మినరల్​వాటర్ పేరుతో​ మోసం

  • నేరుగా బోరుకే పట్టి నీళ్ల దందా
  • నిబంధనలు లేకుండా నిర్మాణాలు
  • తెలిసినా పట్టించుకోని అధికారులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా వాటర్​ప్లాంట్లు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లనే ప్లాంట్లు పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అందరికీ మంచినీరు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న భగీరథ నీటిని కాదని ప్రజలు బాటిల్​ వాటర్ తాగడానికే మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న వాటర్ ప్లాంటు యజమానులు మోసాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా నీళ్లు అమ్ముకుంటున్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా సుమారు 250 మినరల్ వాటర్ ప్లాంట్లు ఉండగా ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తున్నవి పదుల సంఖ్యలోనే ఉన్నాయి.

ఆఫీసర్ల పర్యవేక్షణ కరువు..

వాటర్​ప్లాంట్లను ఆఫీసర్లు పర్యవేక్షించకపోవడంతో  డైరెక్ట్​గా బోర్​మోటార్​కే ప్లాంట్లు కనెక్ట్​ చేసి సరాసరి అదే నీటిని అమ్ముతున్నారు. వాస్తవానికి వాటర్ ఫ్యూరిఫికేషన్ చేసి టీడీఎస్ 150 ఉండేలా చూసుకోవాలని నిబంధనలు ఉన్నాయి. 150 మించి టీడీఎస్ ​ఉంటే ఆరోగ్యానికి హానికరమని నిబంధనల్లో పేర్కొంది. అయితే ప్లాంట్​ఓనర్లు ఇవేవీ పట్టించుకోకుండా టీడీఎస్ పరిమితిని 1000 దాకా తీసుకెళ్తున్నారు. టీడీఎస్ ఎక్కువగా ఉన్న నీటిని తాగితే కిడ్నీలు, డైజేషన్​ సిస్టం దెబ్బతింటాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్లాంట్ల ఓనర్లు బోరు నీళ్లలో కెమికల్స్ కలిపి మినరల్​వాటర్​గా అమ్ముతున్నారు. కెమికల్స్​ఎక్కువ ఉన్న నీరు తాగినవారిలో కిడ్నీ వ్యాధులు, కీళ్ల నొప్పుల సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. 

రివర్స్ అస్మోసిస్ పద్ధతిలో శుద్ధి..

పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్ పట్టణాలతోపాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో వాటర్​ ప్లాట్లు వెలిశాయి. గతంలో పట్టణానికి దూరంలో వాటర్ ప్లాంట్​ఏర్పాటుకు అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా చాలాప్లాంట్లు ఇండ్లల్లోనే నడుపుతూ బోరు మోటార్ల ద్వారా వచ్చే నీటిని రివర్స్ అస్మోసిస్ పద్ధతిలో వాటర్​ను ఫ్యూరిఫై చేసి విక్రయిస్తున్నారు. 

రెడ్డు రెట్ల శుద్ధి అవసరం..

ఒక లీటర్ నీటిని 150 టీడీఎస్ వచ్చేలా శుద్ధి చేయాలి. నీటిని శుద్ధి చేయాలంటే అంతకంటే రెండు రెట్ల నీరు వేస్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్లాంట్లలో నీరు ఫ్యూరిఫై చేసినపుడు బయటకు వచ్చే టీడీఎస్ వేస్ట్.. వాటర్​తో కలిసి బయటకు పోతుంది. అలాంటి నీరు భూగర్భంలో, డ్రైనేజీలకు కలపడం ప్రమాదకరం. ఈ వేస్ట్ వాటర్​ను డ్రైడెడ్స్​లో కేక్​గా మార్చి పారపోయాలి.ఇందుకోసమే ప్లాంట్లు ఊరికి దూరంగా ఓపెన్ ప్లేస్​లలో ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరూ నిబంధనలు పాటించకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు.