- 1,800 ప్రాంతాల్లో ఇబ్బందులు.. 300 ఏరియాల్లో మరీ తీవ్రం
- రోజు విడిచి రోజు వచ్చే నీళ్లు ఇప్పుడు వారానికి రెండుసార్లే వస్తున్నయ్
- కొన్ని చోట్లయితే వారానికి ఒక్క రోజే..!
- వాటర్ ట్యాంకర్ల కోసం పెరిగిన బుకింగ్స్.. రోజూ 1,500 ట్యాంకర్లకు ఆర్డర్
- నీటి కష్టాలపై వాటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్, వెలుగు: ఎండాకాలం మొదలవుడుతోనే హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు షురూ అయ్యాయి. హైటెక్ సిటీ నుంచి బస్తీల వరకు ఎక్కడ చూసినా నీటి సమస్యే. స్లమ్ ఏరియాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ వారం, పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. వాటర్ బోర్డు సప్లయ్ చేసే నీళ్లు సరిపోతలేవని అన్ని ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సిటీలోని సుమారు 1,800 ప్రాంతాలు నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందులో 300 ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.
అధికారుల కాకి లెక్కలు
ప్రస్తుతం సిటీలో ప్రతి రోజు 541 ఎంజీడీల(మిలియన్ గ్యాలాన్ ఫర్ డే) డిమాండ్ ఉందని, దానికి సరిపడా సరఫరా జరుగుతున్నదని వాటర్ బోర్డ్ అధికారులు చెప్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. బోర్డులోని కొందరు అధికారులు చెప్పిన దాని ప్రకారం డిమాండ్ మరో 60 శాతం ఎక్కువగా ఉందని అర్థమవుతున్నది. వాటర్ బోర్డ్ సరఫరా చేసే ట్యాంకర్ల కోసం వస్తున్న బుకింగ్స్ దీనికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం రోజూ 1,500 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. ఇందులో 350 పెండింగ్‌లోనే ఉంటున్నాయి. తాము ట్యాంకర్ బుక్ చేసి ఐదారు రోజులైనా రాలేదని జనం వాటర్ బోర్డుకు ట్విట్టర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. పీక్ సమ్మర్లో ఈ డిమాండ్ రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల కోసం కూడా వేలాది రిక్వెస్టులు ఉంటున్నాయి. ప్రస్తుతం సిటీలో రోజూ ఆరు వేల ట్యాంకర్లకు డిమాండ్ ఉందని ఒక సప్లయర్ తెలిపారు. ఏప్రిల్, మే నాటికి మరో నాలుగు వేల ట్యాంకర్లకు డిమాండ్ ఉంటుందని అన్నారు.
ఫిర్యాదుల వెల్లువ
వాటర్ బోర్డ్ పరిధిలో ఎక్కడ చూసినా నీటి ఇబ్బందులు ఉన్నాయి. మూసాపేట్‌లోని ఆంజనేయనగర్‌లో తమకు పది రోజులుగా నీళ్లు రావడం లేదని స్థానికులు వాటర్ బోర్డుకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలిలోని సిద్ధిక్‌నగర్‌లో తమకు ఏడాదిగా నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు. బోడుప్పల్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, నిజాంపేట, మన్సూరాబాద్, మౌలాలీ, బహదూర్ పురా, సీతాఫల్ మండి, బండ్లగూడ జాగీర్, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో నీటి సమస్యపై నిత్యం ఏదో ఒక చోట జనం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శనివారం నిజాంపేటలో, నాలుగు రోజుల కింద మన్సురాబాద్‌లో నీళ్ల కోసం జనం రోడ్లపైకి వచ్చారు. చాలా ప్రాంతాల్లో వారానికి రెండు సార్లు, కొన్ని చోట్లయితే ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో జనం పరేషాన్ అవుతున్నారు. నీళ్లు ఎప్పుడొస్తయోనని నల్లాల దగ్గర ఎదురుచూస్తున్నారు. నీటి సమస్యపై ఫిబ్రవరి 22న బీజేపీ కార్పొరేటర్లు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు.
నీటి సమస్యపై అసెంబ్లీలో సిటీ ఎమ్మెల్యేలు
ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో సిటీ నీటి సమస్యలపై ఎమ్మెల్యేలు సర్కారును ప్రశ్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మజ్లిస్ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వచ్చే ఒత్తిడితో నీటి సమస్యను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఈ నడుమ జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మలక్ పేట్ ఎమ్మెల్యే అబ్దుల్ బలాల ప్రశ్న లేవనెత్తారు. కృష్ణానది నుంచి నీటిని తెస్తున్నామని చెప్తున్నా మలక్ పేట్ నియోజకవర్గంలో నీటి కోసం జనం ఇబ్బంది పడుతున్నారని, వాటర్ బోర్డు సరిగ్గా సప్లయ్ చేయడంలేదని, రానున్న రోజుల్లో సమస్య లేకుండా చూడాలని అసెంబ్లీలో ప్రస్తావించారు.
కాంట్రాక్టర్లు పట్టించుకోక..!
నీటి సమస్య, కలుషిత నీటిపై జలమండలికి వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో ఉన్నతాధికారులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దాంతో వాళ్లు కింది స్థాయి అధికారులపై ఫైర్ అవుతున్నారు. సమస్య ఏర్పడిన వెంటనే కాంట్రాక్టర్లు పనులను వెంటనే చేపట్టకపోవడంతోనే తాము అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. నీళ్ల సమస్యపై జనాలు ఆఫీసులకు వచ్చి నిలదీస్తున్నారని, వాళ్లకేం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని అంటున్నారు. సిటీలో చాలా చోట్ల పైప్ లైన్ వ్యవస్థలో లోపాలున్నాయని, సర్కారు దృష్టికి తీసుకుపోయినా స్పందన లేదంటున్నారు. లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ దగ్గరలో 3నెలలుగా కలుషిత నీరు సరఫరా అవుతున్నదని, పనులను తొందరగా పూర్తిచేయమని ఉన్నతాధికారులు చెప్తున్నా, కింద ఆఫీసర్లు ఏం చేయలేకపోతున్నారు. కాంట్రాక్టర్లలో చాలా మందికి అధికార పార్టీతో సంబంధం ఉండడంతో ఒత్తిడి చేయలేకున్నామని ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు.
ఆందోళనలు చేయాల్సి వస్తుంది
ఎండాకాలంలో నీటి సమస్య లేకుండా చూడాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు. ఎక్కడ సమస్య లేదని మంత్రులు చెప్తున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటి సప్లయ్ కోసం ధర్నాలు చేయాల్సి వస్తున్నది. సమ్మర్ కు ముందే జలమండలి ముందు ఆందోళన తెలిపి అధికారులతో మాట్లాడినా కూడా సమస్య అట్లనే ఉంది. ఇప్పటికైనా సమస్యపై దృష్టి పెట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి. - కొప్పుల నర్సింహారెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్
డిమాండ్‌కి సరిపడా సప్లయ్
సిటీలో డిమాండ్‌కు సరిపడా నీటిని సరఫరా చేస్తున్నం. ప్రస్తుతం 541 ఎంజీడీల డిమాండ్ ఉంది. ఎండలు పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. కొన్నిచోట్ల సప్లయ్ జరగడంలేదంటే.. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. మెయింటెనెన్స్ వారు వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తారు. ప్రస్తుతం అయితే నీటి సమస్య లేదు.
- రవికుమార్, వాటర్ బోర్డు టెక్నికల్ డైరెక్టర్
ఏడాది నుంచి ఇబ్బంది
మా ఏరియాలో ఏడాది నుంచి నీళ్లు రావడంలేదు. కానీ బిల్లులు మాత్రం కట్టించుకుంటున్నారు. ఫ్రీ వాటర్ పేరుకే అన్నట్లు ఉంది. మా దగ్గర అయితే సమస్య తీవ్రంగా ఉంది. వాటర్ బోర్డుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. తాగేందుకు రూ. 30 పెట్టి వాటర్ బాటిల్ కొంటున్నం. బోర్లు ఎండిపోతుండటంతో ఇబ్బంది ఎక్కువవుతోంది. - సుష్మ, సిద్దిక్ నగర్, గచ్చి బౌలి
వారం నుంచి ప్రాబ్లమ్...
మాకు వారానికోసారి నీళ్లు వస్తున్నయ్. డ్రింకింగ్ వాటర్ కొనుక్కొని తాగుతున్నం. వాడేనీటి కోసం డ్రమ్ములు పెట్టుకుంటున్నం. వందకు పైగా ఇండ్లు ఉండే మా కాలనీని ఎందుకు పట్టించుకోడంలేదు. డే బై డే నీటిని సరఫరా చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినా ఎందుకు రావట్లేదో అర్థమైతలేదు. - సాయి కిషోర్, విజయపురి కాలనీ, బోడుప్పల్
కృష్ణా, గోదావరి నీటితో సిటీలో సమస్య లేకుండా పోయింది. అవసరాన్ని బట్టి కావల్సినంత నీటిని పుష్కలంగా తరలిస్తున్నం. భవిష్యత్‌లో కూడా నీటి సమస్య వచ్చే అవకాశంలేదు. - అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్
నా చిన్నప్పుడు ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కేవారు. ఖైరతాబాద్ వాటర్బోర్డ్ ఆఫీసు ముందు వరుస ధర్నాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యి స్కూల్‌కు లేటయ్యేది. ఇప్పుడు ఆ సమస్య ఎక్కడా లేదు.- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్
కానీ.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉన్నది. హైదరాబాద్‌లోని చాలా గల్లీల్లో నీటి కోసం జనం గోసవడ్తున్నరు. వారానికి రెండు సార్లు, కొన్ని చోట్లయితే ఒక్కసారే నీళ్లు వస్తుండటంతో తిప్పలుపడ్తున్నరు. నీళ్లు ఎప్పుడొస్తయా అని నల్లాల దగ్గర పడిగాపులు కాస్తున్నరు. ట్యాంకర్ల కోసం బిందెలు పట్టుకొని ఎదురుచూస్తున్నరు.