
- 2017లో గుర్తించిన మేరకు భగీరథ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్
- ఏటికేడు పెరుగుతున్న కొత్త కాలనీలు
- పాత లైన్లతో ఇబ్బందులు
- రూ.305 కోట్లతో ప్రపోజల్స్ పంపిన అధికారులు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ట్యాంకులు చాలడం లేదు. ఏటికేడు కొత్త కాలనీలు పెరుగుతుండటం.. మిషన్ భగీరథ పథకంలో భాగంగా అమృత్ స్కీం కింద వేసిన పైపులైన్లు సరిపోకపోవడంతో చాలాచోట్ల తాగునీటి సప్లైలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన పైపులైన్లు చాలావరకు శిథిలావస్థకు చేరడంతో తరచూ లీకేజీల సమస్య తలెత్తుతోంది. దీంతోనే గ్రేటర్లో భవిష్యత్అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆఫీసర్లు మళ్లీ కొత్తగా ప్రపోజల్స్ పంపించారు. గ్రేటర్ సిటీతోపాటు విలీన గ్రామాలకు సరిపడా ట్యాంకుల నిర్మాణం, ఫీడర్ మెయిన్, డిస్ట్రిబ్యూటరీ లైన్లను వేసేందుకు దాదాపు రూ.305 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
ఏటా పెరుగుతున్న కాలనీలు
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రతి ఇంటికీ ప్రతి రోజూ శుద్ధి చేసిన నీటిని అందించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌భగీరథ తీసుకురాగా.. 2017-–18లో ఆఫీసర్లు ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ప్రపోజల్స్ పంపించారు. నగరంలో 2.25 లక్షల ఇండ్లు ఉండగా.. నల్లాలు లేని 1.10 లక్షల ఇండ్లకు అమృత్ స్కీం కింద కనెక్షన్లు, వాటర్ మీటర్లు ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. నగరంలోని దాదాపు 11 లక్షల జనాభాకు డైలీ సప్లై చేయాలంటే 172.3 ఎంఎల్డీ నీరు అవసరం. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొత్తం రూ.630 కోట్లతో వర్క్స్ స్టార్ట్ చేశారు. కానీ గ్రేటర్లో కొత్త కాలనీలు పెరుగుతున్నాయి. ఇప్పటికే నగరంలో దాదాపు 1,450 కాలనీలు ఉండగా.. ఏటా సగటున 15 కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. సుమారు 4 వేల నుంచి 6 వేల ఇండ్లు కొత్తగా నిర్మాణమవుతున్నాయి. దీంతో ఆఫీసర్లు ముందుగా ప్రపోజ్ చేసిన దానికంటే ఎక్కువ పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మొదట నిర్ధేశించుకున్న ప్రకారం నగరంలో 159.7 కిలోమీటర్ల ఫీడర్ మెయిన్స్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ పనులు వంద శాతం కంప్లీట్ అయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ లైన్స్ 1,751 కిలోమీటర్లు వేయాల్సి ఉండగా.. 1,757.3 కిలోమీటర్లు వేశారు. ఇక గతంలో ఉన్న 65 ట్యాంకులకు తోడు మరో 33 ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా 32 పూర్తయ్యాయి. యాదవనగర్ లో గత ఏప్రిల్ చేపట్టిన ట్యాంక్ పనులు కొనసాగుతున్నాయి. కాగా మొదటి అంచనా టార్గెట్ ప్రకారం నగరంలో 1.10 లక్షల కొత్త నల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. టార్గెట్ కు మించి 1.19లక్షల కనెక్షన్లు పూర్తి చేశారు.
శిథిలావస్థలో పైపులైన్లు, ట్యాంకులు
గ్రేటర్‌పరిధిలో 2048 వరకు జనాభా 17 లక్షల వరకు చేరే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇంత జనాభాకు కనీసం 295 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కావాలంటే తాగునీటి సరఫరా వ్యవస్థ పకడ్బందీగా ఉండాలి. కానీ గ్రేటర్ సిటీకి నీటిని సరఫరా చేస్తున్న వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట, ధర్మసాగర్ జోన్లలో ఫిల్టర్ బెడ్లను అప్ గ్రేడ్ చేయక తరచూ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. నగరంలో దశాబ్ధాల కిందట వేసిన పైపులైన్లే ఎక్కువశాతం ఉన్నాయి. దీంతో వాటికి తరచూ లీకేజీలు ఏర్పడి.. వేల లీటర్ల నీళ్లు వేస్ట్‌గా పోతున్నాయి. ఇప్పటికే 330.4 కిలోమీటర్ల పాత పైపులైన్ పూర్తిగా ధ్వంసం కావడంతో అమృత్ స్కీం కింద వాటిని రీప్లేస్ చేశారు. వాటర్ ట్యాంకులు కూడా చాలాచోట్ల శిథిలావస్థకు చేరాయి. చాలాచోట్లా నిర్వహణ లేకపోవడంతో కూలిపోయే దశకు చేరుతున్నాయి. దీంతో వాటన్నింటికి తగిన రిపేర్లు చేయించడమో లేదా కొత్తగా నిర్మించడమో చేయాల్సి ఉంది.
రూ.305 కోట్లతో ప్రపోజల్స్
2048 కి జనాభా పెరగనున్న దృష్ట్యా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తాగునీటిని అందించేందుకు గ్రేటర్ ఆఫీసర్లు మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించారు. పాతవి, కొత్తవి అన్నీ కలిపి 98 వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌లు ఉండగా.. అదనంగా మరో 30 నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. కొన్నిచోట్ల పాత పైపులైన్లు శిథిలం కావడంతో కొత్తగా 300 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేయాల్సిందిగా గుర్తించారు. దీంతో మొత్తం పనులకు రూ.305 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాగా అమృత్ 2.0 కింద నిధులు శాంక్షన్చేస్తే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తాగునీటి సరఫరా వ్యవస్థను చక్కదిద్దే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.