
- జలాశయాల్లో వేగంగా పడిపోతున్న వాటర్ లెవల్స్
- ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ దాకా ఇదే పరిస్థితి
- అత్యధికంగా వరిసాగుతో తగ్గుతున్న భూగర్భజలాలు
- నిరుడు అక్టోబర్ నుంచి 54 శాతం లోటు వర్షపాతం
- ఎల్‌నినో ఎఫెక్ట్‌తో మార్చిలోనే మండుతున్న ఎండలు
- వేసవి అవసరాల దృష్ట్యా సాగునీటి సప్లై తగ్గిస్తున్న సర్కారు
- పంటలు ఎండుతున్నాయని రోడ్డెక్కుతున్న రైతులు
జయశంకర్ భూపాలపల్లి/ నెట్వర్క్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాష్ట్రంలో నిరుడు అక్టోబర్ నుంచి 54 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్‌తో మార్చిలోనే ఎండలు మండిపోతుండటంతో ప్రధాన జలాశయాల్లోని వాటర్ లెవల్స్ వేగంగా పడిపోతున్నాయి. గతేడాది మార్చితో పోలిస్తే కృష్ణా బెల్ట్‌లో జూరాల నుంచి నాగార్జునసాగర్ దాకా, గోదావరి బెల్ట్‌లో ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ దాకా అన్ని ప్రాజెక్టుల్లో నీటినిల్వలు గణనీయంగా తగ్గాయి.
దీంతో సాగునీటి సంగతేమోగానీ రాబోయే తాగునీటి గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సర్కారు తలపట్టుకుంటున్నది. ముఖ్యంగా ఎల్లంపల్లి నీటిమట్టం తగ్గడంతో హైదరాబాద్ మెట్రో వాటర్స్కీంకు తిప్పలు తప్పేలా లేవు. ఈ ప్రాజెక్టులో గత మార్చి7న 17.51 టీఎంసీల నీరుండగా, తాజాగా 10 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌కు 320 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో రాబోయే ఏప్రిల్, మే నెలల్లో హైదరాబాద్ డ్రింకింగ్‌వాటర్ సప్లైకి ఇబ్బందులు రాకుండా గూడెం లిఫ్ట్ కింద సాగునీరుకు కోతపెడుతున్నారు. 30 వేల ఎకరాల ఆయకట్టుకుగానూ కేవలం15 వేల ఎకరాలకు మాత్రమే ఇస్తుండటంతో పంటలు ఎండుతున్నాయని రైతులు గగ్గోలు పెడ్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో భూగర్భజలాలు కూడా సగటున ఒకటి నుంచి 3 మీటర్ల లోతుకు పడిపోవడంతో జనాల్లో, ముఖ్యంగా నగరవాసుల్లో టెన్షన్ మొదలైంది.
ఎందుకిలా?
రాష్ట్ర సగటు వర్షపాతం 906.3 మి.మీ. కాగా.. నిరుడు (2022–23) 1387.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే సగటుకన్నా 53 శాతం వర్షపాతం ఎక్కువ నమో దు కావడంతో కరువు ఛాయలు కనిపించలేదు. కానీ ఈ ఏడాది (2023–24) 914.9 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. మార్చి7 నాటి సగటు (866.7)తో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువే. కానీ ‘సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్’ వల్ల ఈ ఏడాది అటు వర్షాల్లో, ఇటు ఎం డల్లో తీవ్ర వ్యత్యాసాలు తలెత్తుతున్నాయని వాతావర ణ నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది వానకాలంలో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఆ వర్షపాతమంతా కేవలం వారం
పది రోజుల్లోనే రికా ర్డు కావడం, ఆ తర్వాత వర్షాలే లేకపోవడంలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదాహరణకు నిరుడు అక్టోబ ర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి 113.20 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 52.70 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. దీంతో 53.45 మి.మీ. లోటు నమోదైంది. అలాగే, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో కలిపి 12 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా వందశాతం లోటు ఉన్నట్టు రిపోర్టులు చెప్తున్నాయి. ఈ తేడాల వల్లే ప్రాజెక్టుల్లో నీటి మట్టంతోపాటు గ్రౌండ్వాటర్లెవల్స్ కూడా వేగంగా పడిపోతున్నాయి. సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్లే
ఈసారి ఎండాకాలం కూడా త్వరగా ప్రారంభమైందని నిపుణులు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో నవంబర్, జనవరి మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువ నమోదు కావడంతో భారత్ సహా వివిధ దేశాల్లో సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉంటుందని నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్వోఏఏ) నిరుడు అక్టోబర్‌లోనే అంచనా వేసింది. అందుకు తగ్గట్టే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోనూ తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి.
అడుగంటుతున్న ప్రాజెక్టులు
కృష్ణా బెల్ట్‌లో ఈ వానకాలం తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరాయి. ప్రస్తుతం జూరాలలో 4 టీఎంసీలు, శ్రీశైలంలో 36.40 టీఎంసీలు, సాగర్‌లో 140 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. నాగార్జున సాగర్ డెడ్‌స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515 అడుగుల నీరు మాత్రమే ఉన్నది. తాగునీటి అవసరాల దృష్ట్యా ఖరీఫ్ నుంచే సాగర్ ఆయకట్టు కింద రాష్ట్ర సర్కారు క్రాఫ్ హాలీడే ప్రకటించింది. కానీ సాగర్ఆయకట్టు కింద బోర్లపై ఆధారపడి పంటలు సాగుచేసిన రైతులు భూగర్భజలాలు అడుగంటడంతో చాలాచోట్ల పశువుల మేతగా వదిలేస్తున్నారు.
అటు గోదావరి ప్రాజెక్టుల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 26 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 10 టీఎంసీలు, మిడ్‌మానేరులో 12, ఎల్ఎండీలో కేవలం7 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా ఆయా ప్రాజెక్టుల కింద సాగునీటి సరఫరాకు సర్కారు కోతలుపెడ్తున్నది. ఉదాహరణకు కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీ నుంచే కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్, హుజూరాబాద్, సిద్దిపేట నియోజకవర్గాలకు మిషన్‌భగీరథ కింద తాగునీరు అందించాల్సి ఉండగా, కాకతీయ కాలువకు సాగునీటి సరఫరా తగ్గించింది. దీంతో చివరి ఆయకట్టుకు నీళ్లందక హనుమకొండ జిల్లాలోని రైతులు రోడ్డెక్కుతున్నారు.
జనవరి నుంచే పడిపోతున్న గ్రౌండ్ వాటర్
ఈ ఏడాది జనవరి నుంచే రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్‌వాటర్ లెవల్స్ పడిపోతు న్నట్టు భూగర్భ జలవనరుల శాఖ తేల్చింది. జనవరిలో సగటు నీటిమట్టం 6.22 మీటర్లు కాగా.. ఇప్పటికే 7.72 మీటర్ల లోతుకు పడిపోయాయి. నిజామాబాద్ జిల్లా గోనుగుప్పులలో ఏకంగా 27.63 మీటర్ల లోతుకు పడిపోయాయి. నిరుడు అక్టోబర్ నుంచి సగటు వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీళ్లు తగ్గుతూ రావడం, చెరువులు ఎండిపోవడంతో రైతులు తమ పంటలు కాపాడు కునేందుకు బోర్లపై ఆధారపడుతున్నారు. ఈ యాసంగిలో 62.89 లక్షల ఎకరా ల్లో రైతులు పంటలు సాగుచేయగా
అందులో అత్యధికంగా 47.88 లక్షల ఎక రాల్లో వరి వేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థి తులపై రైతులకు అవగా హన కల్పించి, వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచే యించాల్సిన వ్యవసాయాధి కారులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేశారు. ఫలి తంగా యాసంగిలో వరిసాగుచేసిన రైతులంతా పంటలను కాపాడుకునేందు కు జనవరి, ఫిబ్రవరి నెలల్లో బోర్లను నిరంతరంగా నడిపించారు. దీంతో భూగర్భజలాలు అడుగంటి, మార్చి ప్రారంభం నాటికి కోతకు వచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి.