హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గ్రౌండ్ వాటర్లెవల్స్ క్రమంగా పడిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మరింత అడుగంటనున్నాయి. ఈసారి నీటి కటకట తప్పేలా లేదు. గత మూడేండ్లతో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే హైదరాబాద్ జిల్లాలో 0.14 మీటర్లు, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 2.48 మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 3.68 మీటర్లు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో 8.22 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అలాగే రంగారెడ్డి లో సగటున 11.87 మీటర్ల లోతులో, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 11.45 మీటర్ల లోతులో నీరుంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 14 మీటర్లకు అడుగంటాయి.
గతేడాది ఫిబ్రవరితో పోల్చి చూస్తే ఈసారి అత్యధికంగా శేరిలింగంపల్లిలో 14.79 మీటర్లు, హయత్ నగర్ లో 11.48, కూకట్ పల్లిలో 8.09 మీటర్ల లోతుకు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. బాచుపల్లి, మేడిపల్లి, కొత్తూరు, తాలకొండపల్లి, ఆసీఫ్ నగర్, చార్మినార్, మంచాల, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, బండ్లగూడ జాగీర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముంది. వర్షపాతం తగ్గడంతోనే గ్రౌండ్ వాటర్ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఏప్రిల్, మే నెలల్లో నీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆ రెండు జిల్లాల్లో పూర్తిగా డౌన్
రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చి చూస్తే అన్నిచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. మేడ్చల్–మల్కాజిగిరిలో 15 మండలాలకు గాను 13 చోట్ల తగ్గాయి. ఉప్పల్, కాప్రా మినహా అంతట ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బాచుపల్లి వంటి ప్రాంతాల్లో మొన్నటి వరకు భూగర్భజలాలు మంచిగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం పడిపోయాయి. హైదరాబాద్ జిల్లాలోని 10 ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ ని పరిశీలిస్తుండగా రెండు, మూడుచోట్ల తగ్గాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త పెరిగాయి. వచ్చే నెలలో ఈ ప్రాంతాల్లో కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్
బోర్లు ఎండిపోతుండడంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడుతోంది. వాటర్‌బోర్డు ట్యాంకర్లకు బుకింగ్స్పెరుగుతున్నాయి. చాలా చోట్ల వాటర్‌బోర్డు అందించే ట్యాంకర్లు ఆలస్యమవుతుండటంతో జనం ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ట్యాంకర్ల ఆపరేటర్లు దోపిడీకి దిగుతున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.1500 వరకు వసూల్ చేస్తున్నారు. మొన్నటి వరకు సిటీలో 570 ఎంజీడీల డిమాండ్ ఉండగా, ప్రస్తుతం మరో 30 ఎంజీడీల నీటి డిమాండ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అవసరం మేరకు సప్లయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. గ్రౌండ్ వాటర్ పడిపోతున్న ప్రాంతాల రిపోర్టు ఆధారంగా సరఫరా పెంచేందుకు ప్లాన్చేస్తున్నారు.