దేవరకద్ర, వెలుగు: మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి సోమవారం దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు జి. మధుసూధన్ రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి 60 ఏండ్లు గడుస్తున్నా చెక్కుచెదరలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లు వచ్చి కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిందన్నారు.
త్వరలో సీఎం, మంత్రి జూపల్లితో చర్చించి కోయిల్ సాగర్ ప్రాజెక్టును టూరిజంగా మారుస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి బోట్ లో ప్రయాణించారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.