మేడారం(ఏటూరునాగారం), వెలుగు: మేడారం జాతరలో భక్తులకు మూడో రోజు నీటి కష్టాలు మొదలయ్యాయి. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తుల విడిది ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి నల్లాలను శుక్రవారం పూర్తిగా నిలిపి వేశారు. దీంతో భక్తులు విడిది చేసిన ప్రాంతంలో స్నానానికి, తాగునీటికి, ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైగా పోలీసులు ప్రైవేట్వాటర్వెహికల్స్ను అనుమతించకపోవడంతో చాలా దూరం వెళ్లి తాగునీటిని క్యాన్లలో అధిక ధరలకు కొనుక్కుని పొదుపుగా వాడుకోవడం కనిపించింది.
అదేవిధంగా తాత్కాలిక మరుగుదొడ్ల వద్ద నీళ్లు లేక పోవడంతో భక్తులు పంట పొలాల్లోకి బహిర్బూమికి వెళ్లాల్సిన పరిస్థతి నెలకొంది. అమ్మవార్ల దర్శానికి వెళ్లే భక్తుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన మంచినీటి డ్రమ్ముల్లో చెత్త, చెదారం పడి తాగడానికి వీలు లేకుండా పోయాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో టైంకు తాగునీరు దొరకక చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.