
ఎండాకాలంలో భూగర్భజలాలు ఎండిపోవడం.. నీటికొరత ఏర్పడటం సహజంగా జరుగుతుంది. అయితే మద్రాస్ ఐఐటీ నిపుణులు గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేయవచ్చని చెబుతున్నారు. అదేంటి గాలి నుంచి నీరు ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా గాలి తేమతో నీటిని ఉత్పత్తిచేయవచ్చంటున్నారు. అంతే కాదు గాలి నీళ్లతో ఛాయ్ పెట్టుకుంటే టేస్ట్ అదర్స్ అంటున్నారు.
గాల్లోని తేమ నుంచి మంచి నీటిని సేకరించే ప్రక్రియ మన దేశంలో ఊపందుకుంది. నానో టెక్నాలజీ సాయంతో వాటర్ జనరేటర్లను తయారుచేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 'నానో స్కేల్ స్ట్రెచ్చర్'ను ఒక డివైజ్ కు కనెక్ట్ చేస్తే నీటిని సంగ్రహించగలవని' మద్రాస్ ఐఐటీ నానో టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువని ఆయన అంటున్నాడు.
తమిళనాడులో కొన్ని హోటల్స్ 'అట్మాస్పియర్ వాటర్ హార్వెస్టర్' ల ద్వారా ఖర్చును తగ్గించుకుంటున్నాయి. 'ఒకరోజులో కాఫీ, టీ తయారీ కోసం వంద లీటర్ల నీటిని ఉపయోగించేవారు.. . ఈ మెషీన్లు వాడితే నెలకు మూడు వేల రూపాయల దాకా ఆదా అవుతాయి. అయితే గాల్లో నుంచి మంచి నీటిని సృష్టించి.. భద్రపరిచే యంత్రాలు కొత్త విషయమేం కాదు. కానీ, తక్కువ ఖర్చుతో కమర్షియల్ అవసరాల కోసం తయారు చేయడం ఇక్కడ విశేషం.
భూగర్భజలాలు తగ్గిపోతున్న వేళ ఇలాంటి మెషిన్లకు డిమాండ్ పెరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటి మెషిన్లను తయారుచేసేందుకు మరికొందరు ముందుకొస్తున్నారు.
హైడ్రోజెల్స్
గాలిలో తేమ నుంచి నీటిని సృష్టించే ప్రయోగాలలో వినూత్నమైన వ్యవస్థను అమెరికా పరి శోధకులు సృష్టించారు. నీటిని ఒడిసిపట్టే హైడ్రోజెల్స్ని టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. “ఇవి స్పాంజిలాగా ఉంటాయి. గాలి తగిలే చోట పెడితే ఆ గాలిలోని తేమను గ్రహిస్తాయి. హైడ్రోజెల్ ని వేడిచేస్తే ఆ నీరు బయటికొస్తుంది. కిలో హెడ్రోజెల్ తో రోజుకు 50లీటర్ల వరకూ నీరు ఉత్పత్తి అవుతుంది. దీని ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందని" చెబుతున్నారు పరిశోధకులు.
►ALSO READ | ఆధ్యాత్మికం : మంచిగ బతకడం అంటే ఇట్లనే.. ఈ మూడు గుణాలు మనలో ఉంటే చాలు.. !
ఇలా తయారైన నీటిని నేరుగా తాగొచ్చని వారంటున్నారు. దీంతో పాటు సూర్యకాంతితో పని చేయగలిగే హైడ్రోజెల్స్ ను అభివృద్ధి చేసే పనిలో సైంటిస్టులు ఉన్నారు. గాల్లో 5 లక్షల ఘనపు కిలోమీటర్ల మేర నీటి హైడ్రోజెల్స్ నిల్వలుంటాయి. తేమ, పొడి వాతావరణ పరిస్థితుల్లో ఈ హైడ్రోజెల్స్ గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడతాయి. నీటి విపత్తులు, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రయోగం చక్కని ఫలితాలనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.