అడుగంటుతున్న సాగర్.. రోజుకు అడుగు చొప్పున తగ్గుతున్న నీటి మట్టం.. ఇప్పుడే ఇలా అయితే ఏప్రిల్‌‌లో ఎలా ?

అడుగంటుతున్న సాగర్.. రోజుకు అడుగు చొప్పున తగ్గుతున్న నీటి మట్టం.. ఇప్పుడే ఇలా అయితే ఏప్రిల్‌‌లో ఎలా ?
  • రోజుకు అడుగు చొప్పున తగ్గుతున్న నీటి మట్టం
  • మార్చి మొదటి వారంలోనే 525 అడుగులకు..
  • ఇప్పుడే ఇలా అయితే ఏప్రిల్‌‌లో ఎలా ?
  • ఆందోళనలో ఆయకట్టు రైతులు
  • సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదంటున్న ఆఫీసర్లు

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్‌‌లో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది.  ప్రాజెక్ట్​పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 525 అడుగులకు చేరింది. మార్చి నెల మొదటి వారంలోనే ఈ స్థాయిలో నీటిమట్టం తగ్గడంపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సాగర్​కింద 6.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా వారబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తున్నారు. ఈ మార్చి నెలతో పాటు ఏప్రిల్​నెలంతా నీరు అందితే తప్ప పంటలు చేతికివచ్చే పరిస్థితి లేదు. సెప్టెంబర్ 15 నుంచి  రెండు రాష్ట్రాలకు నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుండడంతో పాటు పెరుగుతున్న ఎండల వల్లే నీటిమట్టం గణనీయంగా తగ్గుతున్నట్లు తెలిసింది. కాగా, ప్రస్తుతం సాగర్‌‌లో ఉన్న నీటితో తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రాజెక్టు ఆఫీసర్లు చెప్తున్నారు.

రోజుకో అడుగు తగ్గుదల
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో 6.30 లక్షల ఎకరాల్లో సాగైన ఆరు తడి పంటల కోసం ప్రభుత్వం ఆన్‌‌అండ్‌‌ఆఫ్‌‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు సాగర్‌‌ నుంచి ఇబ్బడిముబ్బడిగా నీటిని తోడేస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్‌‌లో రోజుకో అడుగు (2 టీఎంసీలు) చొప్పున నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం సాగర్‌‌లో 525 అడుగుల నీరు ఉండగా.. వాడకం ఇలాగే కొనసాగితే మరో 15 రోజుల్లోనే సాగర్‌‌ నీటిమట్టం డెడ్‌‌ స్టోరేజీ అయిన 510 అడుగులకు చేరనుంది. సాగర్‌‌ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టుకు యాసంగి సీజన్‌‌లో ఏప్రిల్‌‌ వరకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేయాల్సి ఉంది. 

వేసవి పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందు పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు జంట నగరాల తాగునీటి అవసరాల కోసం సాగర్‌‌ నుంచి నిత్యం 290 ఎంజీడీ నీటిని తరలిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున సాగర్‌‌ రిజర్వాయర్‌‌లో నీటి ఆవిరి కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది. ప్రస్తుతం ఎగువ నుంటి ఎలాంటి ఇన్‌‌ఫ్లో లేకపోవడంతో వర్షాలు పడే వరకు ఇటు సాగర్‌‌ ఆయకట్టుతోపాటు అటు హైదరాబాద్‌‌ తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. 

ప్రస్తుతం ఇన్‌‌ఫ్లో నిల్‌‌
గతేడాది భారీ వర్షాలు పడడంతో ఆగస్టు 5 నుంచి జనవరి నెల మొదటివారం వరకు నాగార్జునసాగర్‌‌కు ఇన్‌‌ఫ్లో కొనసాగగా.. రిజర్వాయర్‌‌ పూర్తిస్థాయిలో నిండింది. వరదల కారణంగా ఎగువ నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు క్రస్ట్‌‌గేట్లు, విద్యుత్‌‌ ఉత్పాదన ద్వారా కిందికి విడుదల చేశారు. ఎగువ నుంచి సాగర్‌‌ ప్రాజెక్ట్‌‌కు 1202.96 టీఎంసీల నీరు వచ్చింది. ఇందులో కుడి కాల్వకు 162.57 టీఎంసీలు, ఎడమ కాల్వకు 113.70, విద్యుత్ ఉత్పాదనకు 244.50 టీఎంసీలు విడుదల చేశారు. 

ప్రస్తుతం రిజర్వాయర్‌‌ నుంచి కుడి కాల్వకు 8,023 క్యూసెక్కులు,ఎడమ కాల్వకు 8,454, ఎస్ఎల్‌‌బీసీకి 1,350, ఎల్‌‌ఎల్‌‌సీ వరద కాల్వకు 280 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి ప్రతిరోజూ 28,567 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండగా, ఎగువ నుంచి మాత్రం ఎలాంటి ఇన్‌‌ఫ్లో రావడం లేదు.

నీటి నిల్వలపై ఆందోళన వద్దు
నాగార్జునసాగర్‌‌ నీటి నిల్వలపై రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. రబీ సీజన్‌‌లో పంట సాగుకు ప్రకటించిన షెడ్యూల్‌‌ ప్రకారం ఏప్రిల్ ​23 వరకు నీటి విడుదల యథావిధిగా కొనసాగుతుంది. జూన్‌‌ వరకు హైదరాబాద్‌‌ తాగునీటి అవసరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు.

కృష్ణయ్య, జేఈఈ