
- 30 ఏండ్ల నాటి పైప్‌లైన్ కావడంతోనే రిపేర్లు లేట్
- వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: పటాన్‌చెరుకు సమీపంలో మొఘల్రెస్టారెంట్వద్ద ఓల్డ్ బాంబే హైవేపై 1,500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు రిపేర్లు పూర్తిచేసినట్లు వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత రిపేర్లు పూర్తయ్యాయన్నారు.
మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయా రిజర్వాయర్లకు నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఎండీ అశోక్ రెడ్డి హైదర్‌నగర్ రిజర్వాయర్ ను సందర్శించారు. షట్ డౌన్ కారణంగా సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించామని, 30 ఏండ్ల కిందటి భారీ పైపులైన్కావడంతో పనులు కాస్త ఆలస్యమయ్యాయన్నారు.
తర్వాత రిజర్వాయర్ ప్రాంగణంలోని క్వాలిటీ అస్యూరెన్స్ వింగ్(క్యూఏటీ) ల్యాబ్ ను విజిట్చేశారు. వాటర్క్వాలిటీ టెస్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెక్నాలజీని వాడుకోవాలని, అప్ గ్రేడ్ చేయడానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. స్టాఫ్ కాలేజ్ బిల్డింగ్, ట్రైనింగ్ సెంటర్, లైబ్రరీ, క్లాస్ రూములను పరిశీలించారు.
అవసరమైన భవనాలకు రిపర్లే చేయాలన్నారు. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ ను సందర్శించారు. లీకేజీ ఘటన వల్ల ఈ ప్రాంతంలో 265 ట్రిప్పులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు ఎండీకి తెలుపగా వాటిని 12 గంటల్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందితో రెండు షిఫ్టుల్లో పనిచేయాలని సూచించారు. డైరెక్టర్ ఆపరేషన్స్-2 వీఎల్.ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు అరవిందరెడ్డి, నారాయణ, జీఎంలు, ఓ అండ్ ఎం, ట్రాన్స్ మిషన్ అధికారులు
పాల్గొన్నారు.