
రామడుగు, వెలుగు : చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల్లోని వరదకాలువ పరివాహక గ్రామాల రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంపుహౌజ్ ద్వారా ఆదివారం సాయంత్రం ఆరో యూనిట్ అధికారులు నీటిని విడుదల చేశారు. గాయత్రి పంపుహౌజ్ లో ఏడు బాహుబలి మోటార్లు ఉండగా, ఒక్కో మోటార్ 3,150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. కాగా రైతుల పంటలను కాపాడేందుకు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించిన ఆరో మోటార్ ద్వారా రాత్రి 10 గంటల వరకు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
పంటలు ఎండకుండా కాపాడుతాం
గంగాధర, వెలుగు: మెట్టప్రాంతమైన చొప్పదండి నియోజకవర్గంలో పంటలు ఎండిపోకుండా కాపాడుతామని, ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురికావొద్దని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్‌లోని తన క్యాంపు ఆఫీస్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గాయత్రి పంపుహౌస్ నుంచి వరదకాలువకు నీటిని విడుదల చేయడానికి గత ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్ తొలగించారని, సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతో మోటార్లను ఆన్చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో పంటలకు నష్టపరిహారం చెల్లించాలని అడిగితే రైతులను హేళన చేసిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ధర్నా చేసే హక్కు లేదని విమర్శించారు.