
SLBC సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను వెలికితీసేందుకు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. బేరింగ్ మిషన్ ను కట్ చేసి కార్మికులు ఉన్న చోటుకు దాదాపు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆగకుండా వస్తున్న నీటి ఊట వలన పనులకు ఆటంకం కలుగుతోంది. పెద్ద పెద్ద కొండల, బండలపైనుంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు కొండలపైన నీళ్లు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్న కలుగుతోంది.
నిరంతరంగా వస్తున్న నీటి ఊటతో పనులు ఆటంకం కలుగుతున్నందున నీటి జాడ తెలుసుకునేందుకు జియోలాజికల్ టీమ్ అన్వేషణ మొదలుపెట్టింది. టన్నెల్ పైభాగంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది. ఆ ప్రాంతంలో నీటి ఆధారాలు ఎక్కడ ఉన్నాయో పరిశీలిస్తున్నారు.
వాగుల ప్రవాహం వల్లే సొరంగంలోకి నీటి ధారలు:
సొరంగంలోకి వాగుల ప్రవాహం వల్లే నీటి ఊట వస్తోందని అధికారులు గుర్తించారు. మల్లెల తీర్థం దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ కృష్ణా నదివైపు ప్రవహిస్తోందని, మల్లెల తీర్థం నుంచి పెద్ద అంతర ప్రవాహం కూడా పారుతున్నట్లు గుర్తించారు. అదే విధంగా ప్రమాద స్థలం 450 మీటర్ల పైభాగంలో నీటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. పైభాగంలో ఉన్న అంతర ప్రవాహాల వలన ఊట పెరుగుతోందని జియోలాజికల్ టీమ్ స్పష్టం చేసింది. అమ్రబాదు టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉర్సు వాగు, మల్లె వాగులు మల్లెతీర్థం వైపు నుంచి కృష్ణా నది వైపు ప్రవాహిస్తుండటంతో ఊట వస్తున్నట్లుగా గుర్తించారు.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గర ఫిబ్రవరి 22 ఉదయం ప్రమాదం జరిగింది. రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది.. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు టన్నెల్ లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.