నీటి కాలుష్యం ఆపకపోతే అందరం చస్తాం

నీటి కాలుష్యంతో ప్రమాదంలో మానవజాతి

మనిషి మనుగడకు ముఖ్యమైనది నీరు.. అన్ని జీవులకూ ప్రాణాధారం అదే.. నీరు లేకుంటే జీవమే లేదు.. అంతెందుకు మన శరీరంలో జీవక్రియ సక్రమంగా జరగాలంటే సరిపడినంత నీరు కావాల్సిందే..   మనం చేసే చిన్న చిన్న తప్పులు, నిర్లక్ష్యంతో నదులు, చెరువులు, సరస్సులు కలుషితమవుతున్నాయి..
నీటిని కాలుష్యం చేస్తూ మన భవిష్యత్తును మనమే ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నాం.

మానవ జాతి మనుగడకు, జీవకోటికి అత్యంత ముఖ్యమైనది నీరు.. మానవ తప్పిదాల కారణంగా ఆ నీరు ఇప్పుడు కాలుష్యానికి గురవుతోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాకు తాగునీరు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు సఫలం కావడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలకు నేటికీ శుద్ధమైన మంచినీరు దొరకడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో మంచినీరు అందడం లేదు. అలాగే, పట్టణాల్లో నివసించే వారికి ముఖ్యంగా స్లమ్‌‌ ఏరియాల్లో ఉంటున్న జనాలు తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి  ఒక్కరికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ప్రారంభించిన మిషన్‌‌ భగీరథ ఆరేండ్లుగా కొనసాగుతూనే ఉంది. అయినా, తాగు నీటికి కొరత ఏర్పడుతూనే ఉంది. ఆ కొరతను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వందశాతం శుద్ది చేసిన తాగునీరు అందట్లేదు. దీంతో వారు తాగునీటి కోసం వారికి దగ్గరలో ఉన్న బావులు, బోర్లలో లభించే నీటిని తాగుతుండడంతో అంటురోగాల బారిన పడుతున్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం పంపిణీ చేసే నీటితోపాటు బోర్ల నుంచి వచ్చే నీటిని వాడుకునే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు.

కాలుష్య కోరల్లో నదులు, నీటి వనరులు

భారతీయులంతా పవిత్రంగా భావించే గంగా నది ప్రక్షాళనను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇప్పటికే 20 వేల కోట్లు ఖర్చు చేసింది. అయినా 37 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు జల శక్తి అభియాన్‌‌ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే గంగా నది ప్రక్షాళన పూర్తి కావాలంటే మరికొన్నేళ్లు పడుతుంది. గంగా నదితో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు పవిత్రంగా పూజించే గోదావరి, కృష్ణా నదుల్లో సైతం కలుషిత వ్యర్ధాలు కలుస్తున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాల కారణంగానే ఈ జీవ నదులు కలుషితం అవుతున్నాయనేది వాస్తవం. దేశంలో రెండో అత్యంత పెద్దదైన గోదావరి, నాలుగో అత్యంత పొడవైన కృష్ణా నదీ జలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. వీటితో పాటు మంజీర, పెన్నా, తుంగభద్ర నదులు, వాటి ఉపనదులు కూడా రానున్న కాలంలో కాలుష్యంతో నిండిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నదులను ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో పోయిన ఏడాది ‘సేవ్ రివర్స్’ పేరుతో 13 నదుల జాబితాను కేంద్రం సిద్ధం చేసింది.

ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలె

పరిశ్రమల స్థాపన, వాటి అభివృద్ధిపై పాలకులు చూపెడుతున్న శ్రద్ధ.. కాలుష్య నియంత్రణపై కూడా చూపెడితే భవిష్యత్‌‌ తరాలకు మంచి చేసిన వారవుతారని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమలు విడుదల చేసే వ్యర్ధాలను నదులు, చెరువులు, నీటి వనరుల్లో కలవకుండా చర్యలు తీసుకుంటే సమస్య కొంతవరకు తీరుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసి..వాటిని అంతే కఠినంగా అమలు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో మంచినీటి కొరతను మరింతగా ఎదుర్కోక తప్పదు.

 

 

పరిశ్రమలు పెరుగుదలతో కాలుష్యం..

పెరిగిపోతున్న ఇండస్ట్రియలైజేషన్​ వల్ల పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్ధాల వల్ల కూడా నీటి కాలుష్యం పెరిగిపోతోంది. దీనిని నివారించడానికి ప్రభుత్వాలు నామమాత్రంగానే చర్యలు చేపడుతున్నాయి. దీంతో యధేచ్ఛగా తమ పరిశ్రమల్లో ఉపయోగించే నీరు, వాటి నుంచి వెలువడే వ్యర్థ, విష పదార్థాలను నదులు, చెరువులు, బావుల వంటి వాటిల్లోకి వదిలేస్తున్నారు. దీంతో వీటితో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. కలుషిత నీటితో జీవకోటి అనేక అనర్థాలను ఎదుర్కొంటోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా ఇండస్ట్రీలు కనీసం నాలుగు కోట్ల లీటర్ల వ్యర్ధ పదార్ధాలను నదులు ఇతర నీటి వనరులలో విడిచి పెడుతున్నారు. ఇది మనుషుల ఆరోగ్యంపైనే కాకుండా..ప్రాణికోటి మనుగడకే ప్రమాదకరంగా మారుతున్నాయి. పెరిగిపోతున్న కాలుష్యం ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా పంట దిగుబడులు కూడా 16 శాతం తగ్గుతాయని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి. -డాక్టర్​ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ