
- రిజర్వాయర్‌లో 11 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
- కాకతీయ కెనాల్‌కు ప్రతి రోజు 4 వేల క్యూసెక్కులు విడుదల
- కరీంనగర్‌తో పాటు ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాలకు సాగునీరు
కరీంనగర్, వెలుగు : వ్యవసాయ అవసరాలకు కరీంనగర్‌తో పాటు ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల రైతులకు రెగ్యులర్‌గా సాగునీరు విడుదల చేస్తుండడంతో లోయర్ మానేరు డ్యామ్ నీటి మట్టం సగానికి పడిపోయింది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ కెపాసిటీ 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 11 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.
ఇందులో నుంచి మరో 4 టీఎంసీల నీటిని ఈ నెలాఖరు వరకు సాగు అవసరాలకు విడుదల చేసే అవకాశం ఉంది. మిగతా నీటిని కరీంనగర్ పట్టణ తాగునీటి అవసరాలతో పాటు మిషన్ భగీరథ వాటర్ సప్లైకి వినియోగించనున్నారు.
మార్చి 31 వరకు నీటి విడుదల
కరీంనగర్, ఉమ్మడి వరంగల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు యాసంగి పంటలకు నీరందించేందుకు ఎల్‌ఎండీ నుంచి కాకతీయ మెయిన్ కెనాల్‌కు 2024 డిసెంబర్ 31న నీటి విడుదలను ప్రారంభించారు. మార్చి 31 వరకు ఆన్ అండ్ ఆఫ్ విధానంలో జోన్ -1, జోన్ -2లోని 6.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ ఇంజినీర్లు ప్లాన్ చేశారు.
యాసంగి సాగు, తాగునీటి అవసరాలకు సరిపడా నీళ్లు ఎల్ఎండీలో నిల్వ ఉన్నాయని, మిడ్ మానేరు నుంచి రోజూ 2,500 క్యూసెక్కుల నీరు వస్తోందని ఆఫీసర్లు వెల్లడించారు. ఇన్‌ఫ్లోకి మరో 1500 క్యూసెక్కులు కలిపి మొత్తం 4 వేల క్యూసెక్కుల నీటిని నిత్యం కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా విడుదల చేస్తున్నామని వెల్లడించారు. కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందుతోందని, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో చివరి ఆయకట్టులో కొంత మేర అందడం లేదని తెలిపారు.