- వరంగల్ జూపార్క్‌లో జంతువుల రక్షణకు ప్రత్యేక చర్యలు
- ఎండ వేడికి అల్లాడుతున్న మూగజీవాలు
- ఎన్‌క్లోజర్లలో వేడిని తగ్గించేలా నీటిని స్ర్పే చేస్తున్న సిబ్బంది
- డీ హైడ్రేషన్‌కు గురికాకుండా పండ్లు, ఓఆర్‌ఎస్ పౌడర్
వరంగల్, వెలుగు: ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో మనుషులతో పాటు జంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జూపార్క్‌లో ఉండే జంతువులకు ఎండవేడిమి నుంచి రక్షణ కల్పించడంతో పాటు, అవి డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ జూలోని జంతువుల ఎన్‌క్లోజర్లలో వేడిని తగ్గించేందుకు నిరంతరం నీటిని స్ర్పే చేస్తుండడంతో పాటు, కూలర్లు ఏర్పాటు చేశారు. మరో వైపు జంతువులు, పక్షులకు ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తున్నారు.
చలువ పందిళ్లు, కూలర్లు, స్ర్పింక్లర్ల ఏర్పాటు వరంగల్ జూలో 10 జాతులకు చెందిన 164 జంతువులు ఉన్నాయి. ఐదు జాతులకు చెందిన 72 సరీసృపాలు, 29 జాతులకు చెందిన 181 పక్షులు ఉన్నాయి. ఉష్టోగ్రతలు భారీ స్థాయిలో పెరగడంతో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు ఎన్‌క్లోజర్లను దాటి బయటకు రావడం లేదు. నెమళ్లు, రామచిలుకలు, వివిధ రకాల పక్షులు ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నాయి. దీంతో జంతువులు, పక్షులకు ఉపశమనం కల్పించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. చిరుతల కోసం కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు, అవి ఉండే బోన్ల చుట్టూ బస్తాలు కట్టి, ఎన్‌క్లోజర్‌పైన స్ర్పింక్లర్లు ఏర్పాటు చేసి నీటిని చల్లుతున్నారు. ఎలుగుబంట్లు ఉండే బోన్లలో కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు, అవి బయట తిరిగే టైంలో వాటర్ గన్స్‌తో నీళ్లు చల్లుతున్నారు. మరికొన్ని జంతువులు, పక్షులు ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేయడంతో పాటు, ఆస్ట్రిచ్, నెమళ్లను నీటితో తడుపుతున్నారు.
ఆహారంలో పండ్లు, ఓఆర్‌ఎస్ పౌడర్లు
ఉష్ణోగ్రతలు భారీస్థాయిలో పెరిగిన నేపథ్యంలో జంతువులు, పక్షుల ఆహారంలోనూ మార్పులు చేశారు. చిరుతపులులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా వెటర్నటీ డాక్టర్ల పర్యవేక్షణలో ఓఆర్‌ఎస్ పౌడర్లు అందజేస్తున్నారు. ఎలుగుబంట్లకు పుచ్చకాయలు, తర్పూజలు ఇస్తున్నారు. జింకలు, దుప్పులకు మినరల్స్ అందేలా సాల్ట్ లిక్స్ (ఉప్పు గడ్డలు) అందే ఏర్పాటు చేశారు. నెమళ్లు, రామచిలుకలు, పక్షులకు మంచినీటిలో గ్లూకోజ్ పౌడర్‌ను కలిపి ఇస్తున్నారు.