వాగులు ఎండినయ్.. కుంటలు ఇంకుతున్నయ్ !..కవ్వాల్​ టైగర్ జోన్ లో వన్యప్రాణుల దాహార్తి తీరేనా?

వాగులు ఎండినయ్.. కుంటలు ఇంకుతున్నయ్ !..కవ్వాల్​ టైగర్ జోన్ లో వన్యప్రాణుల దాహార్తి తీరేనా?
  •  ఏప్రిల్, మే లో నీటి కొరత తీవ్రమయ్యే చాన్స్  
  • ర్యాంప్​వెల్స్​, సాసర్​పిట్స్​ఏర్పాటుకు చర్యలు   
  • ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తామంటున్న ఆఫీసర్లు
  • గ్రామాల్లోకి రాకుండా చూడాలంటున్న ప్రజలు

జన్నారం, వెలుగు: సమ్మర్ లో ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్​టైగర్​ జోన్​లోని వన్య ప్రాణులకు నీటి కొరత పొంచి ఉంది. ఎండలు ముదురుతుండగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వాగులు ఎండిపోయాయి. నీటికుంటలు కూడా ఇంకుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రమైతే నీటి ఎద్దడి ఏర్పడనుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమిం చేందుకు ఫారెస్ట్​ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టారు. అవి ఎంతవరకు ఫలితం ఇస్తాయనే దానిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి నుంచే అడవిలో నీటి కొరత నివారణకు మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 
 

వాగుల్లో నీటి జాడలు కనిపించట్లేదు  

కవ్వాల్​టైగర్ జోన్​పరిధిలో సహజంగా ఏర్పడిన వాగులు ఇప్పటికే ఎండిపోయాయి. రెండు నెలలుగా ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. చాలా వాగుల్లో నీటి జాడలు కూడా కనిపించడం లేదు. కొన్నిచోట్ల వాగులపై చెక్​డ్యామ్ ల మాదిరిగా రాళ్లు, ఇసుక, మట్టితో కట్టలు వేసి నీటిని నిల్వ చేస్తున్నారు. ఇలా నిరుడు 30 కట్టలు నిర్మించారు. మరోవైపు వన్యప్రాణుల దాహర్తి తీర్చడంతో పాటు గ్రౌండ్​వాటర్​పెంచేందుకు సుమారు 300 నీటి కుంటలను ఏర్పాటు చేశారు. వాటిలో 113 వరకు ఎండిపోగా, మరో 187 కుంటల్లో నీళ్లున్నాయి. రానున్న రెండు నెలల్లో మరో వంద కుంటలు అడుగంటిపోయే అవకాశమున్నట్టు ఫారెస్టు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 

ర్యాంప్​వెల్స్, సాసర్​ పిట్సే ఆధారం 

అడవుల్లో నీటి ఊటలు ఉన్న చోట చిన్న సైజు ర్యాంప్​వెల్స్​ను ప్రత్నామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. మూడు మీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పుతో గుంతలు తవ్వి జంతువులు అందులో దిగి నీళ్లు తాగేందుకు వీలుగా ర్యాంపులు నిర్మిస్తున్నారు. ఇలాంటి ర్యాంప్​ వెల్స్​నిరుడు 25 తవ్వగా, ఈసారి 30 వరకు తవ్వినట్టు అధికారులు చెబుతున్నారు.

మరోవైపు సోలార్​పంపుల ద్వారా ఎండిపోయిన కుంటలను నింపే చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతేడాది 18 సోలార్​పంపులు వినియోగించగా,  ఈసారి 29 పంపులను ఏర్పాటు చేశారు. ఇక నీటికుంటలు, సోలార్​ పంపులు, ర్యాంప్​ వెల్స్​ లేనిచోట సాసర్​ పిట్స్​ను ట్యాంకర్లతో నింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

జనావాసాల్లోకి వస్తే ఇబ్బందులే..

గతంలో ఎండకాలంలో వన్యప్రాణులు జంతువుల దాహార్తి తీర్చేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. అడవుల్లో నీళ్లు లేకపోవడంతో జంతువులు తరచూ జనావాసాల్లోకి వచ్చేవి. దీంతో  ప్రమాదాల్లో, వేటగాళ్ల బారినపడి చనిపోయేవి. ఇప్పుడు అలాంటి లేకున్నా రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసముంది. నీటికోసం అడవి నుంచి బయటకు వచ్చే జంతువులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఫారెస్ట్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అడవి సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

ఫారెస్ట్ లోంచి భగీరథ పైపులైన్ వెళ్తుండగా.. 

జన్నారం ఫారెస్ట్​ డివిజన్​లోంచి మిషన్​ భగీరథ పైపులైన్​వెళ్తున్నందున 19 చోట్ల కుంటల్లో నీటిని నింపి వాడుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జింకల పునరావాస కేంద్రం వద్ద కూడా వన్యప్రాణులకు అందిస్తున్నారు. బేస్​క్యాంపు సిబ్బంది, బీట్​ఆఫీసర్లు రోజూ కుంటలను పరిశీలిస్తున్నారు. వేసవిలో అటవీ జంతువులకు నీటి కొరత రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. 

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం 

ఎండకాలంలో అడవి జంతువుల దాహం తీర్చడానికి అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నాం. సోలార్​పంపులతో కుంటలను నింపడంతో పాటు ర్యాంప్ వెల్స్​నిర్మిస్తున్నాం. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సాసర్​పిట్స్​నింపి జంతువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. - సుష్మారావు, ఫారెస్ట్​రేంజ్​ ఆఫీసర్, జన్నారం