తాగునీరు సరఫరా చేయండి..బిందెలతో మహిళల ఆందోళన

మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయి..ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా..క్షేత్ర స్థాయిలో మాత్రం అమలవడం లేదు. తాజాగా  కొత్తగూడెం మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడితో అలమటిస్తున్నారు. తాగునీరు సరఫరా చేయాలంటూ బిందెలతో నిరసన తెలిపారు. 

9 రోజులుగా నీళ్లు లేవు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తాగునీటి కోసం మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. కిన్నెరసాని మంచినీటిని ప్రతీ రోజు విడుదల చేయాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయం ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన నిర్వహించారు.  వారం రోజులుగా కిన్నెరసాని మంచినీళ్లు రాకపోవడంతో  తాము ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.  తనకు తాను అపర భగీరథుడిగా చెప్పుకునే వనమా వెంకటేశ్వరరావు 9 రోజులుగా కొత్తగూడెం పట్టణంలో తీవ్రస్థాయి మంచినీటి ఎద్దడి ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మెల్యే,  స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని  కిన్నెరసాని మంచినీళ్లను రోజు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.