సర్కారు ఆస్పత్రికి నీళ్ల గోస .. జనగామ ఎంసీహెచ్ లో వాటర్​ ప్రాబ్లెమ్​

సర్కారు ఆస్పత్రికి  నీళ్ల గోస .. జనగామ ఎంసీహెచ్ లో  వాటర్​ ప్రాబ్లెమ్​
  • ఇక్కట్లు పడుతున్న పేషెంట్లు
  • మెడికల్ కాలేజీకి తప్పని తిప్పలు
  • పట్టింపు లేని ఆఫీసర్లు

జనగామ, వెలుగు:  సర్కారు ఆస్పత్రులకు నీళ్ల గోస తప్పడం లేదు. జనగామ జిల్లా కేంద్రం శివారు చంపక్​హిల్స్​లోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వాటర్​ ప్రాబ్లెమ్​ మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడకు జనగామతో పాటు సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు చెందిన పేషెంట్లు కూడా వస్తుండగా, నిత్యం కిటికిటలాడుతుంటుంది. ఈ క్రమంలో నీళ్ల కొరత వేధిస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నీటి సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. 

నిత్యం రద్దీగా ఆస్పత్రి..

ఎంసీహెచ్ ఆస్పత్రికి నిత్యం వందలాది మంది పేషెంట్లు, అటెండెంట్లు వస్తుంటారు. వీరికితోడు స్టాఫ్ ఉంటారు. ఇక్కడ అవుట్ పేషెంట్ల సంఖ్య ప్రతీ రోజు సుమారు 350 మంది, ఇన్ పేషెంట్లు 100 మందికి పైగా ఉంటారు. గైనిక్​, పీడియాట్రిషన్ సేవలకు పేరొందిన ఈ ఆస్పత్రికి జనగామతో పాటు సిద్దిపేట జిల్లాకు చెందిన మద్దూరు, దూళ్మిట్ట, చేర్యాల మండలంలోని కొన్ని గ్రామాలు, యాదాద్రి జిల్లాలోని ఆలేరు, గుండాల మండలాల పేషంట్లు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు 10 నుంచి 15 వరకు డెలివరీలు అవుతుంటాయి. గతంలో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న ఈ ఆస్పత్రి జనగామలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏర్పాటైన తర్వాత డీఎంఈ పరిధిలోకి వెళ్లింది. దీంతో మరింత నిష్ణాతులైన వైద్యులు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది. 

నీటి గోస తప్పుతలే..

అవుట్, ఇన్ పేషెంట్లతో పాటు డెలివరీ అయినవారి కోసం వచ్చే బంధువుల సంఖ్య కూడా ఎక్కువ. అటెండెంట్లను ఎంతలా కంట్రోల్​ చేయాలన్నా రూరల్ ఏరియా కావడంతో తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇంత మంది వచ్చే ఈ ఆస్పత్రిలో నీటి సప్లై సరిగా లేదు. ఎత్తైన గుట్ట ప్రాంతంలో ఆస్పత్రి ఉండడంతో మొదటి నుంచే నీటి ప్రాబ్లెమ్​ ఏర్పడింది. బోర్లు వేస్తే నీళ్లు పడడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. ప్రస్తుతం ఒకే ఒక్క బోరు పనిచేస్తోంది. ఇది కూడా సన్నగా పోయడంతో సరిపోవడం లేదు. మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నా, నామ మాత్రమే.

ఇదే బిల్డింగ్ పైఅంతస్తులో మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేషన్ కు ఉపయోగిస్తున్నారు. దీని పక్కనే మెడికల్ కాలేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఇక్కడి నుంచే నీళ్ల సప్లై కావాలి. దీంతో ఆస్పత్రి కోసం ఒకటి, కాలేజీ కోసం ఒకటి అన్నట్లు సమీపంలోని పసరమడ్ల చెరువులో రెండు బోర్లను వేసి నీటిని ఇక్కడికి పంపింగ్ చేయిస్తున్నారు. భూగర్భజలాలు పడిపోతుండడంతో అవి కూడా తక్కువగానే పోస్తున్నాయి. దీంతో నీళ్లు చాలడం లేదు. ఇదీ కాకుండా పసరమడ్లకు చెందిన రైతులు మోటర్లు ఆన్​ చేసిన కొద్ది సేపటికే ఏదో కారణంతో బంద్​ చేస్తున్నారని ఆస్పత్రి స్టాఫ్​ చెబుతున్నారు.

నీటి ఇక్కట్లు తీర్చేందుకు అప్పుడప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. కాగా, ఎంసీహెచ్ కు వచ్చే వారిలో సగం మందికి పైగా తమ అవసరాలను బయట తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ మిగిలిన వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. గర్భిణులు, బాలింతలు, అటెండెంట్లు, స్టాఫ్ బాత్ రూం, మరుగుదొడ్లను వాడుకునేందుకు జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు.

నీటి కొరత నిజమే.. 

ఎంసీహెచ్ ఆస్పత్రిలో నీటి కొరత వాస్తవమే. సమస్య పరిష్కారానికి పసరమడ్ల చెరువులో రెండు బోర్లు వేసి తెప్పిస్తున్నా చాలడం లేదు. ఆస్పత్రి ఆవరణలోని బోరు చాలా తక్కువగా పోస్తున్నది. సమస్య తీవ్రమైనప్పుడల్లా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పిస్తున్నం. సమస్యను మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

మధుసూదన్ రెడ్డి, సూపరింటెండెంట్, ఎంసీహెచ్, జనగామ