
బెంగళూరు : బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లకు నీటి కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో వినియోగిస్తున్న నీటి వివరాలను అందించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), సంబంధిత ఇతర రాష్ట్ర అధికారులను కోరింది. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఈ స్టేడియంలో శుద్ధి చేసిన నీటి సరఫరా జరుగుతోందన్న వార్తలను సుమోటాగా స్వీకరించిన ఎన్‌జీటీ... కేఎస్‌సీఏకి నోటీసులు జారీ చేసింది. మ్యాచ్‌ల కోసం ఎంత మేరకు నీటిని వినియోగిస్తున్నారు.. వాటిని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో మే 2వ తేదీ లోపు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ‘మేము నోటీసులను అధ్యయనం చేస్తున్నాం. స్టేడియం ఎన్‌జీటీ నిబంధనలకు అనుగుణంగా ఉంది. కాబట్టి మ్యాచ్‌లు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నాం’ అని కేఎస్‌సీఏ సీఈవో శుభేందు ఘోష్ చెప్పారు. స్టేడియంలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరగ్గా, మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.