హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్ బేసిన్ అథారిటీ, డ్యాం సేఫ్టీ బిల్లులతో రాష్ట్రాలు నీటిపై హక్కులు కోల్పోతాయని చెప్పినా దేశంలో ఏ ఒక్క సీఎం స్పందించలేదని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసే అవార్డీ రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు రాష్ట్రాల హక్కు అని, దాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం జలసౌధలో వాటర్ రీసోర్సెస్ కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈ నెల 26, 27వ తేదీల్లో నదులపై నేషనల్ కన్వెన్షన్‌ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దేశంలోని 200 మంది ఎక్స్పర్ట్స్ పాల్గొనే ఈ సదస్సులో 11 నదులపై చర్చిస్తామన్నారు. అగ్రికల్చర్, రెయిన్ప్యాటర్న్లతో క్రాప్ ప్యాటర్న్‌లను లింక్ చేస్తే తక్కువ నీటితోనే ఎక్కువ పంటలను సాగు చేయవచ్చని చెప్పారు.
నదుల అనుసంధానం డిజాస్టర్ అయితది
దేశంలో రివర్ లిటరసీ మూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉందని రాజేంద్ర సింగ్ అన్నారు. జోధ్‌పూర్ సదస్సులో తయారు చేసిన రివర్ మేనిఫెస్టోను నేషనల్ కన్వెన్షన్‌లో ఫైనల్ చేస్తామన్నారు. నదుల అనుసంధానం దేశానికి డిజాస్టర్ అని అన్నారు. మార్కెటైజేషన్, ప్రైవేటైజేషన్, కమర్షియలైజేషన్ కోసమే నదుల అనుసంధానాన్ని తెరపైకి తెచ్చారని, దాని ద్వారా భారీ ప్రాజెక్టులను చేపట్టి కొందరు పెద్దోళ్లకే దేశ సంపదను దోచిపెట్టే కుట్ర అని ఆరోపించారు. మిగులు జలాలున్నాయని దేశంలోని ఏ ఒక్క రాష్ట్ర సీఎం అయినా చెప్తున్నారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు నదుల అనుసంధానం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దాని వల్ల రాజ్యాంగ, ఆర్థిక, సామాజిక, ఎకోలాజికల్ క్రైసిస్ వస్తుందని ఆయన హెచ్చరించారు. తాము తలపెట్టిన జలతీర్థలో భాగంగా వర్షం నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తే వరద ముప్పే ఉండదని చెప్పారు. గోదావరి నదీ ప్రాంతాల్లో ఎంత వర్షం పడుతుందో.. కావేరి క్యాచ్మెంట్ ఏరియాలోనూ అంతే వర్షం పడుతుందని, అలాంటప్పుడు ఆ రెండింటిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దేశంలో 85 శాతం నీళ్లు వ్యవసాయానికే ఉపయోగిస్తున్నారని, ఇలా చేస్తే భవిష్యత్ అవసరాలకు నీళ్లు ఉండవని చెప్పారు. నదుల అనుసంధానం, డ్యాం సేఫ్టీ బిల్లులపై గాంధేయ పద్ధతిలోనే పోరాడుతామన్నారు.
జనాలే చెయ్యాలె
నదుల పునరుజ్జీవం చేయడం లేదంటూ ప్రభుత్వాలను నిందించాల్సిన అవసరం లేదని, ఆ పనిని జనాలే కలసికట్టుగా చేయాలని రాజేంద్ర సింగ్ సూచించారు. వర్షాలు చాలా తక్కువ పడే రాజస్థాన్‌లో తాను జనంతో కలిసి 12 నదులకు జీవం పోశానని చెప్పారు. అలాంటప్పుడు దేశమంతటా అది ఎందుకు సాధ్యం కాదన్నారు. ఏడేండ్లలో తెలంగాణలో నీటి పరిరక్షణకు మంచి చర్యలు చేపట్టారని, ఒక్క ప్రాజెక్టుతో 200 కిలోమీటర్ల మేర గోదావరిని సజీవంగా మార్చారని చెప్పారు. యాదాద్రి ఆలయం చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. గోదావరిలో రాష్ట్రానికి 954 టీఎంసీల కేటాయింపులున్నా 900 టీఎంసీలు కూడా వాడుకోవడం లేదని వాటర్ రీసోర్సెస్ కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాశ్ అన్నారు. గోదావరి– కావేరి లింక్‌కు ఒప్పుకుంటే ఆయా రాష్ట్రాలకు లోయర్ రైపేరియన్ రైట్స్ వస్తాయని, అందుకే నదుల అనుసంధానానికి తాము ఒప్పుకోవడం లేదని చెప్పారు. నదులను పారనివ్వకుండా అడ్డంగా కట్టలు కడితే కింది వాళ్ల పరిస్థితేంటని తమిళనాడుకు చెందిన గురుస్వామి అన్నారు. సముద్ర తీరాల్లోని బీచుల్లో ఉండే ఇసుక మొత్తం నదుల నుంచి కొట్టుకు వచ్చేదేనని, సముద్రంలోకి నీళ్లు రాకుండా అడ్డుకుంటే లక్షల కోట్ల విలువైన సముద్ర సంపదను కోల్పోతామని ఏపీకి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేయడానికి రూ.50 కోట్లు ఖర్చవుతుందని, ఆ నీటిని సమర్థంగా వాడుకోకుంటే ఆ ప్రాజెక్టు రాష్ట్రానికే భారంగా మారుతుందని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు.