మహారాష్ట్రలో నీళ్లకు కరువొచ్చింది!

మహారాష్ట్రలో నీళ్ల కరువు ఈనాటిది కాదు. జీవ నదులు కృష్ణా, గోదావరులకు జన్మస్థలం ఇది. అయినా అక్కడి లాతూర్​ ప్రాంతానికి  రైలు ద్వారా మంచినీళ్లను పంపిన సంఘటనలున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి 2016లో దేవేంద్ర ఫడ్నవీస్​ ప్రభుత్వం ‘జల్​యుక్త్​ శివర్’ స్కీమ్‌‌‌‌ని ప్రారంభించింది. మహారాష్ట్రను నీళ్ల కరువు లేని రాష్ట్రంగా మార్చటం ఆ అభియాన్​ లక్ష్యం. మూడేళ్లలో  పథకం ఎంతవరకు అమలైంది? మహారాష్ట్రకు నీటి ఎద్దడి తీరిందా? 

జల్​ యుక్త్​ శివర్​’ స్కీమ్​ను పక్కాగా అమలుచేయటానికి స్థానికులతో కలిసి ఆఫీసర్లు, ఫీల్డ్​ లెవల్​ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దీన్నొక ఉద్యమంలా నడిపారు.  చెరువులు, కుంటలు, బావులు నీళ్లతో కళకళలాడేలా చేయటానికి ప్రయత్నించారు. భూమిలోకి సాధ్యమైనంత ఎక్కువ నీరు ఇంకటానికి ఏర్పాట్లు చేశారు. సిమెంట్​ దిమ్మెలు, చెక్​డ్యామ్​లు, రివర్​ బెడ్లు నిర్మించారు. చేలల్లో, పొలాల్లో మడుగులు, కొలనులు తవ్వారు. మహారాష్ట్రను ‘నీటికి ఇబ్బంది లేని రాష్ట్రం’గా మార్చటంకోసం ప్రభుత్వం దండిగా నిధులు విడుదల చేసింది.

గడచిన మూడేళ్లలో రూ.5,200 కోట్లను ఈ స్కీమ్‌‌‌‌కోసం కేటాయించింది. ఇతర మార్గాల్లో​ మరో రూ.1,800 కోట్లు సేకరించి మొత్తం 8,000 కోట్ల రూపాయల్ని  ఖర్చు చేసింది. ఇంత చేసినా రాష్ట్రంలో మళ్లీ అవే సీన్లు కనిపిస్తున్నాయి. తాగటానికి, వాడుకోవటానికి నీళ్లు లేక జనం అల్లాడుతున్నారు. వాటర్​ ట్యాంకర్లు వస్తే తప్ప రోజు గడవని పరిస్థితి. కనీస అవసరాలు తీరని దుస్థితి. ట్యాంకర్ల ద్వారానైనా నీళ్లు సక్రమంగా, చౌకగా అందుతున్నాయా అంటే అదీ లేదు. అడుగడుగునా నీళ్ల వ్యాపారమే సాగుతోంది. ట్యాంకర్ల విడుదలలో దళారుల, మధ్యవర్తుల ఇష్టారాజ్యం సాగుతోంది.

నీళ్ల దొంగతనంపై కేసు నమోదు
జనాలకు నీళ్ల సమస్య రాకుండా ఫడ్నవీస్​ గవర్నమెంట్​ చేస్తున్న ఖర్చుతో సగం రాష్ట్రానికైనా గొంతు తడవడం లేదు. రాష్ట్రంలోని 40 శాతం ప్రాంతాల్లో ప్రజలు నీళ్లకోసం నిత్యం పోరాడాల్సి వస్తోంది. ఏ ఊళ్లో చూసినా జనాలు నీళ్ల కోసం కొట్లాడుతున్నారు. పోలీసు స్టేషన్ల గడప తొక్కుతున్నారు. మన్మాడ్​ జిల్లాలోని ఓ ఏరియాలో రెసిడెన్షియల్​ ఓవర్​ హెడ్​  ట్యాంక్​ నుంచి నీళ్లను దొంగతనం చేసినందుకు పోలీస్​ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్​ నమోదైంది. మే నెల మొదట్లో జరిగిన ఈ ఘటనను లోకల్​ మీడియా బాగా హైలైట్‌‌‌‌ చేసింది. దీన్నిబట్టి మహారాష్ట్రలో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేంద్రం లెక్కలు ఇలా ఉన్నాయి…
సెంట్రల్​ వాటర్​  కమిషన్​ (సీడబ్ల్యూసీ) డేటా ప్రకారం.. గుజరాత్​, మహారాష్ట్ర తదితర పశ్చిమ ప్రాంత రాష్ట్రాల్లో ఈ సంవత్సరం వివిధ రిజర్వాయర్లలో వాటర్​ స్టోరేజీ బాగా పడిపోయింది. గతేడాది ఇంత దారుణమైన స్థితి లేదు. పదేళ్ల యావరేజ్​తో పోల్చినా కూడా తక్కువగానే ఉన్నట్లు కమిషన్​ రిపోర్ట్​ సూచిస్తోంది. మహారాష్ట్రలోని 19 రిజర్వాయర్లను సీడబ్ల్యూసీ పరిశీలించి వాటర్​ లెవెల్స్​కి సంబంధించిన లెక్కలను నమోదు చేస్తుంది. అందులోని ఐదు వాటర్​ బాడీలు మే నెల 23వ తేదీ నాటికి పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి.

వర్షపాతం..
మహారాష్ట్రలో జల్​ యుక్త్​ శివర్​ పథకం ఫెయిలైందని వాటర్​ కన్జర్వేషనిస్టులు తప్పుపడుతుండగా, కొందరు అలాంటిదేమీ లేదని సమర్థిస్తున్నారు. ప్రోగ్రామ్​ని మొదట్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్​తోనే ప్రారంభించారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ల జోక్యం మొదలై.. పథకం పక్కదారి పట్టిందని ‘వాటర్​ మ్యాన్​’ రాజేంద్ర సింగ్​ విమర్శించారు. అయితే.. పెద్ద పనులు మాత్రమే కాంట్రాక్టర్లకు ఇచ్చామని, చిన్న పనులను స్థానికుల సాయంతోనే పూర్తి చేశామని ‘వాటర్​  కన్జర్వేషన్​ అండ్​ ఎంప్లాయ్​మెంట్​ గ్యారంటీ స్కీం (ఈజీఎస్​)’ సెక్రెటరీ ఏక్​నాథ్​ దావ్‌‌‌‌లే వివరించారు.

పథకంలో లోపాలు లేవని, సెప్టెంబర్​లో 26 శాతం తక్కువగా వానలు పడటం వల్లే నీటికి కరువు ఏర్పడిందని చెప్పారు. వర్షపాతం ఇంత తక్కువ నమోదు కావటం చరిత్రలో ఇదే తొలిసారని తెలిపారు. గ్రామాల్లో మంచి నీళ్ల సమస్య లేకుండా చేయటానికి 216 ప్రభుత్వ, 5643 ప్రైవేట్​ ట్యాంకర్లతో వాటర్​ సప్లయ్‌‌‌‌ చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్​కి రోజుకు రూ.4 వేలకు పైగా ఖర్చవుతోందని లెక్కలేస్తున్నారు. అసలు సమస్య వాటర్​ ట్యాంకర్ల లాబీతోనే తలెత్తుతోందని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడూ ఎలక్షన్​ ఇష్యూనే..
మహారాష్ట్రలోని లాతూర్ లాంటి జిల్లాల్లో నీటి సమస్య ఎప్పుడూ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశమే. రెండేళ్లుగా ప్రతి లీడరూ దీని గురించే మాట్లాడారు. వాటర్​​ ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని, రైళ్ల ద్వారా నీళ్లు తెప్పిస్తామని, స్థానికుల కష్టాలు తీరుస్తామని హామీలు గుప్పించారు. మూడేళ్ల క్రితం ఓసారి వాటర్​ ట్రైన్​ వచ్చింది. కానీ అవి సిటీకే అందాయి. జిల్లా మొత్తానికి చేరలేదు.

ఈ సమస్య పరిష్కారానికి జనమంతా ఒకటై ముందుకురావాలని, ప్రజలు ప్రయత్నిస్తే జరగనిదంటూ ఏమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాంగ్లి లాంటి కొన్ని ప్రాంతాల్లో వాటర్​ రిస్టోరేషన్​ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రజలు ముందుకొచ్చారు. దాంతో ఆయా ప్రాంతాల్లో ‘జల్​ యుక్తి శివర్’​ విజయవంతం కావడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అలాగే, భూగర్భ జలాల అభివృద్ధికోసం ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ కమ్యూనిటీలే చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఆ పనిని చేపడితే జనంలో నిర్లక్ష్యం వస్తుందని, కేవలం తవ్వేసి ఊరుకోవడం కాకుండా జాగ్రత్తగా వాడుకునే బాధ్యతను కూడా ప్రజలే తీసుకోవాలని చెబుతున్నారు.

– ‘ది వైర్​’ సౌజన్యంతో…

నీటి ఖర్చులు రూ.3 వేలు
నలుగురు సభ్యులుగల ఒక కుటుంబం కేవలం నీళ్ల అవసరాలు తీర్చుకోవటం కోసమే రూ.3 వేలకు పైగా భరించాల్సి వస్తోందని లాతూర్​ వాసులు లబోదిబో అంటున్నారు. ముంబై లాంటి మహా నగరంలో ఒక ఇంటికి నెల నెలా వచ్చే యావరేజ్​ ఎలక్ట్రిసిటీ​ బిల్లుతో ఇది సమానమని పోల్చి చూస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్​​ ట్యాంకర్ల ద్వారా కూడా ఫ్రీగానే వాటర్​ సప్లై చేయాల్సి ఉన్నా కొన్ని ప్రాంతాల్లో దళారుల, మధ్యవర్తుల అనవసర జోక్యంతో జనాలు సొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది.

 

151 తాలూకాలు కరువు ప్రాంతాలు
మహారాష్ట్రలోని మొత్తం 358 తాలూకాల్లో 151 తాలూకాల్ని కరువు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది. ఈ తాలూకాల్లోని 28,524 గ్రామాలు నీటి ఎద్దడితో అలమటిస్తున్నాయని తెలిపింది. 112 పల్లెలు నరకం చూస్తున్నట్లుగా వెల్లడించింది. ‘జల్​ యుక్త్ శివర్‌‌‌‌’ స్కీమ్​ని బ్రహ్మాండంగా ప్రారంభించినా ఆ ఉత్సాహాన్ని కొనసాగించలేకపోయారని యాక్టివిస్టులు విమర్శిస్తున్నారు. ప్రకృతి సహకరించకపోవటం వల్లే నీటి ఎద్దడి తీరడం లేదని సర్కారు ఆఫీసర్లు చెబుతున్నారు.

మినరల్ వాటర్ కంపెనీల దోపిడీ
మహారాష్ట్రలో నీటి కరువు తలెత్తిన ప్రాంతాల్లో మినరల్​ వాటర్​ సంస్థలు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. బోర్​ వెల్స్​ని ఏర్పాటు చేసి, భూగర్భ జలాన్ని తోడేసి, ప్లాస్టిక్​ బాటిల్స్​లో నింపుతున్నారు. వాటిని ఔరంగాబాద్​లాంటి ఏరియాల్లో డబుల్​ రేటుకి అమ్ముతున్నారు. ఆ దందాని అడ్డుకునేవాళ్లు కనపడట్లేదు. వాటర్​ క్వాలిటీని చెక్​ చేసే నాథుడు లేడు.