భద్రాచలం వద్ద మళ్లీ పెరిగిన వరద

భద్రాచలం వద్ద మళ్లీ పెరిగిన వరద
  •     48 అడుగులకు చేరడంతో మరోసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీ
  •     వరద ప్రవాహం  50 అడుగులకు  చేరే ఛాన్స్‌‌‌‌‌‌‌‌

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. వరద పెరగడంతో గురువారం మధ్యాహ్నం రెండో ప్రమాదహెచ్చరికను జారీ చేసిన ఆఫీసర్లు తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో అర్ధరాత్రి 12.45 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. శుక్రవారం రాత్రి వరద మళ్లీ 48 అడుగులకు చేరుకోవడంతో మరోసారి రెండో ప్రమాదహెచ్చరికను జారీ చేశారు. అయితే ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులు ఉప్పొంగుతుండడంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం తిరిగి 50 అడుగుల మేరకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ ఆఫీసర్లు చెబుతున్నారు. మరో 
వైపు శబరి ప్రవాహం తగ్గడంతో తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ముంపు గ్రామాల ప్రజలను అలర్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద..

ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్‌‌‌‌‌‌‌‌ వద్ద గోదావరి నీటి మట్టం 15.830 మీటర్లకు చేరుకుంది. దీంతో ఆఫీసర్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం ఉదయం 15.010 మీటర్ల వద్ద ఉన్న వరద సాయంత్రం 5 గంటల వరకు వరద 15.850 మీటర్లకు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. వరద ప్రవాహం 17.360 మీటర్లకు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. రామన్నగూడెం పుష్కరఘాట్‌‌‌‌‌‌‌‌ను ఏఎస్పీ శివం సందర్శించి వరద పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలేందుకు ముంపు ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

ఎస్సారెస్పీలో 25 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి 25 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా, శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో 1072.40 అడుగులు (27.57 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ఆఫీసర్లు తెలిపారు.