జంట జలాశయాల నీరే.. ఎంతో బెటర్..అప్పట్లో వద్దని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్

  •     ప్రస్తుతం కంటిన్యూగా నీటి వినియోగం
  •     ప్రతిరోజూ 68 మిలియన్ లీటర్లు పంపింగ్​  
  •     సమ్మర్​లోనూ మరింత వాడకం పెరిగే చాన్స్
  •     విద్యుత్ భారం తగ్గుతుందంటున్న ఎక్స్ పర్ట్స్

హైదరాబాద్, వెలుగు : హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నీరు సిటీకి అసలు అవసరమే ఉండదని మాజీ  సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. కానీ ఇప్పుడది ఎంతో ఉపయోగపడనుంది. గత వేసవికాలం నుంచి కంటిన్యూగా నీటిని వాడుతున్నారు. అయితే.. 111 జీవో ఎత్తి వేసేందుకే  కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. జంట జలాశయాల వరదతో పాటు తాగునీటికి కూడా వాడుకుంటే మంచిదని  పర్యావరణ వేత్తలు కూడా గత ప్రభుత్వానికి సూచించారు. 

వందల కిలో మీటర్ల నుంచి సిటీకి తీసుకొచ్చే కృష్ణ, గోదావరి జలాల  కరెంట్ బిల్లుల ఖర్చులు వృథా కాకుండా ఉంటాయని వివరించారు.  జంటజలాశయాలను కాపాడాలంటూ కోర్టులను కూడా ఆశ్రయించారు. కాగా.. వాటి నుంచి చుక్క నీరు కూడా అవసరంలేని కేసీఆర్ తేల్చి చెప్పారు. కానీ.. ఈ ఏడాది సమ్మర్ కు ముందు నుంచే వాడుతున్నారు. ఈ ఏడాది ఎండలు దంచికొట్టడంతో రెండు జలాశయాల నీటిని తాగేందుకు వాడారు. ఇంకా వినియోగిస్తున్నారు. గతేడాది వేసవిలో పెద్దగా వీటి నుంచి నీటి అవసరం పడలేదు.  హిమాయత్ సాగర్ నుంచి నామ్ కే వాస్తేగా 2 ఎంజీడీలనే తీసుకున్నారు. ఈ సారి మార్చి నుంచే రెండు జలాశయాల నీటిని నాన్ స్టాప్ గా పంపింగ్​ చేస్తున్నారు. 

నీటి మట్టాలు. అవసరాన్ని బట్టి పెంచడంతో పాటు తగ్గిస్తున్నారు. లాస్ట్ ఇయర్ వర్షాకాలానికి ముందే రెండు జలాశయాలు నిండుకుండల్లా కనిపించాయి. దీంతో అప్పట్లో వర్షాలు కురవడంతో వరదనీరంతా మూసీలోనే కలిసింది. దీంతో సర్కారుపై ఎక్స్ పర్ట్స్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమ్మర్ లో నీటిని వాడకపోవడంతో వర్షపు నీరంతా వృథాగా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ తర్వాత నీటిని వాడకం చేపట్టారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ నుంచి రోజు 64.000 మిలియన్ లీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి 4.000  మిలియన్ లీటర్ల నీటిని తీసుకుంటున్నారు.  భవిష్యత రోజుల్లో వాడకం పెంచనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే మూసీలో పెద్దగా నీరు వృథా కాకుండా ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

నీటి తరలింపుతో కరెంట్ బిల్లుల భారం 

 హిమాయత్ సాగర్‌‌, ఉస్మాన్​సాగర్​జలాశయాల నుంచి నీటిని వినియోగించుకోకుండా  200 కిలోమీటర్ల దూరంలోని ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు, 180 కిలోమీటర్ల దూరంలోని కోదండాపూర్ నుంచి కృష్ణ నీటిని  సిటీకి తీసుకొస్తున్నారు. ఆ  జలాల తరలింపుతో పాటు  సిటీ నలుమూలలా  పంపిణీకి జలమండలి 200 మెగావాట్ల విద్యుత్‌ను ఖర్చు చేస్తుంది. ఇందుకు నెలకు రూ.70 కోట్ల మేర బిల్లులు చెల్లిస్తుంది. రోజుకు రూ.2 కోట్లకుపైగా ఖర్చు చేస్తుంది. 

కృష్ణా, గోదావరి నీటిని తరలింపుతో  జలమండలిపైనే విద్యుత్ భారం చాలా పెరిగింది. కరోనా తర్వాత పరిస్థితి మరి దారుణంగా తయారైంది. నిధులు లేక కరెంట్​బిల్లులను సైతం చెల్లించలేకపోతుంది. ఇప్పటికే రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు పడింది. అదే జంట జలాశయాల నీటిని సిటీకి వాడకం చేస్తే  10 శాతం కూడా ఖర్చు కాదు. కానీ , వందలాది కిలోమీటర్ల నుంచి నీటిని తరలిస్తుండడంతోనే  విద్యుత్ బిల్లులు భారం పెరిగింది. 

 వాడకం పెంచాలె 
 

కొన్నాళ్ల కిందటి వరకు జంట జలాశయాల నుంచి ఓల్డ్ సిటీతో పాటు మిగతా కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేసేవారు. ఎలాంటి కరెంటు మోటార్ల అవసరం లేకుండా కాలువలు, పైపులైన్ల ద్వారా పంపిణీ జరిగేది. విద్యుత్ వాడకం కూడా లేదు. ఇప్పుడు కూడా అదేవిధంగా నీటి వాడకం చేస్తే ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయొచ్చని ఎక్స్ పర్ట్స్ పేర్కొంటున్నారు. కృష్ణా, గోదావరి జలాలతో పాటు మంజీర, సింగూరు మాదిరిగానే జంట జలాశయాల నీటిని వాడాలని సూచిస్తున్నారు.  నీటి తరలింపు దూర ప్రాంతాల నుంచి తగ్గిస్తే విద్యుత్ బిల్లు భారం ఉండదని పేర్కొంటున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ తగ్గడంతో వచ్చే సమ్మర్ లో నీటికి ఫుల్ డిమాండ్ ఏర్పడనుంది. దీంతో జంటజలాశయాల నుంచి నీటి వాడకం కూడా పెరిగే చాన్స్ ఉంది.