జలవనరుల పెంపు సక్సెస్

జలవనరుల పెంపు సక్సెస్
  • జనగామ జిల్లాలో  కేంద్ర జలశక్తి వనరుల శాఖ అధికారుల పర్యటన      
  •  భూగర్భ జలాల పెరుగుదలపై హర్షం

బచ్చన్నపేట, వెలుగు:  కేంద్ర జలశక్తి వనరుల శాఖ ఆధ్వర్యంలో రూ. 2.50 కోట్లతో 2019–20లో  చేపట్టిన భూగర్భ జల వనరుల పెంపు విధానం పరిశీలించడానికి బుధవారం కేంద్ర జలశక్తి అడిషనల్ సెక్రటరీ శుభోద్ యాదవ్ బృందం  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో పర్యటించింది.  అయిదేళ్ల క్రితం కేంద్ర  జలశక్తి వనరుల శాఖ గంగాపూర్,  నాగిరెడ్డిపల్లి, పడమటికేశ్వపూర్ ప్రాంతాల్లో ఆరు చెక్‌ డ్యాంలు, ఒక భూగర్భ చెక్ డ్యాం, ఎనిమిది బోరు బావులు, 18 రీచార్జ్ బోరు బావులు తవ్వించారు. 

ఈ బోర్లలో చిప్ లు ఏర్పాటు చేసి నీటి వనరుల తీరును ఢిల్లీ నుంచి పరిశీలించేవారు. ఇలాంటి ప్రాజెక్టులు దేశంలో ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, రాజస్థాన్​, తెలంగాణలో మాత్రమే ఏర్పాటు చేశారు.  తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గంగాపూర్​, నాగిరెడ్డిపల్లి, పడమటికేశ్వపూర్​లో వాప్​కో సంస్థ చేపట్టిన ఈ ప్రాజెక్టు ఫలించి  భూగర్భ జలాలు పెరిగి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో తెలంగాణలో చేపట్టిన ఈ  ప్రాజెక్టుకు కేంద్ర అవార్డు దక్కింది.  దీంతో గంగాపూర్​, పడమటికేశ్వాపూర్​ నాగిరెడ్డిపల్లి గ్రామాల్లోని జలవనరులను చూసి  అభినందించారు. 

ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని  చేపట్టాలి 

జనగామ జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని చేపట్టి ఇక్కడ భూగర్భ జలవనరులు పెంచాలని జనగామ డీఆర్​డీవో  కేంద్ర జలశక్తి మంత్రిత్వ అడిషనల్ సెక్రటరీ శుబోద్ యాదవ్ ను కోరారు.  దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.  సర్కార్​ ఆఫీస్​లపై రూప్​ టాప్​ రీచార్జీ పిట్స్​ ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఇస్తే తక్షణమే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

బృందం వెంట జలశక్తి మంత్రిత్వశాఖ రీజనల్​ డైరెక్టర్​(దక్షిణ ప్రాంత) కృష్ణమూర్తి, రాష్ట్ర ఆఫీసర్లు ద్వివేది, అద్వైన్​, రవికుమార్​, జనగామ డీఆర్​డీవో వసంత, ఎంపీడీవో మల్లికార్జున్​, సంస్థ క్లస్టర్​ టీఏ శ్రీనువాసురెడ్డి, ఏపీవో కృష్ణ, లోకల్​ టీఏ భాను, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్​ రైతులు ఉన్నారు.