ్​నగర్​, వెలుగు : ఈ ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాధారణంకంటే అధిక వర్షాలు రికార్డ్​ అయ్యాయి. కానీ, సమ్మర్​లో మాత్రం నీటి సమస్య తప్పేలా లేదు. మహారాష్ర్ట, కర్నాటకలో కురిసిన భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టుల నిండి పెద్ద మొత్తంలో దిగువకు వరద వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు ఫుల్​ కెపాసిటీకి చేరుకున్నాయి. వాటి కింద ఉన్న చెరువులు, కుంటలు నిండాయి. వీటి పరిధిలో ఉన్న బోర్లు రీచార్జ్​ అయ్యాయి. కానీ  నెలలు తిరక్క ముందే ప్రాజెక్టుల్లో నీళ్లు ఆవిరైపోతున్నాయి. జనవరి చివరిలోనే నీళ్లు అడుగంటిపోయాయి. దీనికితోడు ఏప్రిల్​  టెంపరేచర్లు.. ఫిబ్రవరి నుంచే మొదలు కావడంతో నీటి నిల్వలు పడిపోతున్నాయి. తాగు, సాగునీటికి వినియోగం పెరగడంతో తాజాగా బోర్లు కూడా వట్టిపోతున్నాయి.

నాలుగు నెలల్లో నాలుగు మీటర్లకు పడిపోయాయి..

గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్​మెంట్​ విడుదల చేసిన లెక్కల ప్రకారం గతేడాది నవంబరు చివరి నాటికి మహబూబ్​నగర్​ జిల్లాలో 6.02 మీటర్ల లెవల్​కు, నారాయణపేట జిల్లాలో 4.99 మీటర్ల లెవల్​ వరకు నీరు చేరింది. దీంతో గ్రౌండ్​ వాటర్​ పెరిగి బోర్లు రీచార్జ్​ అయ్యాయి. 

మహబూబ్​నగర్​ జిల్లాలోని రాజాపూర్​, గుడిబండ, పెద్దరేవల్లి, గంగాపూర్​, కోడ్గల్​, శేరి వెంకటాపూర్​, వెలుగోముల, పోమాల్​, తీగలపల్లి, ఈద్గాన్​పల్లి, అడ్డాకుల, కురుమూర్తి, దేవరకద్ర, మీనుగోనిపల్లి, సల్కార్​పేట, వేపూర్​, జడ్చర్ల, దమ్మాయిపల్లి, కౌకుంట్ల, ఏనుగొండ, కొత్తపల్లి, మిడ్జిల్​.. నారాయణపేట జిల్లాలోని పస్పుల, లింగంపల్లి, కొల్పూర్​, మక్తల్​, కొల్లంపల్లి, కోటకొండ, పులిమామిడి, కోస్గి, అప్పిరెడ్డిపల్లి, చేగుంట, దామరగిద్ద, సర్జఖాన్​పేట, మరికల్​, మద్దూరు, అమ్లికుంట, ధన్వాడ, కొండాపూర్​ ప్రాంతాల్లో గ్రౌండ్​ వాటర్​ లెవల్స్ పెరిగాయి. 

అయితే ఫిబ్రవరి వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. నెల రోజులకు ముందే ఎండలు దంచడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి.  నాలుగు నెలల్లో 3.20 మీటర్ల లోపలికి నీటి నిల్వలు పడిపోయాయి. నారాయణపేట జిల్లాలో 4.99 మీటర్ల లెవల్​లో ఉన్న నీళ్లు నాలుగు నెలల్లో 7.59 మీటర్ల లెవల్​కు పడిపోయాయి. దీని ప్రకారం ఈ జిల్లాలో 2.6 మీటర్ల లోతుకు నీటి నిల్వలు అడుగంటిపోయాయి. 

ప్రాజెక్టుల కింద వారబంది..

గ్రౌండ్​ వాటర్​ పెరిగిందని ఈ యాసంగిలో రైతులు రెండు జిల్లాల్లో మూడు లక్షల ఎకరాల్లో వరి పంటలు వేశారు. అయితే వాతావరణంలో మార్పులు రావడంతో డిసెంబర్​  నుంచే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతూ వచ్చాయి. దీంతో ఆఫీసర్లు వారబంది ప్రకటించారు. సాగునీటి కెనాల్స్​కు నీటిని విడుదల చేయడం లేదు. దీంతో డిసెంబరు చివరి  వారం నుంచి  వరి పంటలను కాపాడుకోవడానికి రైతులు బోర్లను విపరీతంగా ఉపయోగించారు. 

దీనికితోడు తాగునీటి అవసరాల కోసం ఆర్​డబ్ల్యూఎస్​ ఆఫీసర్లు కొన్ని బోర్లను లీజుకు తీసుకొని.. వాటి పరిధిలోని గ్రామాలకు తాగునీటిని తరలిస్తున్నారు. దీంతో అత్యంత వేగంగా గ్రౌండ్​ వాటర్​ పడిపోయిందని గ్రౌండ్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మార్చి, ఏప్రిల్​, మే ఎండలు  మరింత ముదిరితే.. ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

అడిగింది నాలుగు టీఎంసీలు..

ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కర్నాటక వెళ్లారు. ఆ రాష్ర్ట సీఎం సిద్దిరామయ్యను కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన నీటి వనరైన జూరాల ప్రాజెక్టు డెడ్​ స్టోరేజీకి చేరువలో ఉందని.. నారాయణపూర్​ డ్యామ్​ నుంచి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. ఆ రాష్ర్ట ఇరిగేషన్​ శాఖ మంత్రి శివకుమార్​ను కలిసి.. పరిస్థితిని వివరించారు. ఇందుకు స్పందించిన వారు నీటి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాని.. గత నెల 22న ఒక టీఎంసీ నీటిని మాత్రమే అక్కడి డ్యామ్​ నుంచి దిగువకు విడుదల చేశారు. ఆ నీరు జూరాలకు చేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. అయితే డిమాండ్​ మేరకు నీటిని విడుదల చేస్తే ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు కొంత ఉపశమనం కలుగుతుంది.